రిటైల్ రంగాన్ని త్వరలోనే మీకు అప్పజెపుతాం, విదేశీ ప్రవేటు కంపెనీలకు ఇండియా హామీ


కోట్లాది డాలర్ల విలువ గల భారత రిటైల్ రంగాన్ని విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెపడానికి భారత ప్రభుత్వం చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నదని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆర్.పి.సింగ్ హామీ ఇచ్చాడు. 450 బిలియన్ డాలర్ల (రు. 20 లక్షల కోట్లు) విలువ గల భారత రిటైల్ రంగం వాల్ మార్ట్ లాంటి ప్రపంచ స్ధాయి కంపెనీలకు అప్పగిస్తామని భారత ప్రభుత్వం చాలా కాలంగా హామీ ఇస్తున్నప్పటికీ దానిని అమలు చేయడం లేదని పశ్చిమ దేశాల ప్రభుత్వాలు, కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. రాయిటర్స్ లాంటి విదేశీ వార్తా సంస్ధలు పదే పదే ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ సంస్కరణల విధానాలను పార్లమెంటు ఆమోదించలేక పోతున్నది కనుక ప్రభుత్వానికి పక్షవాతం వచ్చినట్లుగా అభివర్ణిస్తున్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రభుత్వ అధికారులను, మంత్రులను రిటైల్ రంగాన్ని ఎప్పుడు ప్రవేటీకరిస్తున్నారంటూ ప్రశ్నలు వేస్తూ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఆసియాలో మూడవ అతి పెద్ద ఆర్ధిక వ్యవస్ధ ఐన ఇండియాలో సూపర్ మార్కెట్లకు అనుమతి ఇచ్చే ప్రక్రియ వేగం పుంజుకుంటున్నదని భారత అధికారులు హామీ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదంటూ ఇప్పుడు కూడా రాయిటర్స్ నిష్టూరపోయింది. ఉపాధి పెద్ద ఎత్తున కోల్పోవలసి రావడంతో ఈ చర్య ప్రజలను అగ్రహానికి గురి చేస్తుందన్న ఆందోళన వలన యు.పి.ఎ ప్రభుత్వం తన హామీ నెరవేర్చడానికి వెనకాడుతోందని రాయిటర్స్ సరిగ్గానే గుర్తించింది. అయితే దీర్ఘకాలికంగా సూపర్ మార్కెట్ల వలన ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఒక అబద్ధాన్ని కూడా దానితో పాటు ప్రస్తావించింది. ఇదే అబద్ధాన్ని ఆర్.పి.సింగ్ కూడా వల్లె వేయడం విడ్డూరం. వాల్-మార్ట్, కెరేఫర్ ఎస్.ఎస్, టెస్కో పి.ఎ.సి, మెట్రో ఎ.జి లాంటి భారీ సంస్ధలు భారత దేశ రిటైల్ మార్కెట్ ను కొల్లగొట్టడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి.

“దయచేసి ఎప్పుడు అనుమతిస్తున్నదీ అడగొద్దు. కాని మేము చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నాము. ఈ వ్యవహారం ఖచ్చితంగా వెనకబడి లేదని చెప్పగలను” అని ఆర్.పి.సింగ్ రాయిటర్స్ తో చెప్పినట్లుగా ఆ సంస్ధ తెలిపింది. సూపర్ మార్కెట్లు దీర్ఘకాలికంగా ఉపాధి అవకాశాలను పెంచుతాయన్నది ఒక అబద్ధం కాగా, వాటివలన ద్రవ్యోల్బణం తగ్గుతుందని చెప్పడం మరొక పచ్చి అబద్ధం. సూపర్ మార్కెట్లు ప్రవేశించిన దేశాల్లో ధరలు, ముఖ్యంగా ఆహారాల ధరలు తగ్గిన సూచనలు ఎక్కడా లేవు. పైగా ఈ కంపెనీలు పరస్పరం పోటీపడి ధరలు తగ్గించడానికి బదులు పరస్పరం కుమ్మక్కై ధరలు ఇష్టానుసారం పెంచుతున్న ఉదాహరణలే అధికంగా ఉన్నాయి. ధరల్ని పెంచే సూపర్ మార్కెట్లు ద్రవ్యోల్బణాన్ని ఎలా తగ్గిస్తాయో పాలకులు, కార్పొరేట్ పత్రికలు వివరించవలసి ఉంది.

సూపర్ మార్కెట్ల ప్రవేశానికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదని కొంతమంది భావిస్తున్నారు. అదే నిజమైతే ఆర్.పి.సింగ్ చెప్పినట్లు త్వరలోనే విదేశీ సూపర్ మార్కెట్లు రంగ ప్రవేశం చెయ్యవచ్చు. కానీ ఆ తర్వాత సంభవించే పరిణామాలే భారత ప్రభుత్వాన్ని వెనక్కి లాగుతున్నాయి. అవినీతిపై ఆందోళనలు తీవ్రస్ధాయిలో చెలరేగిన నేపధ్యంలో ఈ ‘వెనక్కి లాగుడు’ ఇంకా బలంగా పనిచేస్తున్నది. రిటైల్ రంగ ప్రవేటీకరణలో విదేశీ ప్రవేటు సంస్ధలకు ఎంత శాతం వాటా ఇవ్వాలన్న విషయంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా, యూరప్ ల ఒత్తిడితో ఇది 51 శాతం వరకు ఉండడానికి ప్రభుత్వం అంగీకరించినట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి. త్వరలోనే సూపర్ మార్కెట్లను విదేశీ కంపెనీలకు అప్పజెప్పే బిల్లుని కేబినెట్ ఆమోదించవచ్చని ఆర్.పి.సింగ్ హామీ ఇస్తున్నాడు.

