ఆత్మాహుతి దాడిలో ఆఫ్గన్ మాజీ అధ్యక్షుడు హతం


ఆఫ్ఘనిస్ధాన్ మాజీ అధ్యక్షుడు బర్హనుద్దీన్ రబ్బాని ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వం నియమించిన పీస్ కౌన్సిల్ కు నాయకత్వం వహిస్తున్న రబ్బానీ హత్యతో శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం ఏర్పడిందని ఆఫ్గన్ అధికారులతో పాటు వార్తా సంస్ధలు, పత్రికలు బాధపడుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్ధాన్, అమెరికా ప్రభుత్వాల అధికారులు చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. ఆఫ్ఘనిస్ధాన్‌లో శాంతి నెలకొల్పే అవకాశం లేకుండా పోయిందన్నది వారి బాధ.

అసలు ఆఫ్ఘనిస్ధాన్‌లో ఎందుకు శాంతి లేకుండా పోయిందో వీరు ఆఫ్ఘనిస్ధాన్ ప్రజలకు సమాధానం చెప్పి ఆ తర్వాత శాంతి అవకాశాలు మిస్ అయ్యాయని బాధపడితే ఒక పద్ధతిగా ఉంటుంది. అత్యాధునిక సైనిక, ఆయుధ పాటవంతో అచ్చోసిన ఆంబోతుల్లా ఆఫ్ఘనిస్ధాన్‌ని దురాక్రమించి, ఆఫ్ఘన్ ప్రజలకు ధన, ప్రాణాలను సర్వనాశనం చేస్తున్నప్పుడు భంగంగాని శాంతి తమ తొత్తు మనిషిని మిలిటెంట్లు చంపేశారనేసరికి ఎక్కడ లేని శాంతి ఇఫ్పుడు భగ్నం అవుతుందన్నమాట!

తలపాగాలో బాంబు దాచిఉందిన ఆత్మాహుతి దళ కార్యకర్త మంగళవారం దాడి చేయడంతో బర్హనుద్దీన్ రబ్బానీ, ఆయన బాడి గార్డులు నలుగురు మృతి చెందారు. అధ్యక్షుడికి కీలక సలహాదారుగా ఉన్న వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడని తెలుస్తోంది. అధ్యక్షుదు హమీద్ కర్జాయ్ అమెరికా పర్యటనను ముగించుకుని ఆఫ్ఘనిస్ధాన్‌కి తిరుగు ప్రయాణమయ్యాడనీ, కాదు మరొక రోజు ఉండి వస్తాడనీ రెండు వార్తలు వెలువడ్డాయి. తలపాగాలో పేలుడు పదార్ధాలు దాచిన వ్యక్తి సాయంత్రం రబ్బాని ఇంటిలోకి వచ్చి తనను తాను పేల్చుకున్నాడని పోలీసులు తెలిపారు.

‘హై పీస్ కౌన్సిల్’ కు అధిపతిగా రబ్బానిని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ నియమించుకున్నాడు. దశాబ్దం నుండి కొనసాగుతున్న దురాక్రమణ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కనుగొనడానికి రబ్బాని నాయకత్వంలో పీస్ కౌన్సిల్ ఏర్పాటు చేశారనీ, ఆయన మరణంతో ఆ ప్రయత్నాలు మూలనపడ్డాయనీ పశ్చిమ దేశాల వార్తా సంస్ధలు చెబుతున్నాయి. సంవత్సరం క్రితం నెలకొల్పబడిన ఈ కౌన్సిల్ అప్పటినుండి శాంతి నెలకొనే దిశలో ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది. సంవత్సర కాలంగా ఒక్క అడుగుకూడా వేయని శాంతి కౌన్సిల్ నాయకుడి మరణంతో శాంతికి ఎలా భంగం కలిగిందో అర్ధం కాని విషయం.

తాలిబాన్ పాలన రాకముందు ఆఫ్ఘనిస్ధాన్ కు రబ్బానీ అధ్యక్షుడుగా పనిచేశాడు. 1996లో అధికారంనుండి కూల్చివేశాక రబ్బానీ నార్త్రన్ అలయన్స్‌ కూటమికి నామ మాత్రపు నాయకుడుగా మిగిలాడు.  నార్త్రన్ అలయన్స్ ప్రధానంగా తజక్‌లు, ఉజ్బెక్‌లతో కూడి ఉన్నది. తాలిబాన్ పాలన అజ్ఞాతంలోకి వెళ్ళాక నార్త్రన్ అలయెన్స్ కూటమి మళ్ళీ అధికారం చేపట్టింది. రబ్బాని తజిక్ తెగకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. తాలిబాన్‌తో శాంతి చర్చలు ప్రారంభం కావడానికి రబ్బాని మరణం ఆటంకమనీ, ప్రాంతీయ, తెగల వైరుధ్యాలను అదుపులో పెట్టడం కష్టమవుతుందనీ పత్రికలు చెబుతున్నాయి.

తాలిబాన్‌తో శాంతి చర్చలకు నాయకుడుగా ఉన్న రబ్బానిని కూడా హత్య చేయడానికి తాలిబాన్ సిద్ధపడితే, అటువంటి వ్యక్తి మరణం తాలిబాన్‌తో చర్చలకు ఆటంకం అని చెప్పడం హేతువుకి అందని విషయం. అమెరికా ఆదేశాలతో తాలిబాన్‌తో చర్చలకు ఆఫ్ఘన్ ప్రభుత్వం రబ్బానిని నియమించుకుంది. రబ్బాని మరణంతో హమీద్ కర్జాయ్ ప్రభుత్వం తాలిబాన్‌తో కుమ్మక్కయ్యిందన్న ఆరోపణలు కూడా తలెత్తుతాయని తెలుస్తోంది. నార్త్రన్ అలయన్స్ లోని సీనియర్ సభ్యులు ఈ ఆరోపణలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికారంలో ఉన్న నార్త్రన్ అలయన్స్ కూటమిలో, రబ్బాని మరణం, మరిన్ని వైరుధ్యాలను రేకెత్తిస్తుందని అంచనా వేస్తున్నారు.

తాలిబాన్‌తో చర్చల ప్రక్రియ ప్రారంభమయిందని ప్రకటనలు వెలువడుతుండడంతో ఇప్పటికే కూటమిలోని కొన్ని సంస్ధలు తిరితి ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లు ‘ది హిందూ’ తెలిపింది. ఈ ప్రక్రియను రబ్బాన్ని మరణం మరింత వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. కర్జాయ్ సలహాదారు మహమ్మద్ స్టానెక్జాయ్ రబ్బానిపై జరిగిన దాడిలో గాయపడ్డాడు. గాయాలు తీవ్రంగా లేవని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్ధాన్ పీస్ అండ రీకన్సిలేషన్ కార్యక్రమానికి అమెరికా నిధులు సమకూరుస్తోంది. ఈ కార్యక్రమానికి నాయకుడు స్టానెక్జాయ్ కావడం గమనార్హం. తాలిబాన్‌లోని మధ్య, దిగువ స్ధాయి కార్యకర్తలను శాంతి కార్యక్రమంవైపు ఆకర్షించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందిచారు. మొత్తం ఆఫ్ఘనిస్ధాన్‌లో 25,000 నుండి 40,000 వరకు తాలిబాన్ కేడర్ ఉండగా వారిలో రెండు వేల మందివరకూ ఈ కార్యక్రమం ద్వారా ఆకర్షించగలిగారని ది హిందూ తెలిపింది.

వ్యాఖ్యానించండి