2004-05 లెక్కల ప్రకారం పట్టణాల్లో తలకు రోజుకి రు.20/, గ్రామాల్లో తలకు రు.15/ సంపాదిస్తున్నట్లయితే వారు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లేనని ప్రణాళికా సంఘం కోర్టుకి అఫిడవిట్ సమర్పించడం పట్ల వివిధ వర్గాలు, సంస్ధలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. దారిద్ర్య రేఖను కృత్రిమంగా కిందికి జరిపి దరిద్రుల సంఖ్యను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నారనీ, తద్వారా ప్రభుత్వం సబ్సిడీ అందించాల్సిన వారి సంఖ్యను తగ్గించడానికీ, బాధ్యతనుండి తప్పించుకోవడానికీ ప్రయత్నిస్తున్నదని నిపుణులు ఆరోపించారు.
ప్రణాళికా సంఘం సభ్యులు కొందరు అఫిడవిట్ లో పొందుపరచబడిన అంకెలు సురేష్ టెండూల్కర్ కమిషన్ నిర్ధారించినవనీ, ప్రణాళికా సంఘానికి వేరే లెక్కలు అందుబాటులో లేవనీ తాజా లెక్కల సేకరణ ముగిసేవరకూ అందుబాటులోకి రావనీ చెప్పి తప్పించుకున్నారు. ప్రణాళికా సంఘంలో కూర్చుని మేస్తున్నవారికి అనేక నివేదికలు అందుబాటులో ఉంటాయి. అవేమీ పట్టించుకోకుండా ఒక్క సురేష్ టెండూల్కర్ అనే మేతావి లెక్కలే తమకు కావాలనీ అప్పటిదాకా దరిద్రం ఎంతో తేల్చలేమనీ చేతులెత్తేయడం వారా పదవులకు అర్హులు కాదని అర్ధం అవుతోంది.
వాస్తవాలను సూచించే గణాంకాల వలన సబ్సిడీ ధరలకు సరుకులు అందించవలసినవారి సంఖ్య అధికం అవుతుందన్న భయాలతో ప్రభుత్వాలు, దాని సంస్ధలూ, ప్రజల అవసరాలను తీవ్రం కోత పెట్టడానికి సైతం సిద్ధపడుతున్నాయన్న మాట!
ఇదిలా ఉంటే భారత దేశంలో కార్పొరేట్ కంపెనీల సి.ఇ.ఓ లకు అందిస్తున్న వార్షిక వేతనాలు, ప్రభుత్వంలో సెక్రటరీలుగా ఉద్యోగాలు వెలగబెడుతున్న ఐ.ఎ.ఎస్ అధికారుల వేతనాలు చూసినట్లయితే కళ్ళు తిరగవలసిందే. ప్రజలకు రోజుకి ఇరవై రూపాయలు సరిపోతాయని తేల్చేసే అధికారులు తమకు నెలకి లక్షకు పైగా లేక రోజుకి నాలుగు వేల రూపాయల జీతం ఎందుకో చెప్పవలసి ఉంది. తమ కోసం రోజుకి నాలుగువేల జీతం తీసుకుంటూ, దరిద్రుడికి నెలకు నాలుగువేలు సరిపోతాయని లెక్కలు వేస్తున్న ఈ ప్రభుద్ధులు ప్రజలకోసం పనిచేస్తారంటే ఎలా నమ్మడం? మరీ ఇంత అన్యాయమా?

రోజుకి ఇరవై రూపాయలు సంపాదించేవాళ్ళు పేదవాళ్ళు కారా? మా పట్టణంలో పాకీ పని చేసేవాళ్ళకే రోజుకి ముప్పై రూపాయలు వస్తాయి. అంటే మా పట్టణంలో పేదరికం లేనట్టే లెక్క. కోస్తా ఆంధ్రలో ఏ పట్టణంలోనైనా పాకీవాళ్ళు కనిష్ఠంగా ముప్పై రూపాయలే తీసుకుంటారు, బిల్డింగ్ పనులు చేసేవాళ్ళు కనిష్ఠంగా డబ్బై రూపాయలే తీసుకుంటారు. కోస్తా ఆంధ్రలో పారిశ్రామిక కార్మికులు నెలకి 3500 జీతాలు సంపాదిస్తారు, తెలంగాణాలోని పారిశ్రామిక కార్మికులు నెలకి 2500 జీతాలు సంపాదిస్తారు. ఈ లెక్క ప్రకారం ఆంధ్ర ప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాలలో పేదరికం లేనట్టే లెక్క.