సాధారణ ఎన్నికలు జరగడానికి ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉందనగానే బి.జె.పి లో పదవీ కుమ్ములాటలు మొదలైనట్లు కనిపిస్తోంది. శుక్ర, శనివారాలలో జరిగిన బి.జె.పి జాతీయ కార్యవర్గ సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి హాజరు కాకుండా ఎగవేయడంతో ఈ కుమ్ములాటలు బైటికి వచ్చాయి. మోడి రాకపోవడాన్ని బి.జె.పి ప్రతినిధులు చిన్నవిషయంగా కొట్టి పారేస్తున్నప్పటికీ ఆయన గైర్హాజరీకి వారు ఇచ్చిన కారణాలు ఒకరికొకరు పొంతన లేకుండా ఉండడంలోనే అసలు విషయం వెల్లడవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశంలో రాజకీయ పరిస్ధితిపై ఒక అంచనాకు రావడానికీ, అవినీతి విషయంలో పాలక పార్టీ కాంగ్రెస్ పై యుద్ధానికి వ్యూహం పన్నడానికీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రయత్నిస్తుందని బి.జె.పి ప్రతినిధులు తెలిపారు. మోడితో పాటు కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి బి.ఎస్.యెడ్యూరప్ప, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తప్ప ఇతర ప్రముఖులంతా బి.జె.పి కార్యవర్గ సమావేశాలకు హాజరైనారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది.
నరేంద్ర మోడి, ఎల్.కె.అద్వాని ల మధ్య విభేధాలు తలెత్తాయని భావిస్తున్న నేపధ్యంలో మోడి గైర్హాజరీ ప్రాముఖ్యత సంతరించుకుంది. అవినీతిపై పోరాటానికి వ్యూహం పన్నే కార్యక్రమంలో భాగంగా అద్వానీ చేపట్టనున్న రధ యాత్ర అంశంపై బి.జె.పి నిర్ణయం తీసుకోనున్నది. అద్వానీ రధయాత్రను నరేంద్ర మోడి వ్యతిరేకిస్తున్నాడని పత్రికలు చెబుతున్నాయి. నరేంద్ర మోడి వ్యతిరేకత వల్లనే అద్వానీ తన రధ యాత్రను గుజరాత్ కు బదులు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేతులమీదుగా బీహార్ నుండే ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడని పత్రికలు చెబుతున్నాయి. అయితే రధయాత్ర గుజరాత్ బదులు బీహార్ నుండి ప్రారంభిస్తున్నందుకే మోడి అలిగాడని మరికొన్ని పత్రికలు రాశాయి. ఏది ముందో, ఏది వెనకో అర్ధం కాకుండా ఉంది.
మోడీ గుజరాత్ లో నవరాత్రి ఉత్సవాలలో పాల్గొంటున్నందున జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరు కాలేక పోయాడని కొందరు బి.జె.పి నాయకులు చెబుతుండగా ఆయన అసలు నవరాత్రి ఉత్సవాలలోనే పాల్గొనడం లేదని గుజరాత్ నుండి వచ్చిన వార్తల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ నవరాత్రిలో పాల్గొంటున్నప్పటికీ జాతీయ కార్యవర్గ సమావేశాల కంటే దసరా ఉత్సవాలు ముఖ్యమైనవేమీ కాదు. కాదు కాదు ఆయన గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడని ఇంకొందరు చెబుతున్నారు. ఏది వాస్తవమో తెలియదు.
బి.జె.పి తరపున ప్రధాని పదవికి పోటీపడడానికి నరేంద్ర మోడి కూడా నిర్ణయించుకున్నాడని ఆయన ఇటీవల చేపట్టిన ‘సద్భావనా మిషన్’ ద్వారా లోకానికి వెల్లడయ్యింది. అందులో భాగంగానే గుజరాత్ ప్రజలకు బహిరంగ లేఖను విదుదల చేసి పరోక్షంగా తన ఉద్దేశాన్ని వెల్లడించినట్లు భావిస్తున్నారు. మోడీ తనకా ఉద్దేశ్యం లేదని చెబుతున్నప్పటికీ ఆయన ఉపన్యాసాలు, లేఖలో ప్రస్తావించిన అంశాలూ, ముస్లింలకు స్నేహ హస్తం చాస్తున్నట్లుగా చేసిన వ్యాఖ్యలు అన్నీ ఆయన ఉద్దేశ్యాన్ని తేటతెల్లం చేశాయి.
తాజాగా అద్వానీ రధయాత్రపై తలెత్తిన విభేధాలు విశ్లేషకుల ఊహలకు పదును పెట్టాయి. బి.జె.పి కేంద్ర నాయకత్వం మాత్రం అద్వానీ, మోడీల మధ్య తలెత్తాయంటున విభేధాల గురించి ఏమీ మాట్లాడడం లేదని ‘ది హిందూ’ పేర్కొన్నది. సుపరిపాలన, నితిమంతమైన రాజకీయాలు అన్న రెండు అంశాలపై అద్వాని అక్టోబర్ 11 నుండి చేయనున్న రధయాత్రను మోడి వ్యతిరేకిస్తున్నాడని వార్తలు వస్తున్నాయని ఆ పత్రిక పేర్కొన్నది.
తన రధాయాత్ర పొడుగునా మత కల్లోలాలు రేపి విధ్వంసాన్ని ఒకరు సృష్టిస్తే, మొత్తం ముస్లిం మతస్ధులపైనే ప్రభుత్వ పరంగానే హత్యాకాండకు పురిగొల్పి వేలమందిని పొట్టన బెట్టుకుని మధ్య యుగాల అనాగరిక శైవ వైష్ణవ యుద్ధాలను జ్ఞప్తికి తెచ్చిన అత్యంత కిరాతక రాజకీయ నాయకుడు మరొకవైపు. భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి పదవికి అభ్యర్ధులుగా ఇద్దరు విధ్వంసకారులనూ, ఇద్దరు హంతకులను, శాకాహారులమని చెప్పుకుంటున్న ఇద్దరు మేకవన్నె పులులనూ దేశానికి అందిస్తోంది. హత విధీ!!!
