పాకిస్ధాన్ విదేశాంగ మంత్రి అమెరికాపై తన దండయాత్రను కొనసాగిస్తోంది. తీక్షణమైన ఖండన ప్రకటనలను జారీ చేయడంలో పేరు పొందిన హీనా రబ్బానీ తన పేరున నిలబెట్టుకుంటూ మరొక ప్రకటనను జారీ చేసింది. ప్రమాదకరమైన సంస్ధగా అమెరికా పరిగణిస్తున్న హక్కానీ గ్రూపు నెట్ వర్క్ మరొకటేదో కాదనీ, సి.ఐ.ఎ అత్యంత ఇష్టంగా రూపొందించుకున్న “నీలి కళ్ల బాలుడే” ననీ అమెరికా చేస్తున్న ప్రకటనలను తిప్పి కొట్టింది.
రెండు వారాల క్రితం ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా ఎంబసీపై తాలిబాన్ మిలిటెంట్లు దాడి చేసినప్పటినుండీ అమెరికా, పాక్ ల మధ్య మరొకసారి మాటల యుద్ధ రేగింది. అదింకా కొనసాగుతోంది. హక్కానీ గ్రూపును పాకిస్ధాన్ మిలట్రీ గూఢచారి సంస్ధ ఐ.ఎస్.ఐ ప్రోత్సహిస్తున్నదని, ఐ.ఎస్.ఐ సాయంతోనే అది అమెరికా ఎంబసీపై దాడి చేసిందనీ అమెరికా ఆర్మీ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ సెనేట్ కమిటీ ముందు ఆరోపించాడు.
హక్కానీ గ్రూపు వ్యవస్ధాపకుడు జలాలుద్దీన్ హక్కానీని సోవియట్ రష్యాకి వ్యతిరేకంగా సి.ఐ.ఎ సంస్ధే స్వయంగా పెంచి పోషించింది. ఆఫ్ఘనిస్ధాన్ ను ఆక్రమించిన సోవియట్ సేనలకు వ్యతిరేకంగా పోరాడుతున్న జలాలుద్ధీన్ కు అన్ని విధాలుగా సహాయ ప్రోత్సాహలను సి.ఐ.ఎ, అమెరికాలు అందించాయి. సోవియట్ ఆక్రమణ సేనలకు వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్ఘన్లు అమెరికా ఆక్రమణ సేనలపై కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. తాను పాలు తాపి పెంచిన హక్కానీ గ్రూపు ఇప్పుడు ఏకు మేకై కూర్చోవడంతో అమెరికా సేనలకు నిద్ర పట్టడం లేదు.
పాక్ విదేశీ మంత్రి హీనా రబ్బానీ అదే విషయాన్ని ఎత్తిచూపుతూ హక్కానీ గ్రూపు దాడులకు తమ దేశానికీ సంబంధలేదని తిప్పికొట్టింది. న్యూయార్క్ నగరంలో జరుగుతునన్ ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశాలకు హీనా రబ్బానీ హాజరైంది. సమావేశాల సందర్భంగా ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. హక్కానీ గ్రూపు పాకిస్ధాన్‌కు వాస్తవ అంగమనీ ముల్లెన్ వ్యాఖ్యానించాక పాకిస్ధాన్ నుండి తీవ్రమైన ఆక్షేపణలు వెలువడుతున్నాయి. అమెరికా అదేపనిగా ఆరోపణలు కొనసాగిస్తే అది ఒక మిత్రుడిని కోల్పోవలసి ఉంటుందని కూడా హీనా అంతకుముందు హెచ్చరించింది.
పాకిస్ధాన్ నిరాకరిస్తున్నప్పటికీ అమెరికా తన ఆరోపణలను కొనసాగించింది. పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ ఈ విషయంలో ప్రకటన చేస్తూ సెప్టెంబరులోనే జరిగిన రెండు దాడుల వెనక ఐ.ఎస్.ఐ పాత్ర ఉందని చెప్పేందుకు తమవద్ద విశ్వసనీయమైన సాక్షాలు ఉన్నాయని తెలిపాడు. దాడులు చేయడానికి హక్కానికి ఐ.ఎస్.ఐ ప్రోత్సహిస్తున్నదని ఆయన ఆరోపించాడు. హక్కానీ గ్రూపుతో సంబంధాల్ను ఐ.ఎస్.ఐ కొనసాగిస్తున్నదనీ ఆరోపించాడు.
దానితో మంత్రి రబ్బానీ బిన్ లాడెన్ ఇంటిపై కోవర్టు ఆపరేషన్ చేపట్టిన సి.ఐ.ఎ పై అస్త్రాలు సంధించింది. ఆల్ జజీరా ఛానెల్ తో మాట్లాడుతూ ఆమె, “సంబంధాల గురించే మాట్లాడుకోవలసి వస్తే, ప్రపంచ వ్యాపితంగా ఉన్న అనేక టెర్రరిస్టు సంస్ధలతో సి.ఐ.ఎ కి కూడా సంబంధాలు ఉన్నాయని నేను చెప్పగలను. సంబంధాలంటే గూఢచార సంబంధాలని నా అర్ధం” అని ఆమె తిప్పికొట్టింది.
“అంతే కాకుండా అమెరికా పదే పదే కలవరించే ఈ నిర్ధిష్టమైన నెట్ వర్క్, అనేక సంవత్సరాల పాటు సి.ఐ.ఎ కి అత్యంత ప్రీతి పాత్రమైన ‘నీలికళ్ల బాలుడే'” అని హీనా రబ్బానీ పేర్కొంది.
“పరస్పరం సహకరించుకోవడానికి మరొక అవకాశం అందిపుచ్చుకోవాలని నేను భావిస్తున్నాను. అందుకు తలుపులు తెరిచే ఉంటాయని నమ్ముతున్నాను. ఇటువంటి ప్రకటనలు ఆ తలుపులను మూసివేసేందుకు అత్యంత అనుకూలంగా ఉంటున్నాయి” అని రబ్బానీ చివరిగా స్వరం తగ్గించి మాట్లాడుతూ హెచ్చరిక చేసింది.
తన ప్రకటనల ద్వారా హీనా రబ్బానీ అమెరికాకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది. అమెరికాతో వ్యవరించేటపుదు పాక్ సహనానికి కూడా హద్దు ఉంటుందనీ ఆమె పరోక్షంగా తెలిపింది. “మేము భరించగల స్ధాయికంటే అధికంగా మమ్మల్ని పరీక్షలకు గురిచేయడం తగదు” అని ఆమె తెలిపింది.
