భారత ప్రజల్లో 40 కోట్లమంది దరిద్రులు, అదీ నెలకి వెయ్యి రూ.ల లెక్కన


భారత ప్రణాళికా సంఘం కొన్ని నిజాలను సుప్రీం కోర్టుకి తెలిపింది. భారత ప్రణాళిక సంఘం ఎవరిని దరిద్రులుగా లెక్కిస్తున్నదో కూడా వెల్లడించింది. ప్రణాళిక సంఘం దారిద్ర్య ప్రమాణాలను చూస్తే ముక్కు వేలు వేసుకోవలసిందే. మొత్తం 120 కోట్ల జనాభాలో 40.74 కోట్ల మంది దరిద్రంలో బతుకుతున్నారని ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకి తెలిపింది. ఎవరిని దరిద్రులుగా భావిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చూస్తే, పట్టణాలలో నెలకు రు.965/- (రోజుకి 32/-)కు తక్కువ సంపాదిస్తున్నవారు దరిద్రులు కాగా, గ్రామాల్లో నెలకు రు. 781/- (రు. రోజుకు 26/-) కంటే తక్కువ సంపాదిస్తున్నవారు దరిద్రులను ప్రణాళికా సంఘం తెలిపింది.

ఈ గణాంకాలను వెనక్కి తెప్పి చదువుకున్నట్లయితే, పట్టణాలలో రోజుకి రు.32/- కంటే తక్కువ సంపాదిస్తున్నవారు, గ్రామాల్లో రోజుకి రు.26/- తక్కువ సంపాదిస్తున్నవారు మొత్తాని కలిపితే వారు 40.74 కోట్ల మంది ఉన్నారని తెలుస్తోంది. వీరిలో ప్రభుత్వ సరఫరాల వ్యవస్ధ ద్వారా సరుకులు పొందుతున్నవారి సంఖ్య 35.98 కోట్లని కూడ ప్రణాళికా సంఘం తెలిపింది. అంటే దరిద్రంలో గడుపుతున్నప్పటికీ ఇంకా ప్రభుత్వ చౌక ధరల సరుకులు అందని వారి సంఖ్య  4.76 కోట్ల మంది ఉన్నారని అర్ధం అవుతోంది.

అయితే ప్రభుత్వం చెబుతున్న 40.74 కోట్ల సంఖ్య 2004-05 సంవత్సరానికి సంబంధించిన అంచనాలు కావడం గమనార్హం. మార్చి 1, 2005 నాటికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సంస్ధ అంచనా ప్రకారం దరిద్రుల సంఖ్య 40.74 కోట్లు. చిత్రం ఏమిటంటే 2009-10 సంవత్సరానికి గాను దారిద్ర్య రేఖకు దిగువనున్న వారి సంఖ్య 2004-05 తో పోలిస్తే తక్కువగా ఉంటుందని ప్రణాళికా సంఘం తన అఫిడవిట్ లో సుప్రీం కోర్టుకి తెలిపింది. గత ఐదు సంవత్సరాలలో భారత ప్రజల దారిద్ర్యాన్ని తగ్గించామని ప్రభుత్వం చెప్పదలుచుకుందన్నమాట.

మే 14 తేదీన జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్ వర్మలతొ కూడిన ధర్మాసనం ఒక ఆదేశం జారీ చేసింది. సురేష్ టెండూల్కర్ నాయకత్వంలోని నిపుణుల బృందం సూచించినదాని ప్రకారం, 2011 నాటి ధరలను బట్టి చూస్తే, పట్టణాల్లొ రోజుకి రు.20/- గ్రామాల్లో రు.15/- చొప్పున మనిషికి 2,100 కేలరీల ఆహారం దొరకడం అసంభవం అని సదరు ఆదేశాలు అభిప్రాయపడ్డాయి. తలసరి ఆహార అవసరాలకు సంబంధించిన ప్రమాణాలను మే 2011 లేదా ఆ తర్వాత ధరల ప్రకారం తాజాగా రూపొంచిందాలని ప్రణాళికా సంఘాన్ని కోర్టు ఆదేశించింది.


