జి20 సమావేశాలు మొదలు, రేపటికల్లా శుష్క వాగ్దానాల వరద


జి20 గ్రూపు దేశాల ఆర్ధిక మంత్రుల సమావేశం వాషింగ్టన్‌లో ప్రారంభమయ్యింది. అమెరికా, యూరప్‌ల రుణ సంక్షోభాలు ప్రపంచ వ్యాపితంగా ఆర్ధిక వ్యవస్ధలను, షేర్ మార్కెట్లను వణికిస్తున్న నేపధ్యంలో జి20 సమావేశాలు జరుగుతున్నాయి. 1990ల చివర్లో జి20 గ్రూపు ఏర్పడినప్పటికీ మూడు సంవత్సరాల క్రితం సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభంతో దాని ప్రాధాన్యత పెరిగింది.

సంక్షోభం ప్రారంభంలో వరుసగా సమావేశాలు జరిపిన జి20 గ్రూపు, ట్రిలియన్ల కొద్దీ డాలర్ల స్టిములస్ ప్యాకేజీలు ప్రకటించి ఆర్ధిక వ్యవస్ధలు మాంద్యం నుండి బైటపడడానికి సహకరించిన తర్వాత జి20 సంగతి మర్చిపోయారు. ఇపుడు అమెరికా, యూరప్ రుణ సంక్షోభాల ప్రభావంతో చైనా, ఇండియా లాంటి ఎమర్జింగ్ దేశాలలో కూడా ఆర్ధిక వృద్ధి మందగించడంతో జి20కి మరొకసారి ప్రాధాన్యత పెరిగింది.

రుణ సంక్షోభాల నేపధ్యంలో ఆర్ధిక స్ధిరత్వాన్ని కాపాడడానికి శాయ శక్తులా కృషి చేస్తామని మొదటి రోజే శుష్క ప్రతిజ్ఞ ఒకటి చేశారు. ఇలాంటి ప్రతిజ్ఞలు రెండు మూడో రోజులు షేర్ మార్కెట్లు కొద్దిగా లాభాల్లో ముగియడానికి దోహదపడవచ్చేమో కాని అవి మార్కెట్లో మదుపుదారులను శాశ్వతంగా సంతృప్తిపరచలేవు.

మదుపుదారుడు ఎప్పుడూ లాభాలనే కాంక్షిస్తాడు తప్ప సమాజంలో చోటు చేసుకుంటున్న ఆర్ధిక అసమానతలు, విపరీతమైన ఆదాయం సంపదల అంతరాలు, వాటివలన ప్రభావితమవుతున్న కొనుగోలు సామర్ధ్యం, కొనుగోలు సామర్ధ్యం పడిపోవడం వలన ఉత్పత్తులు తగ్గి లాభాలు పడిపోవడం ఇవేవీ వారికి అనవసరం. దానితో పెట్టుబడిదారీ ప్రభుత్వాల నుండి మరిన్ని తాయిలాలు, రాయితీలు ఆశిస్తూ, ఒత్తిడిలు తెస్తూ, ఆర్ధిక సంక్షోభం మరింత తీవ్రం కావడానికి దోహదపడుతున్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో పొదుపు విధానాలు అమలు చేయడం వలన కొనుగోళ్ళు తగ్గి మళ్లీ మాంద్యం తలెత్తే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభాలు మాంద్యం ఏర్పడగల పరిస్ధితులను మరింత ప్రోత్సాహకరంగా మారాయి. రుణ సంక్షోభాలే ప్రోత్సాహకరంగా మారాయనడం కంటే, వాటికి ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరే మాంద్య పరిస్ధితులను తెస్తున్నాయి.

ఈ పరిస్ధితుల్లో జి20 సమావేశాలు చేసే తీర్మానాలు ఎప్పటిలాగా ఆర్భాటంగా ఉన్నప్పటికీ ఆచరణలోకి తేవడంలో మళ్ళీ విఫలం కావడం ఖాయం. జి20 సభ్య దేశాలనుండి వచ్చిన ఆర్ధిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల అధిపతులు పాల్గొంటున్న ఈ సమావేశాల నుండి అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభంపై, ముఖ్యంగా యూరప్ రుణ సంక్షోభంపై వాగ్దానాలతో కూడిన తీర్మానాలు వెలువడతాయి.

గత సమావేశాల్లో ప్రవేటు బహుళజాతి కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, రేటింగ్ సంస్ధలను కట్టడి చేయడం, భారి ద్రవ్య సంస్ధలను అదుపులో పెట్టడం, పన్నులు తప్పించుకోవడానికి సహకరిస్తున్న బ్యాంకులపై చర్యలు తీసుకోవడం తదితరాలపై తీర్మానాలు ఆమోదించినప్పటికీ ఒక్క ప్రవేటు కంపెనీలకు ట్రిలియన్ల కొద్దీ ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప ఇతర తీర్మానాలేవీ అమలు కాలేదు.

ఇసారి కూడా “అవసరమైన అన్ని చర్యలూ తీసుకుని” ప్రపంచ ద్రవ్య వ్యవస్ధ స్ధిరంగా ఉండేలా చూస్తామని హామి ఇచ్చారు. సెంట్రల్ బ్యాంకులు లిక్విడిటీ అందివ్వడానికి రెడీగా ఉన్నాయని కూడా హామీ ఇచ్చారు. ఈ హామీలతో ప్రపంచవ్యాపితంగా షేర్ మార్కెట్లు కొద్దిగా కోలుకున్నట్లు కనిపిస్తున్నాయి. కాని ఇది నిలవడం అనుమానమే. జి20 సమావేశాల హామిలతోనే ఒక్కసారిగా మార్పు రానప్పటికీ మార్పు రావడానికి అనువైన పరిస్ధితులు ఏర్పడవచ్చని ఆశించడం సహజం. కాని అందుకు కూడా ప్రస్తుతం పరిస్ధితులు అనుకూలించడంలేదు.

యూరోజోన్ రెస్క్యూ ఫండ్ మరింత పెంచడానికి కృషి చేస్తామని జి20 ప్రకటించినా అదేమీ కొత్తది కాదని ట్రేడర్లు పెదవి విరుస్తున్నారు. హామీలు అమలులోకి వస్తే తప్ప కదిలేది లేదని వారు హెచ్చరిస్తున్నారని రాయిటర్స్ తెలిపింది. ట్రేడర్లు, మదుపుదారులను సంతృప్తిపరిచే జి20 సమావేశాలు కార్మికులు, ఉద్యోగుల గురించీ, వారికి సదుపాయాలను, సంక్షేమ చర్యలను పెంచడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచే చర్యలేవీ ప్రతిపాదించడం లేదు, అసలు చర్చించడం కూడా లేదు. పైగా పొదుపు విధానాలతో ఉన్నవాటిని తొలగిస్తున్నారు.

కొనుగోలుదారుడి కొనుగోలు శక్తిని పెంచే చర్యలు తీసుకోకుండా ఎన్ని జి20, ఎన్ని జి7 సమావేశాలు జరిగినా అవన్నీ వట్టి బూటకమే. ఆ సమావేశాలు బహుళజాతి సంస్ధలు, ప్రవేటు కంపెనీలు, ధనికుల సమస్యలను తీరుస్తూ కార్మికులు, ఉద్యోగులు, రైతులు తదితర జన సామాన్యంపై భారాలు మోపడానికి ఆసక్తి చూపుతాయి.

వ్యాఖ్యానించండి