
కాంగ్రెస్ సభ్యుడు టెడ్ పో, తాను ప్రవేశపెట్టిన తీర్మానంపై పత్రికా ప్రకటన జారీ చేశాడు. “అబ్బొత్తాబాద్‌లో ఒసామా బిన్ లాడెన్ ను కనుగొన్నప్పటినుండీ పాకిస్ధాన్ అవిధేయంగా ప్రవర్తిస్తోంది. మోసపూరితంగా ప్రవర్తిస్తూ అమెరికాకు ప్రమాదకారిగా మారుతోంది” అని ఆయన తన ప్రకటనలో తెలిపాడు. “మిత్రుడుగా చెప్పబడుతున్న ఈ దేశం అమెరికా నుండి బిలియన్ల కొద్దీ డాలర్లను సహాయం పొందుతూనే మనపై దాడులు చేస్తున్న మిలిటెంట్లకు మద్దతును అందించడం కొనసాగిస్తోంది” అని టెడ్ పో పాకిస్ధాన్ పై ఆరోపణలు చేశాడు.
“అమెరికా పాకిస్ధాన్‌కి ఇస్తున్న అన్ని సహాయాలనూ వెంటనే స్తంభింపజేయాలి” అని టెడ్ పో కోరాడు. ఈయన విదేశీ వ్యవహారాలపైన ఏర్పాటు చేయబడిన కాంగ్రెస్ కమిటీలో సభ్యుడు కావడం విశేషం. టెర్రరిజంపై యుద్ధంలో అమెరికాకు మిత్రుడుగా ఉన్నట్లు నటిస్తూ పాకిస్ధాన్, తన ద్వంద్వ ప్రవృత్తినీ, మోసాన్ని కొనసాగిస్తామని పాకిస్ధాన్ స్పష్టం చేస్తోంది. అదే సమయంలో హింసాత్మక తీవ్రవాదానికి మద్దతుని ఇస్తోంది.” అని పో తెలిపాడు.
పో ప్రవేశ పెట్టిన తీర్మానం మొదట విదేశీ వ్యవహారాల కాంగ్రెస్ కమిటీ పరిశీలనకు వెళుతుంది. ఈ కమిటీ సదరు తీర్మానాన్ని ఆమోదిస్తేనే ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టబడుతుంది. సాధారణంగా తీర్మానాలలో అత్యధికం కమిటీల వద్దనే ఆగిపోతుంటాయి. కమిటీలను దాటి ప్రతినిధుల సభలోకి తీర్మానాలు ప్రవేశించడం ముఖ్యమైన విషయాలలోనే జరుగుతూ ఉంటుంది. పాకిస్ధాన్ కి పూర్తిగా సహాయం స్తంభింపజేయడం అన్నది పాకిస్ధాన్ తో పాటు అమెరికా ప్రయోజనాలకు కూడా తక్షణం భంగకరంగా పరిణమించే అవకాశం ఉంది.
ఇప్పటికీ పాక్ భూభాగం మీదుగా ఆఫ్ఘనిస్ధాన్ లోని అమెరికా సైన్యాలకు సరఫరాలు అందుతున్నందున పాక్‌తో సంబంధాలు పూర్తిగా చెడీపోవడం అమెరికాకే నష్టం. కనుక ‘టెడ్ పో’ తీర్మానం కమిటీని దాడి వెళ్లడం కష్టం కావచ్చు. ప్రతినిధుల సభలో గనక ఆ తీర్మానం ప్రవేశిస్తే, దక్షిణాసియాలో పెను రాజకీయ మార్పులు జరిగడం తధ్యం. ఇండియాపైన అమెరికా దృష్టి మరింత కేంద్రీకృతం కావడానికీ, భారత ప్రయోజనాలు మరింతగా అమెరికా ప్రయోజనాలకు కట్టుబడే విధంగా మార్పులు జరగవచ్చు. అంతిమంగా అది భారత ప్రజల ప్రయోజనాలకు ప్రతికూల పరిణామం కాగలదు.

తమ చరిత్ర తమకే తెలియనట్టు నటిస్తున్నారు. ఇరవై ఏళ్ళ క్రితం సోవియట్ యూనియన్‌కి వ్యతిరేకంగా అమెరికా, పాకిస్తాన్, ఇరాన్ మూడూ కలిసి ఇస్లామిక్ ఉగ్రవాదులకి ఆయుధాలు అందించాయి. ఇప్పుడు ఉన్న ఉగ్రవాదానికి సృష్టికర్తలు ఆ మూడు దేశాలే.