లిబియాలో వందల పౌరుల్ని పొట్టన బెట్టుకుంటున్న నాటో దాడులు


గడ్డాఫీ లిబియా విడిచి పారిపోయాడని చెబుతున్నప్పటికీ నాటో వైమానిక దాడులు ఆగ లేదు. దుష్టత్రయం ఫ్రాన్సు, అమెరికా, బ్రిటన్ తమ ఆయిల్ దాహం తీర్చుకోవడానికి లిబియా పౌరుల రక్తాన్ని తోడేయడం ఆపలేదు. గత కొద్ది రోజులలోనే వందలమంది సిర్టే నగర పౌరుల్ని నాటో వైమానిక దాడులు పొట్టనబెట్టుకున్నాయి. లిబియా పౌరుల్ని గడ్డాఫీ నుండి రక్షిస్తామని వైమానిక దాడులు ప్రారంభించిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు గడ్డాఫీ దేశంలో లేకుండా చేస్తున్న వైమానిక దాడులు ఎవర్నుండి పౌరుల్ని రక్షించడానికి చేస్తున్నాయో ఇంకా చెప్పలేదు. దాడులు చేస్తున్నామని మాత్రం అంగీకరిస్తున్నారు.

నాటో వైమానిక దాడుల్లో బుధ, గురు వారాల్లో సిర్టే నగరంలో 151 మంది పౌరులు చనిపోయారని గడ్డాఫీ ప్రతినిధి, గడ్డాఫీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి మౌసా ఇబ్రహీం విలేఖరులకు తెలిపినట్లుగా రాయితర్స్ పేర్కొన్నది. ట్యునిస్ నుండి శాటిలైట్ ఫోన్‌లో ఈ సమాచారం అందించాడని ఆ సంస్ధ తెలిపింది. గడ్డాఫీ పుట్టిన స్ధలం సిర్టేలో గడ్డాఫీ మద్దతుదారులు తిరుగుబాటు బలగాలను, నాటో దాడులను ప్రతిఘటిస్తున్నాయి. గంటల్లో లొంగదీస్తామంటూ బయల్దేరిన తిరుగుబాటు బలగాలు గడ్డాఫీ బలగాల ధాటికి కకావికలు అవుతుండడంతో నాటో బలగాలు పట్టణంపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి.

లిబియా తిరుగుబాటు అని చెబుతున్నప్పటికీ బెంఘాజీ నుండి ట్రిపోలీ వరకూ తిరుగుబాటు బలగాలు సాగించిన ప్రయాణం అంతా నాటో వైమానిక దాడుల సాయంతోనే పూర్తయ్యింది తప్ప తిరుగుబాటు బలగాల శక్తి వలన కాదు. ఆరు నెలలపాటు పశ్చిమ దేశాల సలహాదారులు, మిలట్రీ అధికారుల నుండి శిక్షణ పొందినప్పటికీ వారు గడ్డాఫీ బలగాలను ఎదుర్కొనే స్ధితిలో లేరని గత మూడు నాలుగు రోజులుగా తిరుగుబాటు బలగాలు కకావికలు అవుతున్న పరిస్ధితి నిరూపిస్తున్నది.

తాము కమాండ్ సెంటర్ పైన దాడి చేశామని తాము దాడి చేసిన సమయంలో అక్కడ పౌరులు ఉన్న జాడలేవీ లేవనీ నాటో ప్రతినిధి తెలిపాడు. లిబియాలో పౌరులు చనిపోయినప్పుడల్లా అది కమాండ్ సెంటర్ అని తమకు సమాచారం ఉన్నందున దాడి చేశామని చెప్పడం తప్ప కనీసం క్షమాపణ కూడా నాటో దళాలు చెప్పలేదు. ఆ దాడుల్లోనే గడ్డాఫీ కొడుకు, మనవళ్లను నాటో దళాలు చంపేశాయి. పౌరుల్ని రక్షించడానికని పచ్చి అబద్ధాలు చెప్పి వారిపైనే బాంబు దాడులు చేశాయి.

గత వారం కూడా నాటో బలగాల దాడుల్లో అనేకమంది చనిపోయారు. గతవారంలో  మొత్తం 354 మంది పౌరులు నాటో వైమానిక దాడుల్లో చనిపోయారని మౌసా ఇబ్రహీం తెలిపాడు. సిర్టే నగరాన్ని తిరుగుబాటు బలగాలు చుట్టుముట్టడంతో పౌరులకు సరఫరాలన్నీ ఆగిపోయాయి. ఆసుపత్రులలో మదులు లేవు. మందులు లేకపోవడం వల్లనే అనేకమంది చనిపోతున్నారు. నాటో ప్రతినిధులు మాత్రం తమ దాడుల్లో పౌరులు పెద్దగా చనిపోలేదని అబద్ధాలు కూస్తున్నారు. తద్వారా తమ దాడుల్లో కొద్దిమంది పౌరులయినా చనిపోయారని అంగీకరిస్తున్నారు. ఆ కొద్ది మందైనా ఎంతమంది పౌరులు చనిపోయిందీ చెప్పగల స్ధితిలో వారు లేరు. వారికి పౌరుల ప్రాణాలు గడ్డి పరకలతో సమానం కనుక వారి మరణాల్ని సేకరించాలన్న జ్ఞానం ఉంటుందని ఆశించలేము.

వ్యాఖ్యానించండి