
పాక్ హెచ్చరికతో అమెరికా, పాక్ ల మధ్య సంబంధాలు మరొక అడుగు కిందికి దిగజారినట్లు భావించవచ్చు. పూర్తిగా తెగతెంపులు చేసుకునే పరిస్ధితి రానప్పటికీ అసలే దిగజారుతున్న సంబంధాలకు తాజా ఘటన ఆజ్యం పోయక మానదు. అమెరికా జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అడ్మిరల్ మైక్ ముల్లెన్, పాకిస్ధాన్‌కూ హక్కాని గ్రూపుకి దగ్గరి సంబంధాలున్నాయని ప్రకటించిన నేపధ్యంలో పాక్ విదేశాంగ మంత్రి హైనా రబ్బాని ఖర్ అమెరికాకు నిరసన తెలిపింది. తాలిబాన్ మిత్రు గ్రూపులలో హక్కాని గ్రూపుకి అమెరికా అధికంగా భయపడుతుంది. హక్కాని గ్రూపుతో సంబంధాలు తెంచుకుని దానిని అణచివేయాలని అమెరికా ఎప్పటినుండో పాకిస్ధాన్ ను డిమాండ్ చేస్తోంది. అయితే హక్కాని గ్రూపుతో తనకు సంబంధాలు లేవని పాక్ అంటోంది. హక్కాని గ్రూపు ప్రతినిధి ఇటీవల రాయిటర్స్ సంస్ధకు ఇంటర్వ్యూ ఇస్తూ తామిప్పుడు పాకిస్ధాన్‌లో తలదాచుకోవలసిన అవసరం లేదనీ, పాక్ కంటే తమకు ఆఫ్ఘనిస్ధాన్ లోనే ఎక్కువ భద్రత ఉందనీ తెలిపాడు. అయినప్పటికీ అమెరికా పాకిస్ధాన్ పై పదే పదే ఆరోపణలు చేయడం మానలేదు.
తాలిబాన్ ఇటీవల ఆఫ్ఘనిస్ధాన్ హై సెక్యూరిటీ ప్రాంతంలోకి జొరబడి నిర్మాణంలో ఉన్న భవనాన్ని ఆక్రమించుకుని అక్కడే ఉన్న అమెరికా ఎంబసీపైన రాకెట్లు ప్రయోగించింది. ఎవరూ చనిపోవడమో, గాయపడడమో జరగనప్పటికీ హై సెక్యూరిటీ జోన్ లోకి తాలిబాన్ మిలిటెంట్లు రాగలగడం అమెరికా ప్రతిష్టకు తీవ్ర గర్వభంగం కలిగినట్లయింది. ఈ దాడి చేసింది తాలిబాన్ కాదనీ ఐ.ఎస్.ఐ సహాయంతో హక్కాని గ్రూపు చేసిందనీ అమెరికా ఆరోపిస్తున్నది. ఆఫ్ఘనిస్ధాన్ మిలిటెంట్లతోనే దాడులు జరిగినప్పటికీ అమెరికా, తన చేతకానితనం లేదా తాలిబాన్ పై చేయి సాధించడాన్ని కప్పిపుచ్చడానికి పాకిస్ధాన్ పైన ఆరోపణలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
“పాకిస్ధాన్‌ని మీరు ఒంటరిని చేయజాలరు. పాకిస్ధాన్ ప్రజలను మీరు శతృవులుగా చేసుకోజాలరు. అలా చేయడానికే వాళ్ళు మొగ్గు చూపినట్లయితే అది వారికే నష్టం. మీరొక మిత్రుడిని కోల్పోతారు” అని హైనా రబ్బాని పేర్కొంది. “ఒక మిత్రుడు గురించి, ఒక భాగస్వామి గురించి ఇబ్బంది పెట్టేవిధంగా బహిరంగంగా వ్యాఖ్యానించడం ఆమోదించలేము” అని ఆమె పేర్కొంది. సెనేట్ లో సాక్ష్యం ఇస్తూ మైక్ ముల్లెన్ పాకిస్ధాన్ మిలట్రీ గూఢచార సంస్ధ సాయంతో హక్కాని గ్రూపు మిలిటెంట్లు అమెరికా ఎంబసీపై దాడి చేశారని తెలిపాడు. ఈజిప్టులో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై ఈజిప్టు ప్రజలు దాడి చేసినపుడు ఇజ్రాయెల్ తరపున ఈజిప్టు ప్రభుత్వాన్ని పరోక్షంగా హెచ్చరించిన అమెరికాకు, తర్వాత తమ ఎంబసీపైనే దాడి జరగడం మింగుడుపడడం లేదు. పాక్, అమెరికాల మధ్య ఉద్రిక్తతల ప్రభావం ఇండియా, చైనాలపైన కూడా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న అమెరికా సైనికులకు కొన్ని సరఫరాలు పాకిస్ధా ద్వారా చేరవలసి ఉంది. మిలిటెంట్లను చంపే పేరుతో అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న బేస్ నుండి పాక్ భూభాగలపైన డ్రోన్ విమానాలతో దాడులు చేస్తొంది. ఈ కార్యకలాపాలకు పాక్ మద్దతు అమెరికాకు తప్పనిసరి. మరోవైపు అమెరికా నుండి సహాయం పేరుతో పాకిస్ధాన్ కు ఏటా డబ్బు అందుతుంది. ఈ పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడిన దృష్ట్యా అమెరికా, పాక్ ల సంబంధాలు తెగిపోవడం అసాధ్యమేనని చెప్పవచ్చు. కాని ఉద్రిక్తతలు తీవ్రమయ్యే కొద్దీ బలా బలాల పొందికలో మార్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా చైనా, పాకిస్ధాన్ ల సాన్నిహిత్యం మరింత పెరిగినట్లయితే అది ఇండియా అమెరికాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. దృతరాష్ట్ర కౌగిలి లాంటి అమెరికా స్నేహం వల్ల ప్రపంచంలో బాగు పడ్డ దేశం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు, ఒక్క ఇజ్రాయెల్ తప్ప. అయితే ఇజ్రాయెల్ వ్యవహరం పూర్తిగా వేరే స్వభావం కలిగినదిగా గుర్తించాలి.
హక్కాని గ్రూపు పైన కూడా పాకిస్ధాన్ యుద్ధం ప్రకటించాలని అమెరికా కోరుతోంది. తమ సైన్యానికి పాకిస్ధాన్ తాలిబాన్ తో యుద్ధం చేయడంలోనే తలమునకలై ఉందనీ మరో చోట ఫ్రంట్ లైన్ యుద్ధం సాధ్యం కాదనీ పాక్ చెబుతొంది. ఆఫ్ఘనిస్ధాన్ లో ఇండియా ప్రాబల్యం పెరిగితే అందుకు ప్రతిగా హకాని గ్రూపుని ఉపయోగించుకోవడానికి పాక్ ఆ గ్రూపును చేరదీస్తోందని కూడా అమెరికా ఆరోపణ. దీనిని పాక్ కొట్టిపారేస్తోంది. పాకిస్ధాన్ ఆర్మీ చేతిలో హక్కాని గ్రూపు నిజమైన ఆయుధం అని మైక్ ముల్లెన్ సెనేట్ కమిటీ ముందు చెప్పాడు. హక్కాని గ్రూపుపై పాకిస్ధాన్ యుద్ధం ప్రకటించినట్లయితే పాకిస్ధాన్ సైనికంగా చాలా నష్టపోవలసి ఉంటుందని రాయిటర్స్ వార్తా సంస్ధ విశ్లేషించింది.
