పాక్ ద్వేషులకు దుర్వార్త, భారత్ పాక్‌లు వాణిజ్య బంధం పటిష్టం చేసుకుంటున్నాయి


ఇది మన పొరుగు దేశం పాకిస్ధాన్‌ను అకారణంగా ద్వేషించేవారికి నిజంగా దుర్వార్తే. భారత్, పాకిస్ధాన్ దేశాలు తమ మధ్య వాణిజ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. వాణిజ్య బంధాలను పటిష్టం చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లయితే అటువంటి చర్యలు ఇరు దేశాలు భవిష్యత్తులో మరింత సమీప సంబంధాలను అభివృద్ధి కావడానికి దోహదపడతాయని రెండు దేశాలు భావిస్తున్నాయి.

పాకిస్ధాన్ వాణిజ్య మంత్రి ‘మక్దూమ్ అమిన్ ఫాహిమ్’ ప్రస్తుతం ఆరు రోజుల ఇండియా పర్యటనలో ఉన్నాడు. భారత వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ, పాక్ వాణిజ్య మంత్రితో కలిసి కొన్ని ఉమ్మడి ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. వాఘా వద్ద కొత్త చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు. మరొక ప్రతిపాదనను భారత దేశం అంగీకరించింది. యూరోపియన్ యూనియన్, పాకిస్ధాన్ కు అందించిన వాణిజ్య రాయితీల పట్ల ఇండియా అభ్యంతరం చెబుతూ వచ్చింది. వాణిజ్య మంత్రుల ప్రతిపాదన ప్రకారం ఇండియా ఈ అభ్యంతరాలను ఉపసంహరించుకుంటుంది.

మూడు సంవత్సరాల అనంతరం భారత్ పాక్ దేశాల వాణిజ్య మంత్రుల మధ్య చర్చలు జరగడం ఇదే మొదటిసారి. గత ఆదివారం ఇండియాకు వచ్చిన ఫహీమ్ తనతో పాటు 80 మందికి పైగా సభ్యులు గల వాణిజ్య ప్రముఖుల బృందాన్ని వెంట తెచ్చాడు. ఇరు దేశాల వాణిజ్యవేత్తలు సరిహద్దుల మధ్య తేలికగా రాకపోకలు సాగించడానికి వీలుగా వీసా నిబంధనలను సడలించే విషయాన్ని ఇరు పక్షాలు చర్చిస్తున్నాయి. రెండు వైపులా పెట్టుబడుల ప్రవాహాన్ని ప్రోత్సహించే వైపుగా చర్చలు జరుపుతున్నారు.

పాకిస్ధాన్ నుండి 75 రకాల ఉత్పత్తులను పన్నులు లేకుండా యూరోపియన్ యూనియన్ దేశాలకు ఎగుమతులు చేయడానికి వీలుగా ప్రాధాన్యతను ఇస్తామని ఇ.యు నిర్ణయించింది. ఇది మూడేళ్లపాటు కొనసాగాలని నిర్ణయించారు. ప్రపంచ వాణిజ్య సంస్ధలో, ఈ నిర్ణయానికి ఇండియా అభ్యంతరం తెలిపింది. తాజా చర్చలలో ఈ అభ్యంతరాన్ని ఇండియా ఉపసంహరించుకుంటుందని భావిస్తున్నారు. ఈ చర్యను ఇండియా, పాక్ కు ఇస్తున్న పెద్ద చర్యగా పరిగణించకపోవడం విశేషం. ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా దానిని చేపట్టాలని ఇరు దేశాలు భావిస్తున్నాయని ‘ది టెలిగ్రాఫ్’ తెలిపింది. పాకిస్ధాన్ కు ఇస్తున్న పన్ను రహిత ఎగుమతి అనుమతుల వలన ఇండియా ఎగుమతులకు పెద్దగా నష్టం రాదని భారత ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది.

