నిలువునా కూలిన భారత షేర్లు, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ ప్రభావం



గురువారం భారత్ షేర్ మార్కెట్లు నిలువునా కుప్పకూలాయి. మూడు శాతానికి పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి. గత రెండు మూడు రోజులుగా సంపాదించిన లాభాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆసియా మార్కెట్లనుంది ప్రతికూల సంకేతాలు అందడం, అమెరికా ఆర్ధిక వృద్ధిపై ఫెడరల్ రిజర్వు ప్రతికూల దృశ్యాన్ని ఆవిష్కరించడం తదితర ప్రపంచ స్ధాయి సంకేతాలు భారత షేర్ మార్కెట్లను కూల్చివేశాయి.

దాదాపు అన్ని లిస్టెడ్ షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి పెరిగింది. లోహాలు, రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు ఐదు శాతం వరకూ పతనమయ్యాయి. సాయంత్రం మూడు గంటల సమయానికి సెన్సెక్స్ 700 కు పైగా పతనమైంది. నిఫ్టీ సూచి 200 పాయింట్లకు పైగా పతనం అయ్యింది.

దాదాపు ఇతర ఆసియా మార్కెట్లన్నీ నష్టాలను చివిచూశాయి. హాంగ్ కాంగ్ షేర్ సూచి హాంగ్ సెంగ్ 4.39 శాతం పతనం కాగా, జపాన్ సూచి నిక్కీ 2.07 శాతం పతనమైంది. ప్రధాన కంపెనీల షేర్లన్నీ ఐదు నుండి ఎనిమిది శాతం వరకూ పతనం కాగా రూపాయి విలువ రెండు సంవత్సరాల కనిష్ట స్ధాయికి పడిపోయింది. డాలరుకు ప్రస్తుతం 49.18 రూపాయల వరకూ దిగజారింది.

రిలయన్స్, జె.పి.అసోసియేట్శ్, జె.ఎస్.డబ్ల్యు స్టీల్, లాంటి కంపెనీల షేర్లు ఐదు శాతానికి పైగా పడిపోయాయి. మూడీస్ క్రెడిట్ రేటింగ్ సంస్ధ, సిటీ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్కో తదితర బ్యాంకింగ్ దిగ్గజాల క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించివేయడంతో దాని ప్రభావం ఆసియా, యూరప్ ల షేర్ మార్కెట్లపై పడింది. అదీ కాక యూరప్ రుణ సంక్షోభం పరిష్కారం అవుతున్న సూచనలు కూడ కనపడలేదు. అమెరికా ఆర్ధిక వృద్ధిపై ఫెడరల్ రిజర్వు ఆశాజనకంగా లేకపోవడంతో ప్రపంచ స్ధాయిలో షేర్ మార్కెట్లు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

సాయంత్రం గం.3:30ని.ల కల్లా సెన్సెక్స్ సూచి 725.62 పాయింట్లు కోల్పోయి (4.1%) 16339.53 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ సూచి 4.13 శాతం కూలిపోయి 4921.5 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ డాలరుకు 49 రూపాయలకు పడిపొయింది. ఈ రోజులో రూపాయి 1.41 శాతం పడిపోయింది.

వ్యాఖ్యానించండి