తెలంగాణ సకలజనుల సమ్మె, 17వ రోజు మంత్రుల ఇళ్ల నిర్బంధం


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె అప్రహతిహతంగా కొనసాగుతోంది. భారత దేశ చరిత్రలోనే మున్నెన్నడూ లేనంతగా, ఒక్క నెల్లిమర్ల జూట్ కార్మిక ఉద్యమం తప్ప, సమాజంలోని దాదాపు అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులు తమ తమ విధులను బహిష్కరించి ఉద్యమించడమే కాక సమ్మెలు చేస్తున్నవారంతా రోడ్లపైకి వచ్చి నినదిస్తూ తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక రకాల రూపాల్లో సమ్మెలో పాల్గొంటూ కనీ వినీ ఎరుగని సంయమనంతో శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. శాంతియుత ఉద్యమమే తెలంగాణ ఉద్యమ బలహీనత అన్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ సకల జనుల సమ్మె పట్ల బదిరాంధ దృష్టితో వ్యవహరించడం, ఇంత పెద్ద ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ ప్రజల డిమాండ్లకంటే స్వార్ధ ప్రయోజనాలకు అగ్రస్ధానం ఇవ్వడం కూడా గతంలో ఎరగనట్టిదే.

సకలజనుల సమ్మె పదిహేడవరోజూన తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎం.ఎల్.ఎల ఇళ్లను నిర్బంధించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా, హైద్రాబాద్‌తో పాటు తొమ్మిది ఇతర జిల్లాల్లో ఉన్న పాలక కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎం.ఎల్.ఎ ల ఇళ్లలోకి చొరబడడానికి ప్రయత్నించినందున, తెలంగాణ రాజకీయ జె.ఎ.సి కార్యకర్తలను డజన్ల మందిని పోలీసులు అరెస్టు చేశారు. ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తిస్తూ టి.ఆర్.ఎస్, సి.పి.ఐ (ఎం.ఎల్-న్యూ డెమొక్రసీ), బి.జె.పి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ప్రజా ప్రతినిధుల ఇళ్లను దిగ్బంధనం కావించారు. తెలంగాణ సమస్యపై కాంగ్రెస్ నాయకుల మౌనాన్ని నిరసిస్తూ, సింగరేణి కాలరీస్ లో సమ్మెను కారణంగా చూపి ఒక్క తెలంగాణ జిల్లాల్లో మాత్రమే రైతులకు కూడా కరెంటు కోత విధిస్తున్నందుకు నిరసిస్తూ టి.జె.ఎ.సి ప్రజా ప్రతినిధుల ముట్టడులకు పిలుపునిచ్చింది.

టి.ఆర్.ఎస్ నాయకుడు కె.సి.ఆర్, కాంగ్రెస్ నాయకుల ఇళ్లపై దాడులు చేయాలని పిలుపునివ్వడంతో ఎం.ఎల్.ఎల ఇళ్లవద్ద పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసారు. ఉద్యమకారులు పోలీసుల అరెస్టులను ప్రతిఘటించడంతొ కొన్ని చోట్ల ఉద్రిక్తతలు తలెత్తాయి. హైద్రాబాద్ లోని కార్మికమంత్రి డి.నాగేందర్ ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించడంతో పోలీసులు తెలంగాణ లాయర్లను అరెస్టు చేసారు. నాగేందర్ ను లాయర్లు ‘ద్రోహి’ గా అభివర్ణిస్తూ నినాదాలు ఇచ్చారు. హైద్రాబాద్ లో ఉన్న కుత్బుల్లాపూర్ ఎం.ఎల్.ఎ శ్రీశైలం గౌడ్ ఇంటిని కూడా ఉద్యమకారులు ముట్టడించారు. అయితే ఎం.ఎల్.ఎ ఉద్యమకారులకు సమాధానం ఇస్తూ తన నియోజకవర్గంలో ఉన్న ఆంధ్ర, తెలంగాణ ప్రజలు కూడా తనకు ఓట్లు వేసి గెలిపించినందున తాను రాజీనమా చేయలేనని వివరించాడు. “నేనూ తెలంగాణ బిడ్డనే. కాని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా నాకు ఓట్లు వేసారు” అని ఆయన వివరణ ఇచ్చుకున్నాడు.

