ఎ.రాజా 2జి స్పెక్ట్రం కేటాయింపులు చిదంబరం, మన్మోహన్‌లు తెలిసీ అమోదించారు


2జి స్పెక్ట్రం లైసెన్సులను అతి తక్కువ ధరలకు కేటాయించిన విషయం అప్పటి ఆర్ధిక మంత్రి, ప్రధాని మన్మోహన్ లకు తెలిసే జరిగిందని ఫస్ట్ పోస్ట్ వెల్లడించిన డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఆర్.టి.ఐ చట్టం ద్వారా ఫస్ట్ పోస్ట్ వెబ్ మ్యాగజైన్ ప్రధాన మంత్రికి 2జి కేటాయింపులపై చిదంబరం రాసిన నోట్‌ను సంపాదించింది. 122 2జి స్పెక్ట్రం లైసెన్సులను వివాదాస్పద రీతిలో అప్పటి టెలికం మంత్రి ఎ.రాజా కేటాయించిన ఐదురోజుల తర్వాత చిదంబరం ఒక నోట్ ను ప్రధానికి రాశారు. అందులో అప్పటివరకు జరిగిన కేటాయింపులను వదిలేద్దామనీ, తదుపరి జరగబోయే కేటాయింపులను వేలం వేద్దామనీ ప్రధానికి సూచిస్తూ ఈ నోట్ రాశాడు. ఈ నోట్ ప్రకారం ఎ.రాజా చేసిన స్పెక్ట్రం కేటాయింపుల వలన ప్రభుత్వానికి నష్టం వస్తుందని తెలిసీ చూసి చూడనట్లు పోయారని విస్పష్టంగా రుజువవుతోంది.

పి.చిదంబరం ను కూడా స్పెక్ట్రం కుంభకోణంలో దోషిగా చేర్చాలని జనతా పార్టీ నేత, అడ్వకేట్ సుబ్రమణ్య స్వామి పిటిషన్ దాఖలు చేసిన నేపధ్యంలో ఈ వెల్లడి ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ను 2జి స్పెక్ట్రం కుంభకోణంలో నిందితుడిగా చేర్చలేమని సి.బి.ఐ సుప్రీం కోర్టుకి బుధవారం తెలిపింది. జనవరి 15, 2008 తేదీన ప్రధానికి పి.చిదంబరం రాసిన నోట్‌లో 2జి స్పెక్ట్రం కేటాయింపుల విషయంలో ఎ.రాజా నిర్ణయాని అమోదం తెలుపుతున్నట్లుగా స్పష్టం అవుతోంది.  ఎంట్రీ ఫీజులను గానీ, స్పెక్ట్రం ఛార్జీలను గాని 2001 స్ధాయిలో నిర్ణయించడానికి ఎటువంటి అభ్యంతరాన్నీ చిదంబరం వ్యక్తం చేయలేదు.

“నోట్ ఆన్ స్పెక్ట్రం ఛార్జెస్” ను చిదంబరం ప్రధాని మన్మోహన్‌కి పంపాడు. “గతం మూసేసిన ఛాప్టర్ గా భావించవచ్చు. భవిష్యత్తులో జరిగే అదనపు స్పెక్ట్రం కేటాయింపులను వేలం వేసే పద్ధతి ద్వారా కేటాయించవచ్చు. ఈ పద్ధతిని అనుసరిస్తే, న్యాయపరమైన సవాళ్ళను ఎదుర్కోవడానికి సులభం అవుతుంది” అని సదరు నోట్ లో చిదంబరం రాశాడు. ప్రారంభ కేటాయింపుల కంటే అదనపు స్పెక్ట్రం ను ఇప్పటికె ఎవరికైనా కేటాయించినట్లయితే దానికి కూడా వేలం ధరలను వసూలు చెయ్యాలని చిదంబరం నోట్ లో సూచించాడు.

“న్యాయపరమైన సవాళ్ళు” అని చిదంబరం రాయడాన్ని బట్టి, ఎ.రాజా లైసెన్సులు జారీ చేసిన పద్ధతుల గురించి చిదంబరానికి ముందే తెలుసుననీ, ఆ కేటాయింపులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనవలసిన ప్రమాదం ఉందని కూడా ముందే తెలుసునని స్పష్టం అవుతోంది. అయినప్పటికీ దానిని ముగిసిన ఛాప్టర్ గా తొక్కిపెట్టడానికే చిదంబరం ఆసక్తి చూపాడు. బహుశా కాగ్ సంస్ధ ఈ అంశాన్ని పీకి పాకం పెడుతుందనీ, కాగ్ నివేదిక ఆధారంగా సుప్రీం కోర్టు ఇంత తీవ్రంగా స్పెక్ట్రం కేటాయింపులను పట్టించుకుంటుందనీ చిదంబరం అప్పటికి ఉన్న పరిస్ధితుల్లో ఊహించలేకపోయాడు కాబోలు.

అప్పటి టెలికం మంత్రి ఎ.రాజా ఏం చేస్తున్నాడో పి.చిదంబరం, మన్మోహన్ లకు తెలుసన్న సంగతి నోట్ ద్వారా స్పష్టమవుతోంది. 2001 నాటి ఎంట్రీ ఫీజులనే ఎ.రాజా నిర్ణయిస్తున్నప్పటికీ ఆర్ధిక మంత్రి, ప్రధాన మంత్రిలకు ఎటువంటి అభ్యంతరం లేకుండా పోయింది. అప్పటివరకూ జరిపిన కేటాయింపులను “గతం గతః” కిందికి నెట్టి, ఇక తర్వాత కేటాయింపులను మాత్రం వేలంలో కేటాయిద్ధామని చిదంబరం రాయడం వెనుక చిదంబరం ఉద్దేశ్యం తేలికగానే అర్ధం అవుతున్నది. 2జి స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణంలో పి.చిదంబరం పాత్ర ఉన్నదని సుబ్రమణ్య స్వామి సాక్షాధారాలను సుప్రీం కోర్టుకి సమర్పించిన నేపధ్యంలో మునుముందు పరిణామాలు ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

One thought on “ఎ.రాజా 2జి స్పెక్ట్రం కేటాయింపులు చిదంబరం, మన్మోహన్‌లు తెలిసీ అమోదించారు

వ్యాఖ్యానించండి