ఆహార పదార్ధాలను నిలవ చేయడానికి ఆదునిక వసతులు లేనందున ఏటా నలభై శాతం చెడిపోతున్నదని రాయిటర్స్ చెబుతోంది. విదేశీ సూపర్ మార్కెట్లు ఈ ఆధునిక సౌకర్యాల కొరతను తీరుస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రజలకు ఆహార పధార్ధాలను వేగంగా చేరవేయడంలో కూడా వీరు ప్రముఖ పాత్రను తీసుకుంటారని ప్రభుత్వం ఆశిస్తున్నది. ప్రభుత్వ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయన్నది అనుమానమే. ఎందుకంటే విదేశీ, స్వదేశీ పరిశ్రమలు చివరికి ప్రభుత్వాని చెందిన మౌలిక నిర్మాణాలనే వినియోగిస్తున్నాయి తప్ప కొత్త సౌకర్యాలను నిర్మించిన దాఖలాలు లేవు. ప్రభుత్వ రంగంలో అందుబాటులో ఉన్న గోదాములనే విదేశీ ప్రవేటు కంపెనీలు వినియోగిస్తాయని ప్రవేటీకరణ విమర్శకులు ఆరోపిస్తున్నారు.

“మౌలిక రంగాల నిర్మాణంలో వెనుకబాటుతనాన్ని విదేశీ కంపెనీలు పూడుస్తాయని ఆశిస్తున్నాం. నిలవ సౌకర్యాల అభివృద్ధి మాకు ముఖ్యం. విదేశీ కంపెనీలు భారత దేశానికి సరిపడా మోడల్ ను అభివృద్ధి చేయవలసి ఉంటుంది. విలువ గొలుసులో (వాల్యు ఛెయిన్) ఉన్న ఖాళీలను పూర్తి చేయవలసి ఉంటుంది. లేదంటే రిటైల్ రంగ ప్రవేటీకరణ ఫలితాలు వినియోగదారులకు అందుబాటులోకి రాకుండా పోతాయి” అని ఆర్.పి.సింగ్ రాయిటర్స్ తో వ్యాఖ్యానించాడు. అంతిమంగా జరిగేది అదేననడంలో సందేహమ్ లేదు. విదేశీ కంపెనీలు తమకు అందే ఫలితాలను భారతీయ వినియోగదారులకు కూడా భాగం పంచుతాయనడం ఒట్ఠి భ్రమేనని అనేక సార్లు రుజువయ్యింది. ప్రభుత్వం నుండి పన్నుల రాయితీలు పొందుతూ, మరిన్ని సౌకర్యాలను డిమాండ్ చేస్తాయి తప్ప ఇండియా వచ్చే విదేశీ కంపెనీలు భారత దేశ వ్యవస్ధలను అభివృద్ధి చేస్తాయనడం మూర్ఖత్వంతో కూడిన భ్రమ, లేదా మోసం మాత్రమే.

6 thoughts on “రిటైల్ రంగాన్ని త్వరలోనే మీకు అప్పజెపుతాం, విదేశీ ప్రవేటు కంపెనీలకు ఇండియా హామీ

  1. ఇన్నాళ్ళూ ఎమి లేకపోయినా కనీసం చిల్లర కొట్టైనా పెట్టుకుని బ్రతికేవాళ్ళు. ఇప్పుడు దానికి కూడా time దగ్గరపడిందన్నమాట.

  2. ఎవరికి ఏమి అప్పచెపితే మనకేల ? మనము సినిమా భామల బొమ్మలకి కళ్ళు అప్పగించి బతికేద్దాము. అన్నట్లు చాలామంది ప్రజల తీరు ఉన్నప్పుడు ఎవరేం చేయగలరండి ?

    అవినీతి విషయంలో పెద్దాయన హజారే గారు అవినీతి గురించి దీక్ష చేస్తే జనంలో కొద్దిగా చలనం వచ్చినట్లుగా అనిపిస్తుంది.
    మళ్ళీ పెద్దాయన ఓపిక కూడదీసుకునే వరకూ జనాలు సినిమాలు ,వగైరాలూ చూస్తూ కాలక్షేపం చేస్తారు. ఎవరి ఖర్మకు వారే బాధ్యులు. .

  3. మీరు చెప్పిన దానితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.రిటైల్ రంగాన్ని ఎక్కువగా మధ్యతరగతి వ్యాపారులకే విడిచి పెట్టాలి.మాల్స్ కొన్నిఉండవచ్చును గాని వాటికి విదేశీ పెట్టుబడులు అవసరంలేదు.మనదేశంలోనే పెద్ద పెట్టుబడిదార్లు ఉన్నారు.ప్రభుత్వం ఇలాటి జాతీయప్రయోజన వ్యతిరేకచర్యకు పూనుకొంటే ప్రజలు,ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకోవాలి .

వ్యాఖ్యానించండి