అమెరికా ఇండియావైపు మొగ్గడం సమ్మతం కాదు -పాక్ ప్రధాని


దక్షిణాసియాలో అమెరికా పాకిస్ధాన్‌ను విస్మరించి ఇండియావైపు ముగ్గు చూపడం తమకు సమ్మతం కాదని పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పేర్కొన్నాడు. రాయిటర్స్ సంస్ధకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ప్రచ్ఛన్న యుద్ధం కాలమంతా అమెరికా, పాకిస్ధాన్ లు మిత్రులుగా మెలిగిన సంగతిని గుర్తు చేశాడు. అలాంటిది అమెరికా పాకిస్ధాన్ ను వదిలిపెట్టి ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం అమెరికాకి మేలు చేయగల చర్య కాదని గిలాని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

గత ఐదు సంవత్సరాలుగా అమెరికా ఇండియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో భాగంగా చర్చలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే అమెరికా ఇండియాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. అణు సాంకేతిక పరిజ్ఞానంకు సంబంధించిన వ్యాపారంలో ఇండియాను ఏకాకితనం నుండి అమెరికా బైటపడేసిందని పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు గొప్పలు చెప్పుకున్నాయి.

వాస్తవానికి ఇండియాను ఏకాకితనం నుండి బైటపడేసే పేరుతో అమెరికా, యూరప్ లు తమ అణు రియాక్టర్లను అమ్ముకుంటున్నాయి తప్ప ఇండియాకు చేసిన మేలేమీ లేదు. తమ దేశాల్లో అణు రియాక్టర్ల నిర్మాణాన్ని ఎన్నడో ఆపేయడంతో అక్కడి అణు కంపెనీలకు బేరాలు పడిపోయాయి. జనరల్ ఎలెక్ట్రిక్, తోషిబా లాంటి సంస్ధలకు వ్యాపారం పెంచడం కోసం కుదిరిన అణు ఒప్పందాన్ని ఇండియా ఉద్ధరణ కోసం ఇస్తున్నట్లుగా అమెరికా, యూరప్ లు ఫోజు పెడుతున్నాయి.

ఈ నిజాన్ని పక్కనబెట్టి ప్రాంతీయంగానూ, అంతర్జాతీయంగానూ పలుకుబడి పెంచుకుని ఆధిక్యం సాధించడానికి, అమెరికా వద్ద ఎక్కువ మార్లు కొట్టేయడానికి ఇండియా, పాకిస్ధాన్ ల పాలక పార్టీలు పోటీ పడుతూ తమ తమ దేశాల ప్రజల ప్రయోజనాలని ఫణంగా పెడుతున్నారు. దక్షీణాసియాలో ఎందుకు పనికిరాని ఆధిక్యత కోసం పోటీపడుతూ అమెరికా ప్రయోజనాలను నెరవేరుస్తున్నారు. ఆ పోటీలో భాగంగానే పాక్ ప్రధాని గిలాని ప్రకటన చూడాలి తప్ప ఆ ప్రకటనతో భారతీయులు ఆవేశపడడం అనవసరం.

పాకిస్ధాన్ లో విద్యుత్ డిమాండ్, సరఫరా లలో తీవ్రమైన అంతరం ఉందనీ, అల్లర్లు గూడా చెలరేగుతున్నాయనీ, ప్రతిపక్ష పార్టీలు విద్యుత్ కొరత ఏర్పడుతున్నందుకు గోల పెడుతున్నాయనీ గిలానీ వివరించాడు. అటువంటి పరిస్ధితుల్లో అమెరికా పాక్‌ని వదిలి ఇండియాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల గిలానీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. “ఇప్పుడు నేను మా ప్రజలకు ఎలా  నచ్చజెప్పగలను? అమెరికా మన మిత్రుడు అని ఎలా చెప్పగలను?” అని గిలానీ ప్రశ్నించాడు.

అయితే గిలానీ అభ్యంతరాలను అమెరికా తోసి పుచ్చింది. తమకు ఇరువురూ కావలసినవారే అని స్పష్టం చేసింది. అమెరికా వ్యతిరేక ఆందోలనలు పాకిస్ధాన్ లో సర్వ సాధారణంగా మారాయి. పాకిస్ధాన్ ప్రజలు నిజానికి ఇండియాను ఉద్దేశించి తమ ఆందోళనలు కేంద్రీకృతం చేయడం లేదు. మొత్తం మీద పాకిస్ధాన్ ప్రభుత్వం వైఫల్యం పైనా, అమెరికా ప్రయోజనాలకు అంటకాగడం పట్లా వారు అభ్యంతరం చెబుతూ ఆందోళనలు నిర్వహిస్తుండగా, పశ్చిమ దేశాల కార్పొరేట్ మీడియాతో పాటు పాక్ పాలకులు దాన్ని వదిలి అమెరికా ఇండియావైపు మొగ్గడం వలన అమెరికాపై పాక్ జాతీయులు కోపంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నాయి.

3 thoughts on “అమెరికా ఇండియావైపు మొగ్గడం సమ్మతం కాదు -పాక్ ప్రధాని

  1. మొత్తం మీద పాకిస్ధాన్ ప్రభుత్వం వైఫల్యం పైనా, అమెరికా ప్రయోజనాలకు అంటకాగడం పట్లా వారు అభ్యంతరం చెబుతూ ఆందోళనలు నిర్వహిస్తుండగా, – Do you have any proof of this?

    కొన్ని దశాబ్దాలుగా తన వైఫల్యాలని కప్పి పుచ్చుకోవడానికి పాక్ పాలకులు వాడిన మంత్రం భారత్ పై ద్వేషం మాత్రమే

  2. ఎందుకు లేవు? సి.ఐ.ఎ గూఢచారులు 135 మంది ఉంటే వాళ్ళలొ 90 మందిన పాకిస్ధాన్ వెనక్కి పంపింది. ప్రజల వ్యతిరేకత మూలంగానే పాకిస్ధాన్ ప్రభుత్వం అంతటి సాహసానికి పూనుకోగలిగింది. అమెరికా విదిలించే డాలర్ల కోసం ఎదురుచూసే పాక్ మిలట్రీ పాలకులు సి.ఐ.ఎ గూఢచారుల్ని దేశం నుండి పంపించడానికి ఎంతో ఒత్తిడి కావాలి. సాధారణంగా అమెరికా సాయం పొందే దేశాల ప్రభుత్వాలకు తమ మాట వినడం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేకుండా అమెరికా చేస్తుంది.

    మీక్కావలసింది ప్రజల ఆందోళనలకు సంబంధించిన రుజువులా? ఐతే ఇంటర్నెట్ లోనే దొరుకుతాయవి. మరొక వార్తలో లింక్ లు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

  3. 1991 వరకు అమెరికా & పాకిస్తాన్ క్లోజ్ ఫ్రెండ్స్. 1991 తరువాతే పాకిస్తాన్ అమెరికాకి కొంచెం దూరం సాగింది. వాళ్ళిద్దరి ఉమ్మడి శతృవు సోవియట్ యూనియన్ రద్దయ్యింది కాబట్టి పాకిస్తాన్‌కి అమెరికా అవసరం లేకుండా పోయింది. ఇండియాకి వ్యతిరేకంగా ఆయుధాలు అవసరమైనప్పుడు మాత్రం పాకిస్తానీయులు అమెరికాకి సెల్యూట్ చేస్తారు.

వ్యాఖ్యానించండి