కుప్ప కూలిన షేర్లు, బ్లూఛిప్స్‌తో సహా ఒక్క రోజులోనే 2.15 లక్షల కోట్లు నష్టం


గురువారం షేర్ మార్కెట్లు మదుపుదారులకు చుక్కలు చూపించాయి. మూడు సంవత్సరాల క్రితం నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం రోజులను ఒకసారి గుర్తుకు తెచ్చాయి. గత 26 నెలల్లోనే ఎన్నడూ లేనంతగా సెన్సెక్స్ సూచి 704 పాయింట్లు నష్టపోయింది. మొత్తం షేర్ల విలువలో చూసినట్లయితే షేర్లలో ఉన్న మదుపుదారుల సొమ్ము రు.2.15 లక్షల కోట్లు ఒక్కరోజులో అదృశ్యమైంది. చిన్న కంపెనీల షేర్ల కంటే బ్లూచిప్ కంపెనీల షేర్లు ఉన్నవారే అత్యధికంగా నష్టపోవడం విశేషం.

లిస్టెడ్ షేర్ల విలువ బుధవారం ట్రేడింగ్ ముగిసేనాటికి రు.62.41 లక్షల కోట్లు ఉండగా, గురువారం రు.2.15 లక్షల కోట్లు నష్టపోయి ట్రేడింగ్ ముగిసే సమయానికి రు.60.26 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ నష్టంలో సగానికంటే పైగా ఉన్నత స్ధాయిలో ఉన్న 30  కంపెనీల షేర్లలోనే ఉండడం గమనార్హం. ఇవి సెన్సెక్స్ సూచిలో లిస్టయిన షేర్లే.

సెన్సెక్స్ సూచిలోని ముప్ఫై కంపెనీల షేర్ల మొత్తం విలువ బుధవారం సాయంత్రానికి రు.28.44 లక్షల కోట్లు కాగా, గురువారం ట్రేడింగ్ లో రు.1.11 లక్షల కోట్లు నష్టపోయి రు.27.33 లక్షల కోట్లకు చేరుకుంది. 4.13 శాతం సెన్సెక్స్ నష్టపోగా, ఇది స్మాల్-కేప్, మిడ్-క్యాప్ ల నష్టానికంటే ఎక్కువగా నమోదైంది. మిడ్-క్యాప్ షేర్లు 3 శాతం నష్టపోగా ఇతర సూచిల నష్టం కూడా 4 శాతం కంటే తక్కువగానే నష్టాలను చవిచూశాయి.

వివిధ రంగాలవారీగా చూసినట్లయితే రియల్ ఎస్టేట్ రంగం అన్నింటికంటే అత్యధికంగా ఐదు శాతం నష్టపోయింది. ఎనర్జీ, మెటల్, బ్యాంకింగ్ షేర్లు కూడా తీవ్రంగానే నష్టపోయాయి. అతిపెద్ద షేర్ విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ మొత్తం షేర్లు రు.17,000/ కోట్లు నష్టపోయాయి. టాటా కన్సల్టెన్సీస్ రు.9,000/ కోట్లు నష్టపోగా, భారతి ఎయిర్ టెల్ రు.8,000/ కోట్లు నష్టపోయింది.

జనవరి 10, 2008 తేదీన సెన్సెక్స్ తన జీవిత కాలంలోనే అత్యధిక స్ధాయి 21206.77 పాయింట్లకు చేరుకుంది. ఆ తర్వాత ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఫలితంగా 700 కంటే ఎక్కువ పాయింట్లు ఒకే రోజు నష్టపోవడం ఇది 12 వసారి అని ది హిందూ పత్రిక తెలిపింది. 2008 సం.ములో 9 సార్లు 700 పాయింట్ల కంటే ఎక్కువ నష్టపోగా, 2009 సం.లో రెండు సార్లు అలా నష్టపోయింది. ఆ తర్వాత 2011లో ఈరోజే 12 వసారి ఒకే రోజు 700 కు పైగా నష్టపోయింది.

వ్యాఖ్యానించండి