అంతా దయానిధి మారన్ వల్లనే -2జి పై ప్రధాని మన్మోహన్


ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2జి కుంభకోణంపై నోరు విప్పాడు. తమ బాధ్యత గురించి మాట్లాడకుండా నేరాన్ని టెలికం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ పైకి నెట్టేశాడు. దయానిధి రాసిన ఉత్తరంతోటే తాను 2జి స్పెక్ట్రం విషయాన్ని మంత్రుల బృందం పరిశీలననుండి తప్పించి పూర్తిగా టెలికం శాఖ నిర్ణయానికి అప్పజెప్పానని చెప్పాడు. అమెరికా నుండి ఇండియా వస్తూ విమానంలోనే మన్మోహన్ సింగ్ పత్రికా విలేఖరులకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన ఇండియాలో విమానం దిగే నాటికి ఇంటర్వ్యూ అంశాలపై పత్రికలు వార్తలు ప్రచురించడంతో మన్మోహన్‌కి ఇబ్బందులు తప్పాయి.

“ఒక డ్రాఫ్టు తయారు చేసిన విషయం, అందులో స్పెక్ట్రం ధరల విషయం కూడా ఉండడం వాస్తవం” అని మన్మోహన్ అంగీకరించాడు. స్పెక్ట్రం ధరలను కూడా మంత్రుల బృందానికి అప్పజెపుతూ మన్మోహన్ డ్రాఫ్టు విడుదల చేయగా, దానిని వెనక్కి తీసుకోవాలని టెలికం మంత్రి దయానిధి మారన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ప్రధానికి లేఖ రాస్తూ అందులో స్పెక్ట్రం ధరల విషయాన్ని పూర్తిగా టెలికం శాఖకే వదిలివేయాలని కోరాడు. దానితో మొదటి డ్రాఫ్టును మన్మోహన్ రద్దు చేసుకుని దయానిధి మారన్ కోరినట్లుగా మరొక డ్రాఫ్టుని విడుదల చేశాడు. దాని ద్వారా టెలికం శాఖను గుప్పిట్లో పెట్టుకున్న దయానిధి స్పెక్ట్రం ధరలపై ఇష్టానుసారం వ్యవహరించే అవకాశాలు సృష్టించబడ్డాయి.

అయితే దయానిధి మారన్ లేఖ రాయడంతోనే ప్రభుత్వ విధానాలను ఖచ్చితంగా మార్చుకోవాలన్న రూలేమీ లేదు. మంత్రివర్గం సమిష్టి భాధ్యత వహించాల్సిన నేపధ్యంలో ముఖ్యమైన విషయాలపై మంత్రుల బృందానికి నివేదించడం ఆనవాయితీ. దాదాపు లక్షా డెబ్భైవేల కోట్ల ఆదాయం తీసుకురాగల అంశంపై మంత్రుల బృందం లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ లోటు తగ్గించడానికోసం భారత ప్రభుత్వం ఎరువుల సబ్సిడీలను రద్దు చేయడానికి సిద్ధపడుతున్నది. అలాగే కార్మికులు ఉద్యోగుల నిజవేతనాలలో తీవ్రమైన కోత విధిస్తున్నది. ప్రజల వద్ద ముక్కుపిండి వివిధ రూపాల్లో వసూలు చేస్తూ ప్రభుత్వానికి ఉన్న ఆదాయమార్గాలను అవినీతి దారి పట్టించడానికి మన్మోహన్ పరోక్షంగా సహాకరించడం నేరం కాకుండా ఎలా పోతుంది?

దయానిధి మారన్ లేఖ రాయడం ఒక అంశం కాగా, దాని కంటే ముఖ్యమైన అంశం ఆ లేఖలో చేసిన ప్రతిపాదనలకు మన్మోహన్ మారు మాట్లాడకుండా ఆమోదం తెలపడం. “స్పెక్ట్రం ధరలు టెలికం శాఖకు బ్రెడ్ అండ్ బటర్ లాంటిదనీ, టెలికం శాఖ నిర్వహించే వ్యాపారంలో అది ముఖ్యమైన భాగం అనీ దయానిధి వాదించాడు” అని మన్మోహన్ విలేఖరులకు తెలిపాడు. “స్పెక్ట్రం అంశంలో చాలా సంక్లిష్టమైన, సాంకేతిక పరమైన అంశాలు బోలెడు ఇమిడి ఉన్నాయనీ పెద్ద సంఖ్యలో ఉన్న మంత్రుల సమూహం ఇక్కడ కూర్చొని సమర్ధవంతంగా స్పెక్ట్రం పై నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని దయానిధి వాదించాడు” అని మన్మోహన్ తెలిపాడు.

“మంత్రి దయానిధి మారన్‌ వాదనతో అంగీకరించడం ద్వారా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి త్యాగం చెయ్యవలసిందేమీ ఉండబోదని నేను ఒక అంచనాకి వచ్చాను” అని మన్మోహన్ తెలిపాడు. సాధారణంగా టెలికం శాఖ నిర్వహించే విధుల్లోకి మంత్రుల బృందం చొరబడడం మంచిచి కాదని దయానిధి మన్మోహన్‌కు రాసిన లేఖలో గట్టిగా పేర్కొన్నాడు. రక్షణ మంత్రిత్వ శాఖనుండి స్పెక్ట్రంను విడుదల చేయించడం, దానిని ప్రజలకు ఎలా ఉపయోగపట్టాలన్నదే నిజమైన అంశాలని దయానిధి పేర్కొన్నాడు. దానితో నేను ఆయన చెప్పినదానిని ఆమోదించాను, అని ప్రధాని పేర్కొన్నాడు.

వ్యాఖ్యానించండి