“దైవ దూషణ” హత్య నిందితుడికి పాక్ కోర్టు మరణ శిక్ష



“దైవ దూషణ”కు పాల్పడ్డాడంటూ పాకిస్ధాన్ లోని రాష్ట్ర గవర్నర్ ను దారుణంగా కాల్చి చంపిన పోలీసు అధికారికి పాకిస్ధాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. పాకిస్ధాన్ లో ‘దైవ దూషణ’ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ అనేక సార్లు ఉపన్యాసాలు ఇచ్చాడు. అటువంటి చట్టాలు ప్రజాస్వామిక వ్యవస్ధలకు ఆటంకాలని పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని తస్సీర్ ప్రచారం చేశాడు. బ్లాస్ఫెమీ నేరానికి శిక్ష పడ్డ ఆసియా బీబీ అనే వ్యక్తి శిక్షకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు.

బ్లాస్ఫెమీ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న తసీర్ స్వయంగా బ్లాస్ఫెమీకి పాల్పడుతున్నట్లుగా ఆయనకు రక్షణగా ఉన్న పోలీసు అధికారులలో ఒకరైన మాలిక్ ముంతాజ్ ఖాద్రి భావించాడు. జనవరి 4, 2011 తేదీన మిత్రుడి ఇంటిలో విందు ముగించి కారును సమీపిస్తున్న తసీర్ ను ఆయన బాడీ గార్డు ఖాద్రి మెసిన్ గన్ తో కాల్చి చంపాడు. తసీర్ శరీరం నుండి 26 తూటాలను పోస్ట్ మార్టం సందర్భంగా వెలికి తీసారు.

తసీర్ అంతిమ యాత్రలో పాల్గొన వద్దనీ, ఆయనని ఖనం చేసేటప్పుడు ఎవరూ శ్రద్ధాంజలి ఘటించవద్దని ముస్లిం మత పెద్దలు ఫత్వా జారీ చేసినప్పటికీ ఎవరూ దానిని లెక్క చేయలేదు. తసీర్ అంతిమయాత్రమ్ళ్ వేలాదిగా పాల్గొని తమ గౌరవాన్ని ప్రకటించారు. ఖననం కార్యక్రమానికి కూడా అనేకవేలమంది వచ్చి పాల్గొన్నారు. బ్లాస్ఫెమీ చట్టాలకు వ్యతిరేకంగా తన పోరాటంలో తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదనీ కాని ఇంటివద్ద కాల్చి చంపితే కాల్పుల వేడికి తన తోట పాడైపోతుందేమో నన్నదే తన భయమనీ తసీర్ తన మరణానికి కొన్ని రోజుల ముందు ట్విట్టర్ ఖాతాలో రాసుకున్నట్లుగా ఆ తర్వాత వెల్లడయ్యింది.

తసీర్ పై కాల్పులు జరిపాక నిందితుడు ముంతాజ్ ఖాద్రి ఎక్కడికీ పారిపోలేదు. అక్కడే నిలబడి స్వయంగా అరెస్టుకు సహకరించాడు. తానే నేరానికి పాల్పడ్డానని అంగీకరించాడు. తసీర్ ప్రచారం ముస్లిం మతానికి హాని కలుగ జేస్తున్నదని తాను బలంగా అభిప్రాయపడ్డాననీ అందుకె చంపాననీ కోర్టులో ప్రకటించాడు. బ్లాస్ఫెమీ చట్టాలకు వ్యతిరేకించినందుకు తసీర్ చంపబడడానికి అర్హుడని ఖాద్రి ప్రకటించాడు. కోర్టు ఖాద్రిపై నేరం రుజువైనట్లు ప్రకటించి మరణ శిక్ష విధించింది. ఖాద్రిపై విచారణ రహస్యంగా జరిగింది. మీడియాను అనుమతించలేదు.

పాకిస్ధాన్ సమాజంలో ముస్లిం మత ఛాందస భావాలకూ, ఆధునిక సెక్యులరిస్టు భావాలకు జరుగుతున్న తీవ్ర ఘర్షణను తసీర్ హత్య ఎత్తి చూపుతున్నది. ఆ సమాజంపై బాహ్య శక్తులు మరింత ఒత్తిడి తీసుకొస్తూ అక్కడ ఏర్పడుతున్న ప్రగతిశీల మార్పులకు సహకారం అందించవలసిన అవసరం ఉన్నది. దాని బదులు పాకిస్ధాన్ మత మౌఢ్యం పేరుతో ఆ దేశాన్నీ, దేశస్ధులను విమర్శించడం ముస్లిం మతస్ధులందర్నీ ఒకే గాటన కట్టి రాక్షసులుగా చిత్రించబూనుకోవడం మరొక పద్ధతి మౌఢ్యం అవుతుంది తప్ప ప్రగతిశీల భావజాలం కాబోదు. విమర్శకు దిగుతున్నవారు, పాక్ సమాజంలో వస్తున్న మార్పులనూ, ఆ మార్పుల క్రమంలో బలవుతున్న తసీర్ లాంటివారి త్యాగాలను గుర్తించవలసిన అవసరం ఉన్నది.

వ్యాఖ్యానించండి