జూనియర్ అధికారిదే పాపం అంతా, ప్రణబ్ నోట్ పై చేతులు దులుపుకున్న మంత్రివర్యులు


“2జి కుంభకోణ చోటు చేసుకున్న రోజుల్లో ఆర్ధిక మంత్రిగా వ్యవహరించిన పి.చిదంబరం, స్పెక్ట్రంను వేలం వేయడమే సరైందన్న తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లయితే కుంభకోణం జరగడానికి ఆస్కారం ఉండేది కాదు” అంటూ ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఆర్ధిక శాఖలోని డెప్యుటీ సెక్రటరీ, ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపిన నోట్ లో పేర్కొన్న సంగతి ప్రణబ్ ముఖర్జీ తనకు సంబంధం లేదనీ, అంతా ఆ జూనియర్ అధికారి చేసిందే నంటూ గురువారం విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు.

అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలను అసలు ప్రాముఖ్యత ఏమీ లేని అంశాలుగా ముద్ర వేయడంలోనూ, అసలు ప్రాముఖ్యత ఏమాత్రం లేని అంశాలకు విస్తృత ప్రచారం కల్పించి, కేంద్రీకరించి ప్రముఖంగా మార్చడంలోనూ భారత పాలకులు ప్రావీణ్యం సంపాదించారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద తలలు ఈ విధ్యలో మాస్టర్లుగా పేర్కొనవచ్చు. వీరు మరొక్క సారి తమ బుర్రలకు పని చెప్పడంతో పి.చిదంబరం పట్ల వేలెత్తి చూపిస్తున్న ప్రణబ్ ముఖర్జీ రహస్య నోట్ ఇప్పుడు అప్రాముఖ్యంగా మారే ప్రమాదంలో పడింది.

గురువారం ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ లు కూడా పాల్గొన్న విలేఖరుల సమావేశంలో ప్రణబ్ ముఖర్జీ తన శాఖనుండి వచ్చిన నోట్ విషయమై తనకు బాధ్యత లేదనీ జూనియర్ అధికారి సొంత తెలివితేటలనీ ప్రకటించాడు. ఆ తర్వాత ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటనను తాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన చిదంబరం, ఈ విషయమ్ ఇంతటితో ‘పరి సమాప్తం’ అని ప్రకటించాడు. ఆ విధంగా నలుగురు మంత్రివర్యులు కలిసి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక అధికారిక ‘నోట్’ ను, అనధికారిక నోట్ గా ప్రాముఖ్యం లేనిధిగా మార్చివేశారు.

అదే నిజమైతే అంత ప్రాముఖ్యత లేని నోట్ కు స్పందించిన పి.చిదంబరం, సోనియా గాంధీ దగ్గర రాజీనామా చేయడానికి సిద్ధం అని ఎందుకు తెలిపినట్లు? అమెరికా పర్యటనలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ, నోట్ వెలువడిన వెంటనే హుటా హుటిన న్యూయార్క్ లోనే ఉన్న ప్రధాని మన్మోహన్ ను కలిసి ఎందుకు వివరణ ఇచ్చుకున్నట్లు? దానితో పాటు ఇండియాలో ఉన్న చిదంబరానికి కూడా ఫోన్ చేసి తన నోట్ పైన వివరణ ఎందుకు ఇచ్చుకున్నట్లు? అమెరికాలోనే ఉండి తన శాఖ నోట్ ను ఆర్.టి.ఐ దరఖాస్తుకు లోబడి విడుదల చేయడం పట్ల ప్రధాని కార్యాలయాన్ని ప్రణబ్ ముఖర్జీ ఎందుకు తప్పు పట్టినట్లు? 2జికి సంబంధించి సమస్త రికార్డులను తమకు సమర్పించాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ రహస్య నోట్ లను తమకు ఎందుకు సమర్పించలేదంటూ జెపిసి సమావేశం పి.ఎం.ఓ పై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు?

అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టడానికి పత్రికలు ప్రయత్నిస్తే ఉపయోగం ఉంటుంది.

వ్యాఖ్యానించండి