విశ్వాసం పెంపుదల కోసం మరొక చర్య తీసుకోనున్నారు. పంజాబ్ లోని వాఘా వద్ద కొత్త చెక్ పోస్టును తెరవడం రెండవ చర్య. భూతల మార్గంలో వాణిజ్యం ఖర్చు తక్కువ కనుక ఈ నిర్ణయం తీసుకున్నారు. వాఘా వద్ద ఇప్పటికే ఒక చెక్ పోస్టు ఉంది. ఇక్కడ ప్రతి రోజూ సాయంత్రం 3 గంటలకు వాణిజ్యం ఆగిపోతుంది. ఆ సమయాని టూరిస్టుల కోసం “బీటింగ్ రిట్రీట్” కార్యక్రమం నిర్వహిస్తారు. అది ముగిసాక వాణిజ్యం బంద్ అవుతుంది. ఈ కారణం వలన మరొక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి దానికి రాత్రి 7 గంటలవరకూ తెరిచి ఉంచాలని నిర్ణయించనున్నారు. తద్వారా వాణిజ్య మొత్తం పెరుగుతుందని ఆశిస్తున్నారు.

అయితే, పాకిస్ధాన్ లో రాజకీయంగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నందున ఇండియాకు “మోస్ట్ ఫేవర్డ్ నేషన్” హోదాను ఇవ్వడానికి పాక్ నిర్ణయం తీసుకోలేక పోతున్నది. దానికి బదులుగా భారత్ నుండి చేసే దిగుమతులను రెట్టింపు చేయడానికి పాకిస్ధాన్ నిర్ణయించుకుంటుందని భారత వాణిజ్య అధికారులు చెబుతున్నారు. పాక్ వాణిజ్యమంత్రి ఫహీమ్ భారత పరిశ్రమల అధిపతులతో చర్చలు జరుపుతున్నాడు. ఇరు దేశాల వాణిజ్యవేత్తలు కూడా చర్చలు జరుపుతున్నారు.

ఇండియాకి చెందిన “కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్” (సి.ఐ.ఐ) ఇటీవల ఒక అధ్యయనం జరిపింది. ఆరోగ్య సంరక్షణ, ఐ.టి, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమ తదితర అంశాలలో పరస్పరం మార్పిడిలు చేసుకున్నట్లయితే అది ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడమే కాక ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు పటిష్టమవుతాయని ఆ అధ్యయనంలో తేలినట్లుగా సి.ఐ.ఐ తెలిపింది. తద్వారా ఇరు పక్షాల మధ్య విశ్వాసం పెరుగుతుందని ఆ సంస్ధ తెలిపింది.

ఇరు దేశాల మధ్య వ్యాపారం జరిగే సరుకుల సంఖ్యను పెంచడానికీ, కస్టమ్ పన్నుల విషయంలో మరిన్ని సానుకూల చర్చలు జరపడానికి ఆసక్తిగా ఉన్నారని టెలిగ్రాఫ్ తెలిపింది. ఇరు దేశాలు శతృవులనీ, కనుక పాకిస్ధాన్ ప్రజలకు అనుకూలంగా ఏమీ రాయగూడదనీ, అలా రాస్తే అది మాతృదేశానికి ద్రోహం చేసినట్లేననీ, అది దేశభక్తి కాదనీ కొంతమంది బ్లాగర్లూ, పాఠకులూ భావిస్తున్నారు. రాయడం, భావించడం సంగతి అటుంచి ఏకంగా వాణిజ్య సంబంధాలనే పెంచుకోవడానికి భారత్, పాక్ ప్రభుత్వాలు నిర్ణయించుకుని అమలు చేస్తున్నాయి.

యు.పి.ఎ ప్రభుత్వమే కాదు. ఎన్.డి.ఎ పాలనలో కూడా అప్పటి ప్రధాని వాజ్‌పేయి పాక్ సందర్శించడం, ముషార్రఫ్ ఇండియా సందర్శించడం ఒకరినొకరు పరస్పరం వివిధ అంశాలలో ఇచ్చి పుచ్చుకోవడం జరిగాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరగడానికి అప్పటి చర్చలే దోహదం చేశాయి. ఇక రధయాత్ర హీరో ఎల్.కె.అద్వాని అయితే తన పుట్టిన ఊరు లాహోర్ సందర్శించి పనిలో పనిగా జిన్నాను గొప్ప సెక్యులరిస్టుగా పొగిడి మరీ వచ్చాడు. మరి మన ముస్లిం ద్వేషులు, పాకిస్ధాన్ అనగానే ఆవేశం తెచ్చుకునేవారు అప్పుడేమి చేశారో తెలియదు. ఇప్పుడేమి అంటారో చూడవలసి ఉంది. వ్యాపారం విషయంలో మతం గితం జాంతానై అంటారా? అనగలరా?

వ్యాఖ్యానించండి