వినియోగదారీ ధరల సూచిక ప్రకారం లెక్కిస్తే, పట్టణ ప్రాంతాల్లోని పారిశ్రామిక కార్మికులకు జూన్ 2011 ధరల లెక్కన నెలకు రు.965/-, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తలసరి నెలకు రు.781/- సరిపోతుందని నిర్ధారిస్తూ ప్రణాళికా సంఘం కోర్టుకి అఫిడవిట్ సమర్పించింది. ఆ లెక్కన ఐదుగురు ఉన్న కుటంబానికి వార్షిక ఆదాయం 4,824/-, గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రు.3,905/- ఆదాయం ఉన్నట్లయితే వారిని దరిద్రులుగా పరిగణీంచవలసిన అవసరం లేదు.

ప్రణాళికా సంఘం అంచనాల ప్రకారం దరిద్రులకు కడుపు పావో, సగమో నిండితే సరిపోతుంది. వారికి రోగాలూ, గట్రా రాకూడదు. వచ్చినా ప్రభుత్వానికి అనవసరం. చేతినిండా డబ్బులు ఉంటేనే జబ్బుల ఖర్చులు భరించలేని స్ధితిలో ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రవేటకరిస్తూ, రోగులనుండి యూజర్ ఛార్జిలను వసూలు చేస్తున్న పరిస్ధితుల్లో దరిద్రుల ఆరోగ్య అవసరాలు ఎలా తీరుతాయి? పైగా దరిద్రుల పిల్లలు కూడా చదువుకోవాలి కదా? కె.జి పిల్లలకు కూడా ఫీజులు వేలల్లో వసూలు చేస్తుంటే దాదాపు ఐదు వేల రూపాయల వార్షిక ఆదాయంతో కడుపు నిండా తిండి, చదువు, ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతాయా?

సాధ్యమేనని మన ఘనత వహించిన ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకి తెలిపింది. ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాకు ధనికులు, కంపెనీలు తప్ప వేరొకరు కనపడరు. ఈయనని అదే పదవిలో ఉంచి కారు, సెక్రటరీ తదితర ఖర్చులు ప్రభుత్వం భరిస్తూనే నెలకు రు.965/- తిండికి ఇస్తే బతకగలడా? కుటుంబ సభ్యులు ఉంటే వారికి కూడా తలకు రు.965/- చొప్పున ఇస్టే ఈయనగారి కుటుంబం బతగ్గలదా? సుప్రీం కోర్టు ఈ ప్రశ్నను అహ్లూవాలియాను అడగవలసి ఉంది. బహుశా వీళ్ళ పిల్లలకు ఐస్ క్రీం కొనడానికి కూడా ఆ సొమ్ము సరిపోదేమో.

2011-12 జనాభా సర్వే పూర్తయితే తప్ప అంతిమ లెక్కలు ఇవ్వలేమని ప్లానింగ్ కమిషన్ కోర్టుకి తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాల్లో మనిషికి రోజుకి 2100 కేలరీలు అవసరమని తెలిపింది. అది రోజుకి పట్టణాల్లో ఇరవై రూపాయలతో (గ్రామాల్లొ పదిహేను రూపాయలు) దొరకదని మళ్ళీ లెక్కించి సరిగ్గా ఎంతవుందో లెక్కించమని ప్లానింగ్ కమిషన్ ను కోరింది. వాళ్ళు మళ్ళీ లెక్కించి రోజుకు తలకి పట్టణాల్లో రు.32/- (గ్రామాల్లో రు.26/-) అవసరమని ఆ డబ్బుతో మనిషికి 2100 కేలరీలు తినొచ్చని కమిషన్ చెప్పిందన్నమాట.

భారత పాలకులు, అధికారులు, రాజకీయ నాయకుల దృష్టిలో భారత దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నవారు కడుపు నిండా తినవలసిన అవసరం లేదు. పని చేయగలగడానికి సరిపోయినంత తంటే సరిపోతుంది. వారికి రోగాలు రాకూడదు. వచ్చినా ప్రభుత్వానికి అనవసరం. దరిద్రులు తమ పిల్లలు పుట్టిన వెంటనే పనిలో చేరి రోజుకి 32/- గానీ 26/- గానీ సంపాదించాలి. అలా సంపాదిస్తేనే వారి కడుపు నిండేది. ఇక చదువంటారా, దరిద్రులకి చదువెందుకు చెప్పండి?

One thought on “భారత ప్రజల్లో 40 కోట్లమంది దరిద్రులు, అదీ నెలకి వెయ్యి రూ.ల లెక్కన

వ్యాఖ్యానించండి