2011 సంవత్సరంలో ఎమర్జింగ్ దేశాలలో అత్యధికంగా నష్టపోయిన షేర్ మార్కెట్లలో భారత దేశ షేర్ మార్కెట్లు ప్రధమ స్ధానంలో నిలిచాయి. మిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ పెట్టుబడులు భారత దేశ షేర్ మార్కెట్లనుండి తరలివెళ్ళిపోయాయి. శుక్రవారం సెన్సెక్స్ సూచి 1.46 శాతం నష్టపోయి 16453.8 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. జర్మన్ పార్లమెంటు గ్రీసు బెయిలౌట్ ప్యాకేజిని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడంతో భారత షేర్ మార్కెట్లలో సెన్సెక్స్ సూచి, గురువారం 1.5 శాతం లాభం పొందింది. కాని ఒక్కరోజు గడవడంతోనే జర్మనీ ఓటు తాలూకు సానుకూల ప్రభావం షేర్ మార్కెట్లపై జీరోగా మారింది.
జర్మన్ పార్లమెంటు మొత్త యూరో భద్రతా నిధికి ఆమోదం పొందినప్పటికీ అంతర్జాతీయ మదుపుదారులు యూరప్ రుణ సంక్షోభం పట్ల ఆశావాదంతో వ్యవహరించ లేకపోతున్నారని స్పష్టమవుతున్నది. మార్కెట్లను సంతృప్తి పరచడానికి దేశాల ప్రభుత్వాలు ప్రజలపై అనేక రకాలుగా భారాలు మోపుతూ ప్రభుత్వరంగాలను ప్రవేటీకరించి వారికి అప్పజెపుతున్నప్పటికీ అవి ఇంకా మరిన్ని బలులను కోరుతూ, తమకు లాభాలను సమకూర్చిపెట్టడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాయి. అటువంటి ఆశలు నెరవేరేవిధంగా ప్రభుత్వాల చర్యలు లేనట్లయితే మరు నిమిషంలోనే ప్రతికూల ప్రభావాలను షేర్ మార్కెట్లలో చూపుతూ ప్రభుత్వాలకు హెచ్చరికలు పంపుతున్నాయి.
మార్కెట్ ఎకానమీలోని ప్రవేటు మదుపుదారులు లేదా పెట్టుబడుదారులు ఆర్ధిక వ్యవస్ధలను తమ చేతుల్లో ఉంచుకుని ఒక విధంగా పెట్టుబడిదారీ వ్యవస్ధలోని ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాయి. పొదుపు ఆర్ధిక విధానాల లాంటి చర్యల ద్వారా రుణ సంక్షోభం లో ఉన్న దేశాల ఆర్ధిక వ్యవస్ధలను మరింతగా ప్రవేటీకరించి తమకు అప్పజెప్పాలని అవి కోరుతున్నాయి. అది ఉపరితలంలో షేర్ మార్కెట్లను బలి తీసుకోవడం ద్వారా తమ ప్రభావాన్ని చూపుతూ, తమ అంచనాలను బహిరంగ పరుస్తున్నాయి. తమ అంచనాలకు తగ్గట్లుగా ప్రభుత్వాల వద్దనుండి యూరోపియన్ యూనియన్ ల వరకూ విధానాలను రూపొందించేలా ఒత్తిడి తెస్తున్నాయి.
మార్కేట్ శక్తుల బ్లాక్ మెయిలింగ్ కు పెట్టుబడిదారీ దోపిడి ప్రభుత్వాలు అత్యంత ఇష్టంతో స్పందిస్తున్నాయి. అవి కోరిందే తడవుగా గ్రీకు, ఐర్లండు, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ లాంటి దేశాలలో ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ కంపెనీల ప్రవేటీకరణకు, ఉద్యోగాల రద్దుకు, సంక్షేమ విధానాల రద్దు లేదా కోత లాంటి ప్రజా వ్యతిరేక చర్యలకు దిగుతున్నాయి. ప్రభుత్వాలు స్పందించే కొద్దీ మార్కెట్ శక్తులు తమ డిమాండ్లను పెంచుతూ పోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వాలు మార్కేట్ శక్తుల గొంతెమ్మ కోర్కెలను తీర్చలేని స్ధాయికి చేరుకుంటున్నాయి లేదా మరింతగా ప్రజలపై భారాలను మోపి ప్రజాగ్రహాలకు గురవుతున్నాయి. గ్రీసు ఆందోళనలే అందుకు దృష్టాంతం.
గ్రీసు ఆర్ధిక వ్యవస్ధ అత్యంత ఘోరమైన స్ధాయికి క్షీణించినప్పటికీ ఆ దేశంలో నామ మాత్రంగా ఉన్న ప్రభుత్వ కంపెనీలను సైతమ్ అమ్మేయాలని మదుపుదారులు, ప్రవేటు బహుళజాతి గుత్త సంస్ధలు డిమాండ్ చేస్తున్నాయి. నెమ్మదిగా ఐర్లండు, పోర్చుగల్ దేశాలు కూడా ప్రవేటు సంస్ధలు, ఇతర మార్కెట్ శక్తుల గొంతెమ్మ కోర్కెలకు బలికానున్నాయి. ఈ జాడ్యం స్పెయిన్, ఇటలీ లకు ఆ తర్వాత ఫ్రాన్సు, జర్మనీలకు కూడా వ్యాపించే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. పెట్టుబడిదారీ అర్ధిక వ్యవస్ధలు తమ చరమాంకాలకు చేరుకోవడంతో మరింతగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అవి చరమాంకానికి చేరుకునే కొద్దీ ప్రజలు, కార్మికులపై ఆర్ధిక దాడులు తీవ్రమవుతాయి. చివరికి కార్మికులు తెగించి రోడ్డున పడేదాక ఈ ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
