2జి స్పెక్ట్రం కేటాయిస్తూ అప్పటి టెలికం మంత్రి ఎ.రాజా 122 లైసెన్సులు జారీ చేయడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ లు జారీ చేసిన ఐదు రోజుల తర్వాత చిదంబరం ప్రధానికి ఈ నోట్ పంపాడు. దానిలో జరిగింది వదిలేద్దామని, ఇక ముందు జాగ్రత్తపడదామనీ చిదంబరం, ప్రధానికి సూచించాడు. వాస్తవానికి అప్పటికి ప్రధాని, ఆర్ధిక మంత్రి తలచుకున్నట్లయితే ఎ.రాజా లైసెన్సులు జారీ చేయకుండా అడ్డుకోగల అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. జనవరి 10 నాటికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ లను ఎ.రాజా సంతకాలు చేయగా చిదంబరం జనవరి 15 తేదీన ప్రధానికి నోట్ పంపాడు. అప్పటికింకా లైసెన్సులను మంజూరు చేయలేదు.
జనతా పార్టీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ఎ.రాజా, పి.చిదంబరంలు కలిసే స్పెక్ట్రం ధరను నిర్ణయించారని ఆరోపిస్తున్నాడు. ఆయన ఆరోపిస్తున్నట్లు ధరలను నిర్ణయించనప్పటికీ అత్యల్ప ధరల నిర్ణయాన్ని జరిగిపోయినదిగా వదిలేద్దామని మాత్రం ప్రధానికి సూచించాడని నోట్ ద్వారా తెలుస్తోంది.