రాజీనామాకు సిద్ధపడిన హోం మంత్రి పి.చిదంబరం


2జి స్పెక్ట్రం కుంభకోణంపై జరుగుతునన్ విచారణ కాంగ్రెస్ పునాదులను పెకలిస్తోంది. కేంద్ర కేబినెట్‌లో అత్యంత ఉన్నత స్ధానాన్ని పొంది ఉన్న హోం మంత్రి పి.చిదంబరం తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు.

తమ నాయకురాలు సోనియా గాంధిని కలిసిన పి.చిదంబరం తన పదవికి రాజీనామా చేస్తానని కోరినట్లుగా తెలుస్తొంది. టి.వి ఛానెళ్ళు ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి. సోనియాతో జరిగిన 20 నిమిషాల సమావేశంలో చిదంబరం రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లుగా అవి ప్రసారం చేస్తున్నాయి.

అయితే సోనియా ఎలా ప్రతిస్పందించిందీ ఇంకా వెల్లడి కాలేదు.

2జి కుంభకోణం చోటు చేసుకున్న కాలంలో పి.చిదంబరం ఆర్ధిక మంత్రిగా విధులు నిర్వర్తించాడు. స్పెక్ట్రంను వేలం వేయడానికి బదులు అత్యంత తక్కువ ధరలకు టెలికం మంత్రి ఎ.రాజా కేటాయించాడన్న అభియోగాలను రాజా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఆర్ధిక మంత్రి హోదాలో ఉన్న పి.చిదంబరం ఈ సంగతి తెలిసినప్పటికీ, దానిని అడ్డుకోగల స్ధానంలో ఉన్నప్పటికీ అడ్డుకోలేదని చెబుతూ ప్రస్తుత ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రధానికి పంపిన నోట్ బహిరంగం కావడంతో చిదంబరంకు కష్టాలు వచ్చిపడ్డాయి.

ఎ.రాజా నిందితుడిగా అరెస్టయ్యి జైలుకి వెళ్లాక ప్రధాని మన్మోహన్, ఇప్పటి హోం మంత్రి అప్పటి ఆర్ధిక మంత్రి చిదంబరంలు తాము వద్దని మొత్తుకుంటున్నా ఎ.రాజా స్పెక్ట్రంను తక్కువ ధరలకు కేటాయించాడనీ చెబుతూ వచ్చారు. స్పెక్ట్రంను వేలం వేయాలని తాను లేఖ రాసినా రాజా పట్టించుకోలేదని ప్రధాని చెబుతూ వచ్చాడు.

ఈ నేపధ్యంలో వెలువడిన ప్రణబ్ నోట్ పెను సంచలనానికి కారణమయ్యింది. న్యాయ శాఖ మంత్రి ఈ నోట్‌ను ఒక జూనియర్ అధికారి రాసిన నోట్ గా కొట్టిపారేస్తున్నాడు. కాని స్పెక్ట్రం కుంభకోణం చోటు చేసుకుంటున్న సంగతిని ప్రధాని, అర్ధిక మంత్రులు తెలిసి ఉండీ, అడ్డుకోలేకపోయారని నోట్ ద్వారా స్పష్టం అవుతోంది.

తక్కువధరలకు కేటాయించిన నేరంలో ఎ.రాజా పాత్ర తప్ప మరొక మంత్రి పాత్ర లేదని ఫస్ట్ పోస్ట్ మేగజైన్ విశ్లేషించింది. అయితే ఎ.రాజా నేరానికి పాల్పడుతున్న సంగతి తెలిసీ అడ్డుకోని నేరానికి ప్రధాని మన్మోహన్, ఆర్ధిక మంత్రి చిదంబరం పాల్పడ్డారన్నది పచ్చి నిజంగా వెల్లడవుతోంది.

రాసింది జూనియర్ అధికారే అయినా అందులో అంశాలు జూనియర్ అంశాలు కాజాలవు. కనుక కాగ్ వేసిన ఒక అంచనా ప్రకారం రు.1,76,000 కోట్లు, సి.బి.ఐ (మాజీ ఫైనాన్స్ సెక్రటరీ దువ్వూరి సుబ్బారావు విశ్లేషణ ప్రకారం) ప్రకారం రు.31,000 కోట్లు భారత ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చిన ఈ కుంభకోణానికి వీరిద్దరు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.

మిస్టర్ క్లీన్ మన్మోహన్ సింగ్, కూటమి ధర్మం పేరు చెప్పి స్వతంత్ర భారత దేశంలోనే అతి పెద్ద కుంభకోణాన్ని అనుమతించి మిస్టర్ డర్టీ గా బైటికి తేలాడు.

వ్యాఖ్యానించండి