
అమెరికాలొ వాల్‌స్ట్రీట్ కంపెనీల దోపిడికి, వాల్‌స్ట్రీట్ కంపెనీలకు సహకరిస్తున్న పాలకుల విధానాలకూ వ్యతిరేకంగా అమెరికన్లు సాగిస్తున్న ఆందోళనలు అక్టోబరు 4 తేదీతో 19 వ రోజుకి చేరుకున్నాయి. సెప్టెంబరు 17 తేదీన న్యూయార్క్ లో కొద్దిమందితో మొదలైన “వాల్‌స్ట్రీట్ ను ఆక్రమించండి” ఉద్యమం, క్రమంగా ఇంతింతై, వటుడింతై అన్నట్లుగా అమెరికాలోని అన్ని రాష్ట్రాలకూ పాకింది. అస్ధిర ఆర్ధిక వ్యవస్ధపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, కార్పొరేట్ కంపెనీల అత్యాశను నిరసిస్తూ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకుల శాఖలను ప్రదర్శనలు, ఆందోళనలతో ముంచెత్తుతున్నారు. లాస్ ఏంజిలిస్ నుండి మాయిన్ వరకూ పార్కుల్లోనూ, వీధి పక్కనా కేంపులు ఏర్పాటు చేసుకుని నిరంతర ఆందోళనలతో తీరిక లేకుండా గడుపుతున్నారు.
అనేక ప్రజా సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నారు. కొంతమంది వారితో జత కలుస్తున్నారు. తమ మద్దతును ఇంటర్నెట్ ద్వారా, వీడియోల ద్వారా తెలియ జేస్తున్నారు. సోమవారం న్యూయార్క్ నగరం మన్‌హట్టన్ లో నిరసన కారులు కార్పొరేట్ జోంబీల అవతారం ఎత్తారు. ముఖానికి తెల్లపెయింట్ వేసుకుని న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజి ముందు ప్రదర్శని నిర్వహించారు. డబ్బులాంటి కాగితాలను విరజిమ్ముతూ నిరసన తెలిపారు. చికాగోలో ప్రదర్శకులు నగర ఆర్ధిక డిస్ట్రిక్ట్ లో జొరబడి డ్రమ్ము వాయిద్యాలతో హోరెత్తించారు. కొంతమంది టెంట్ లు నిర్మించుకుని నిరసన తెలుపుతుండగా, మరికొందరు రోడ్డుపై వెళ్తున్నవారికి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ తమ లక్ష్యాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నారు. బోస్టన్, సెయింట్ లూయిస్, కన్సాస్ నగరం, లాస్ ఏంజిలిస్ మొదలైన నగరాల్లో ఈ ప్రదర్శనలు సాగుతున్నాయి.
భవిష్యత్తు గురించి బెంగతో ఉన్న కాలేజి విద్యార్ధుల దగ్గర్నుండి ఇటీవలే ఉద్యోగాలు కోల్పోయిన మధ్య వయస్కుల వరకూ అనేకమంది ఆందోళనలలో చేరుతున్నారు. గత శనివారం న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ బ్రిడ్జిపై 700 కు పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో నిరసన మరిన్ని నగరాలకు వ్యాపించింది. తమను తాము నిరసనకారులు నియంతలను కూల్చిన అరబ్ ఉద్యమాలతో పోల్చుకోవడం గమనించదగ్గ విషయం. “వాషింగ్టన్ నగరంలో ఉండవలసిన అధికారం వాల్‌స్ట్రీట్ కు తరలించబడిందని మేము భావిస్తున్నాం. మాకూ గొంతు కావాలి. గత కొన్ని సంవత్సరాలుగా మా గొంతులను నొక్కివేస్తూ వచ్చారు” అని ఓ కంప్యూటర్ సిస్టమ్స్ విశ్లేషకుడు చెప్పినట్లుగా “ది హిందూ” తెలిపింది.
సెప్టెంబరు 17 తేదీన కేవలం కొన్ని డజన్లమంది నిరసనకారులు న్యూహార్క్ స్టాక్ ఎక్ఛేంజి ముందు గుడారాలు వేయడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత సమీపంలోనే ఉన్న పార్కులో కొన్ని వందలమంది గుడారాలు వేసుకుని నిరసనలో చేరారు. క్రమంగా నిరసన సంఘటిత రూపం తీసుకోవడం ప్రారంభమయ్యింది. వైద్య సహాయం, న్యాయ సహాయం, సొంత వార్తా పత్రిక “ఆకుపైడ్ వాల్‌స్ట్రీట్ జర్నల్” మొదలైన సౌకర్యాలను సమకూర్చుకున్నారు. సెప్టెంబరు 24 న 100 మందిని అరెస్టు చేశారు. కొంతమంది నిరసనకారులపై పోలీసులు పెప్పర్ ను జల్లారు. అక్టోబర్ 1 తేదీన బ్రూకిలిన్ బ్రిడ్జిపైకి వెళుతున్న 700 మందిని అరెస్టు చేసి, అక్రమ ప్రవర్తన, వీధుల్లో ట్రాఫిక్ అడ్డగింపు లాంటి కేసులు నమోదు చేశారు. సోమవారం మరో ఐదుగురిని అరెస్టు చేసామని పోలీసులు తెలిపారు.
