“అమెరికా సైనికులను కాపాడుకునే విషయానికి వస్తే, ఒకచోట పరిమితి ఉంటుందని అనుకోలేము. సైనికులను పాకిస్ధాన్ భూభాగం దించడం గురించి కాదు నేను చెబుతున్నది. ఆ విషయం గురించి నేను మాట్లాడడం లేదు. కాని డ్రోన్ ల కంటే అతీతంగా అనేక అస్సెట్లు మావద్ద ఉన్నాయి” అని గ్రాహం వివరించాడు. మిలట్రీ ఒత్తిడిని పెంచాలని అమెరికా విధాన కర్తలు భావించక తప్పదని పేర్కొన్నాడు. తమ ప్రయోజనాల పరిరక్షణకు అంతకు తప్ప మరొక మార్గం లేదని ప్రజలకు అర్ధమైనపుడు ఆ విధానాలకు ప్రజలు మద్దతు ఇవ్వడం ఖాయం అని పేర్కొన్నాడు.
కొద్దివారాల క్రితం అమెరికా ఎంబసీపై జరిగిన రాకెట్ల దాడి హక్కాని గ్రూపు పనేననీ, ఆ గ్రూపుకి పాక్ మిలట్రీ గూఢచారి సంస్ధ ఐ.ఎస్.ఐ మద్దతు ఉందనీ అమెరికా ఆర్మీ ఉన్నతాధికారి మైక్ ముల్లెన్ ఆరోపించిన సంగతి విదితమే. ఈ ప్రకటనపై పాకిస్ధాన్ తీవ్రంగా స్పందించింది. అదేపనిగా పాకిస్ధాన్ పై ఆరోపణలు చేస్తూ పోతే అమెరికా ఒక మితృడుని కోల్పోవలసి ఉంటుందని కూడా పాక్ హెచ్చరించింది. పనిలో పనిగా చైనావైపు మొగ్గు చూపుతున్నట్లుగా పాకిస్ధాన్ అధికారులు, ప్రధాని ప్రకటనలు జారీ చేస్తున్నారు. చైనాకు శతృవు అయినవారు తమకూ శతృవులే అని పాక్ ప్రధాని గిలాని మూడు రోజుల క్రితం ప్రాకటించాడు.
పాక్, అమెరికాల మధ్య చెడుతున్న సంబంధాలు ఇండియా అమెరికాల మధ్య సంబంధాల మెరుగుకు తోడ్పడుతున్నాయి. దక్షిణాసియాలో ఇప్పటివరకూ పాకిస్ధాన్ పైన ప్రధానంగా ఆధారపడుతూ వచ్చిన అమెరికా ఇప్పుడు ఇండియాపైన తన ప్రయోజనాలను నెరవేర్చే దేశంగా ముందుకు తెస్తున్నది. తద్వారా ఇండియాలో ఉండే సహజ వనరులను కొల్లగొట్టడంతో పాటు అక్కడి ప్రజా ఉద్యమాలను అణచివేశే బృహత్తర పధకాలకు ఇండియా, అమెరికాలు అవసరమైన పునాదిని ఏర్పరుచుకుంటున్నాయి.
హక్కాని గ్రూపికి అమితంగా భయపడుతున్న అమెరికా, పాకిస్ధాన్ ను ఆ గ్రూపును మట్టుబెట్టాలని ఒత్తిడి చేస్తున్నది. పాక్‌తో హక్కానీకి సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నది. పాక్ దానిని నిరాకరిస్తున్నది. పాకిస్ధాన్ పై అమెరికా సాగిస్తున్న కఠినమైన ప్రకటనలు పాకిస్ధాన్ ను అదుపులో పెట్టడం కంటే దేశీయంగా రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు ఉద్దేశించినవని చెబుతున్నవారు లేకపోలేదు.
