కనుమరుగవుతున్న డాలర్ ఆధిపత్యం -కార్టూన్


ఇన్నాళ్లూ ప్రపంచ ఆర్ధిక సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుకున్న డాలర్ క్రమంగా తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నది. రెండు దురాక్రమణ యుద్ధాలు, వాటి కారణంగా వేగంగా సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం లు డాలర్ బలాన్ని నేలమట్టం చేస్తున్నాయి. ఏ ‘ఎదురులేని ప్రపంచాధిపత్యం’ కోసమైతే అమెరికా దురాక్రమణ యుద్ధాలకు తెగబడిందో అదే ఆధిపత్యాన్ని అమెరికా ఇప్పుడు కోల్పోతున్నది.

సంక్షోభంలో బడా కంపెనీలకు ట్రిలియన్ల డాలర్ల బెయిలౌట్లు మంజూరు చేసి కొండంత అప్పును అమెరికా మూటగట్టుకుంది. ఆ అప్పుల భారాన్ని ఇప్పుడు ప్రజలపై మోపి వారి కొనుగోలు శక్తిని హరించివేసింది. ఫలితంగా కొనుగోళ్లు లేక అధిక ఉత్పత్తి సంక్షోభం తలెత్తి ఉత్పాదక, అనుత్పాదక కంపెనీలన్నీ ద్రవ్య మార్కెట్ లో లాభాలు సంపాదించడానికి పోటీ పడుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాలు కరువయ్యాయి. నిరుద్యోగం పెనుభూతమై అమెరికా ఆర్ధిక వ్యవస్ధను లోపలినుండి క్షీణింప జేస్తోంది.

Dollar supremacy

ఈ నేపధ్యంలోనె చైనా అనేక దేశాలతో కరెన్సీ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. టర్కీ, బ్రెజిల్, రష్యా లాంటి పెద్ద ఎమర్జింగ్ దేశాలతో వ్యాపారాలను తమతమ కరెన్సీలలోనే చేసుకోవడానికి ఒప్పందాలు చేసుకుంది. అంటే వారి ద్వైపాక్షిక వాణిజ్యంలో డాలర్ పాత్ర ఇక ఉండదు. మరోవైపు రుణ సంక్షోభం దెబ్బకు యూరోజోన్ విఛ్చిన్నమయ్యే ప్రమాదాలు ముంచుకొచ్చి, యూరోను బలహీన పరుస్తున్నది. యూరోప్ రుణ సంక్షోభం సైతం డాలర్ విలువను కిందికి లాగుతోంది.

ఫలితంగా ప్రపంచ దేశాలు పూర్తిగా డాలర్లలో విదేశీ మారక ద్రవ్యాన్ని నిలవ చేసుకునే బదులు తమ నిల్వలని వివిధీకరిస్తున్నాయి. ఒక్క డాలర్లలో మాత్రమే కాకుండా డాలర్ల నిల్వలలో కొన్నింటిని ఇతర ప్రధాన కరెన్సీలయిన యూరో, యువాన్ తదితర కరెన్సీలకు తరలిస్తున్నాయి. అంటే అంతర్జాతీయ కరెన్సీగా అనధికార హోదా కలిగి ఉన్న డాలర్ ఇప్పుడు క్రమంగా తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నదనే.

వ్యాఖ్యానించండి