4 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో ప్రభుత్వ కార్యాలయాలేవీ పని చేయలేదు. రాష్ట్ర పరిపాలన తెలంగాణ జిల్లాల్లో పూర్తిగా బందయ్యింది. టీచర్లు, లాయర్లు, డాక్టర్లు అందరూ సమ్మెలో పాల్గొంటున్న సంగతి విదితమే. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పదిహేడవ రోజు కూడా కుంటుబడింది. సమ్మె ప్రారంభం అయినప్పటినుండి ఇప్పటివరకూ సింగరేణి సంస్ధ రు.500 కోట్లు నష్టపోయిందని తెలుస్తోంది. దాదాపు 70,000కు పైగా సింగరేణి ఉద్యోగుల్లో మెజారిటీ కార్మిక్కులు సమ్మెకు దిగడంతో బొత్తు ఉత్పత్తి బాగా పడిపోయింది. తెలంగాణలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధకు చెందిన పదివేలకు పైగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రవాణా స్తంభించిపోయింది. బస్సుల రవాణా బంద్ కావడం ఇది వరుసగా పదకొండవ రోజు కావడం విశేషం.

రాష్ట్ర సెక్రటేరియట్ పై కూడా సకలజనుల సమ్మె ప్రభావం కనపడుతోంది. సమ్మెలో ఉన్న ఉద్యోగులు గురువారం కూడా ప్రదర్శన నిర్వహించారు. అయితే బుధవారం కొద్దిమంది ఉద్యోగులను అరెస్టు చేసినందుకు నిరసనగా, గురువారం ‘సెక్రటేరియట్ బంద్’ నిర్వహించాలని ఇచ్చిన పిలుపుకి పెద్దగా స్పందన రాలేదు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆంధ్ర, రాయలసీమ ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. పోలీసులతో పాతు రేపిడ్ ఏక్షన్ ఫోర్స్ (ఆర్.ఎ.ఎఫ్) కూడా సెక్రటేరియట్ లో భద్రతా ఏర్పాట్లు నిర్వహించింది. సెక్రటేరియట్ ఉద్యోగులు అధికంగా నివసించే వలస్ధలిపురంలోనూ తెలంగాణ ఉద్యోగులు బస్సులను అటకాయించడానికి ప్రయత్నించడంతో అక్కడ కూడా భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు.

తెలంగాణ కోసం డిమాండ్ ఉధృతంగా ఉన్నప్పటికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏమాత్రం స్పందన లేకుండా పడి ఉండడం అత్యంత దుర్మార్గమైన విషయం. ఇప్పటికీ కాంగ్రెస్ వారూ ఏకాభిప్రాయ సాధన పేరుతో చర్చలకు సమయం కావాలని కోరుతుండడం మరింత దుర్మార్గం. ఇన్నాళ్లు చర్చలు చేయకుండా ఈ పార్టీ కేంద్ర నాయకులు ఏ గాడిదలు కాశారన్నది ప్రశ్నగా ఉదయిస్తున్నది. లగడపాటి లాంటి బఫూన్ రాజకీయ నాయకులు సీమాంద్ర ప్రజల కోసం అని నటిస్తూ సొంత పెట్టుబడుల ప్రయోజనాల కోసం విభేధాలు రెచ్చగొడుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలి. తెలంగాణ ఉద్యమం కీలక స్ధాయికి చేరినప్పుడల్లా ఈ బఫూన్ హైద్రాబాద్ లో ప్రత్యక్షమై కాలుతున్న ఇంటిలో బొగ్గులు ఏరుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రానికి సంబంధించి కొత్త చరిత్రను రచిస్తున్న ఈ రాజకీయ నాయకుడు ధనబలంతో రాజకీయ యవనికపై స్ధానం సంపాదించడం అతి పెద్ద రాజకీయ అభాస.

వ్యాఖ్యానించండి