“ఇప్పటికైతే పెద్ద నిరసనలు వస్తాయని భావించడం లేదు. ఏమైనా జరిగినట్లయితే న్యూయార్క్ పోలీసులు, ఎఫ్.బి.ఐ తమ బలగాలను నియమిస్తుంది” అని న్యూయార్క్ ఎఫ్.బి.ఐ ప్రతినిధి తెలిపాడు. బ్రిటన్ తరహా అల్లర్లగా మారే అవకాశం లెదని ఆయన చెప్పాడు. కాలిఫోర్నియా తదితర రాష్ట్రాలనుండి కూడా న్యూయార్క్ లో నిరసనలకు హాజరు కావడం విశేషం. అరెస్టులతో వారు మరింత ఆగ్రహం చెందారు. “పోలీసుల క్రూరత్వం బైటపెట్టాలని నేను అనుకోలేదు. కాని అది నేను ఎదుర్కోవలసి వచ్చింది. ఉపయోగం కనిపించేంతవరకూ న్యూయార్క్ ను వదల కూడదని నిశ్చయించుకున్నాను” అని ఒక కాలిఫోర్నియా మహిళ వ్యాఖ్యానించిందని ‘ది టెలిగ్రాఫ్’ తెలిపింది.
తమ బస్సులను బలవంగంగా అరెస్టయిన ఆందోళనకారులను తీసుకెళ్లడానికి వినియోగించినందుకు న్యూయార్క్ సిటీ బస్సు డ్రైవర్లు కోర్టులో కేసు దాఖలు చేశారు. “మేము ఈ నిరసనకారులకు మద్దతునిస్తున్నాము. ధనికులు తమ న్యాయమైన వాటాను దేశానికి చెల్లించడం లేదన్న వారి వాదన మాకు నచ్చింది” అని ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు జాన్ సామ్యూల్సన్ తెలిపాడు. “ఆందోళనకారులను ఎక్కడైనా అరెస్టు చేయడానికి బలవంతంగా వినియోగించడాన్ని మేమిక అంగీకరించం” అని ఆయన తెలిపాడు. సోమవారం నిరసనకారులు మన్‌హట్టన్ వీధుల పక్క నిలబడి జోంబీ అవతారాల్లో నినాదాలిచ్చారు. “లోటును ఎలా తగ్గించాలి? – యుద్ధాన్ని ముగించండి, ధనికులపై పన్నులు వేయండి” అని నినాదాలిచ్చారు.
కొంతమంది నిరసనకారులు ఇతర నగరాలకు వెళ్ళడానికి పధకాలు వేసుకున్నారు. లాస్ ఏంజిలిస్, వాషింగ్టన్, తదితర నగరాల మధ్య నిరసనకారులు ప్రయాణిస్తూ నిరసనను వ్యాప్తి చెందించడానికి ప్రయత్నిస్తున్నారు. బోస్టన్ లో టెంట్ సిటి నిర్మించుకున్నారు. “ఆకుపై బోస్టన్” ఆందోళనను వారు నిర్వహించారు. ఫిలడెల్ఫియాలో “ఆకుపై ఫిలడెల్ఫియా” కార్మక్రమం నిర్వహించారు. వెబ్ సైట్లలో వార్తలను పోస్ట్ చేస్తూ ప్రచారానికి వినియోగిస్తున్నారు. బోస్టన్ ప్రదర్శనకారులు తమ గుడారాలని నినాదాలతో అలంకరించారు. “ధనికులతో తలపడండి, యుద్ధాలు చేయడం కాదు”, “మానవ అవసరాలు, కార్పొరేట్ అవసరాలు కాదు” లాంటి నినాదాలను రాసిన ప్లెకార్డులను రాసి ప్రదర్శించారు.
చికాగోలో డ్రమ్ములు బాదుతూ ప్రదర్శన నిర్వహించారు. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆవ్ చికాగో వద్ద నిలబడి నినాదాలిచ్చారు. లాస్ ఏంజిలిస్ లో తమ నిరసనకు ప్రచారం కల్పించుకోవడానికి మైఖేల్ జాక్సన్ హత్యపై విచారణ జరుగుతున్న కోర్టు ముందు గుమికూడి నినాదాలిచ్చారు. సెయింట్ లూయిస్ లో నిరసన కారులు ప్లెకార్డులు ప్రదర్శించారు. “పిల్లి ఎందుకంత లావుగా ఉంది?”, “వారి ఆటలో నువ్వొక పావువి మాత్రమే”, “గోల్డ్ మాన్ సాచ్ మా వద్ద దొంగిలించిన బంగారం సంచులు మాకు తిరిగి ఇవ్వండి” లాంటి నినాదాలను రాసి ప్రదర్శించారు.
అమెరికా ప్రజలు బడా బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగ వీధుల్లోకి రావడం ఒక శుభ పరిణామం.
