
అమెరికా, పాకిస్ధాన్ దేశాల రాజకీయ నాయకులు, అధికారుల మధ్య ‘మాటల యుద్ధం’ కొనసాగుతోంది. అమెరికానుండి ప్రతికూల సందేశాలు అందుతుండడం పట్ల పాకిస్ధాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ మంగళవారం విచారం వ్యక్తం చేశాడు. హక్కానీ గ్రూపు మిలిటెంట్లపై దాడి పేరుతో పాకిస్ధాన్, ఆఫ్ఘన్ సరిహద్దును దాటి అమెరికా దాడులు చేసినట్లయితే అది పాక్ సార్వభౌమత్వానికి భంగం కలిగినించినట్లేనని హెచ్చరించాడు.
“ప్రతికూల (నెగిటివ్) సందేశాలు మా ప్రజలను ఆందోలనకు గురిచేస్తున్నాయి. మా స్నేహ సంబంధాలకు అనుగుణం కాని రీతిలో సందేశాలు అందుతున్నట్లయితే, సహజంగానే మా ప్రజలకు నచ్చ జెప్పడం అత్యంత కష్టతరం అవుతుంది” అని గిలానీ రాయిటర్స్ కి ఇచ్చిన ఇంటర్వూలో వివరించాడు.
“మాది సర్వసత్తాక దేశం. వాళ్లు వచ్చి మా దేశంపై దాడి ఎలా చేయగలరు?” అని గిలానీ ప్రశ్నించాడు. అమెరికా ఏకపక్షంగా పాక్‌పై దాడి చేసినట్లయితే ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు సమాధానంగా గిలాని ఇలా ఎదురు ప్రశ్న వేశాడు. అయితే ఇక్కడ ఎవరు అమాయకులో అర్ధం కాని విషయం. అబ్బొత్తాబాద్ పై అమెరికా ఇప్పటికే ఏక పక్షంగా దాడి చేసింది. పాక్ లో ఆశ్రయం పొందుతున్న లాడెన్ ను హత్య చేసి మరీ చక్కా పోయింది. అప్పుడు పాక్ సార్వభౌమత్వం భంగం కాలేదా అన్న ప్రశ్నకు పాక్ ప్రభుత్వం సమాధానం ఇంకా ఇవ్వలేదు.
నిజానికి అబ్బొత్తాబాద్ దాడి పాక్ ప్రభుత్వానికి తెలియకుండా జరగడం అసంభవం. పాక్ ప్రభుత్వంపై పాక్ ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా ఉండడానికి అమెరికా, పాక్‌కు తెలియకుండా దాడి చేశామని చెప్పింది. అంతే కాకుండా మిలిటెంట్ల నాయలకును చంపడానికి భవిష్యత్తులో కూడా ఏక పక్షంగా దాడి చేస్తామని అమెరికా అప్పుడే ప్రకటించింది. సి.ఐ.ఎ అధికారులు పెద్ద ఎత్తున పాకిస్ధాన్ లో తిష్టవేయడం పట్ల పాక్ ప్రజలు తీవ్రంగా నిరసించడంతో సి.ఐ.ఎ గూడచారుల్లో మూడింట రెండొంతుల మందిని పాక్ ప్రభుత్వం వెనక్కి పంపింది.
అప్పటినుండే పాక్, అమెరికా సంబంధాలు చెడిపోయాయి. పాక్ పౌరులను ఇద్దరిని సి.ఐ.ఎ గూడచారులు కాల్చి చంపిన తర్వాత పాక్ ప్రజల్లో అమెరికా పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు రగిలాయి. అదే చివరికి సి.ఐ.ఎ గూఢచారులను బైటికి గెంటించడం వరకూ దారి తీసింది. దీన్ని అడ్డుకోవడానికి అమెరికా ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దానితో పాక్ పట్ల అమెరికాకి వైముఖ్యం మొదలైంది.
ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైన్యాన్ని చాలా వరకు ఉపసంహరించడానికి నిర్ణయించుకున్న నేపధ్యంలో కూడా పాకిస్ధాన్ అవసరం అమెరికాకి తీరిపోవడం మొదలైంది. పైగా పాకిస్ధాన్ ని వచిలించుకోవలసిన అగత్యం ఏర్పడింది. హక్కానీ గ్రూపుతో పాటు మరికొన్ని సంస్ధలతో పాకిస్ధాన్ ప్రభుత్వం సంబంధాలు పెట్టుకుని అమెరికా అనంతర అఫ్ఘన్ లో తన పలుకుబడిని స్ధాపించడానికి పాక్ ప్రయత్నాలు చేస్తొంది. ఇది కూడా అమెరికా ప్రయోజనాలకు భంగం.
అప్పటినుండీ అమెరికా ఇండియాను మరింత సన్నిహతం చేసుకుంటూ దాయాధుల మధ్య ఇండియావైపు మాట్లాడడం ప్రారంభించింది. అయితే ఇంకా సంబంధాలు పూర్తిగా చెడలేదు. అమెరికా, పాక్ ల ప్రయోజనాలు సైతం ఇంకా అనుబంధించబడి ఉన్నాయి. ఈ నేపధ్యంలో అప్పుడే తెగతెంపులు చేసుకోవడానికి ఇరు పక్షాలు వెంటనే సిద్ధంగా లేవు. పైగా పాకిస్ధాన్ వద్ద అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడానికి అమెరికా గూఢచారులు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కర్తవ్యం కూడా అమెరికాకి మిగిలే ఉంది.
ఇట్స్ కాంప్లికేటెడ్
