ఫ్రెంచి, బ్రిటిష్ కిరాయి సైనికులను పట్టుకున్న గడ్డాఫీ బలగాలు


ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాలు లిబియా తిరుగుబాటు పూర్తయ్యిందని ప్రకటించాయి. గడ్డాఫీ కబంధ హస్తాలనుండి లిబియా ప్రజలను విముక్తం చేసినట్లు ప్రకటించాయి. ఐనా నాటో వైమానిక దాడులు ఆగలేదు. లిబియా పౌరులను గడ్డాఫీబారినుండి కాపాడడానికి వైమానికదాడులు చేస్తున్నామని ఇన్నాళ్ళూ ప్రకటిస్తూ వచ్చిన ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ ల నేతృత్వంలోని నాటో బలగాలు గడ్డాఫీ లిబియా వదిలి వెళ్ళినప్పటికీ ఎందుకు ఇంకా బాంబు దాడులు చేస్తున్నారు. గడ్డాఫీ బలగాలు ప్రస్తుతం గడ్డాఫీ సొంత నగరం సిర్టే, మరొక పట్టణం బాన్ వాలిద్ లను అదుపులో పెట్టుకుని తిరుగుబాటు బలగాలను తిప్పికొడుతున్నాయని వార్తా సంస్ధల ద్వారా తెలుస్తోంది.

ఈ నేపధ్యంలో గడ్డాఫీ బలగాలు ఇప్పుడిక దాడి చేసే పరిస్ధితుల్లొ లేవని అర్ధమవుతోంది. కేవలం రక్షణాత్మక పరిస్ధితుల్లోనే ఉన్నాయి. అది కూడా కేవలం రెండు నగరాలవరకే పరిమితమైంది. ఆ రెండు నగరాలపైనా, దక్సిణాన ఉన్న సాభా పైనా నాటో బలగాలు బాంబు దాడులు కొనసాగించడంతో పాటు దుష్ట కూటమికి చెందిన దేశస్ధులు సైతం ఈ నగరాల్లోకి జొరబడి తిరుగుబాటు బలగాలకు నాయకత్వం వహిస్తున్నాయి. ఆ విధంగా తిరుగుబాటు బలగాలకు మార్గదర్శకత్వం వహిస్తూ సిర్టే, బాన్ వాలిద్ పట్టణాల్లోకి జొరబడిన ఫ్రెంచి, బ్రిటిష్ ఇంకా మరికొన్ని విదేశీ కిరాయి సైనికుల్ని 17 మందిని అరెస్టు చేసినట్లుగా గడ్డాఫీ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు.

ఇరాక్‌ను విముక్తం చేసిన అమెరికా ఆ తర్వాత కుక్కలు చింపిన విస్తరి అయిన ఇరాక్‌ను దాని మానాన దానిని వదిలిపెట్టింది. ప్రజాస్వామ్యం స్ధాపిస్ధానని ఇరాక్‌లో జొరబడి, ప్రజాస్వామ్యం సంగతి అటుంచి తన సైన్యానికే రక్షణ లేని పరిస్ధితిలో కొట్టుమిట్టాడుతోంది అమెరికా. లిబియాలోనూ అదే వెలగబెడుతోంది దుష్టత్రయమైన ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికాల దుష్టకూటమి. ట్రిపోలీలో పనికోసం వలస వచ్చిన అఫ్రికా దేశాల నల్లజాతియులను వేలాదిమందిని గడ్డాఫీ మద్దతుదారులన్న అనుమానంతో తిరుగుబాటు సైన్యాలు ఊచకోత కోశాయి. వారి శవాలను తొలగించే నాధుడు కూడా లేక రోడ్లపైన కుళ్ళిపోతుండగానే అమెరికా, యూరప్ లకు చెందిన పెట్రోలియం కంపెనీలు వాటాలు పంచుకోవడంలో మునిగిపొయ్యాయి.

మరోవైపు ట్రిపోలీ పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్నారో లేదో తెలియదు గాని సిర్టే, బాన్ వాలిద్ పట్టణాలను వశం చేసుకోవడానికి వెళ్ళిన తిరుగుబాటు బలగాలు గడ్డాఫీ బలగాల ధాటికి నిలవలేక చెల్లాచెదురవుతున్నారని రాయిటర్స్, బిబిసి లు తెలిపాయి. నాటో విమానాలు ఈ రెండు పట్టణాలపైనా దాడులు చేస్తూ పౌరులను చంపడం కొనసాగిస్తున్నాయి. గడ్డాఫీ బలగాలను ఎదుర్కోలేని స్ధితిలో తిరుగుబాటు సైనికులు ఉండగా, తిరుగుబాటు ప్రభుత్వంలో సైతం మంత్రి పదవుల వద్ద ఏకాభిప్రాయం కుదరక ఘర్షణ పడుతున్నారని రాయిటర్స్ తెలిపింది. ఈ పరిస్ధితుల్లో తిరుగుబాటుదారులు లిబియాను కలిపి ఉంది పాలించగలరా లేదా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫ్రెంచి, బ్రిటిష్, ఖతారీ దేశస్ధులు గడ్డాఫీ బలగాలు పట్టుకున్నవారిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటన లిబియా తిరుగుబాటు ప్రభుత్వంతో పాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలకు కూడా అవమానకరమైన దిగా చెప్పవచ్చు. లిబియాలో నూతన ప్రభుత్వం రాజకీయంగా, మిలట్రీ పరంగా కూడా ఎదురు దెబ్బలు తింటున్న పరిస్ధితి నెలకొని ఉంది. గడ్డాఫీ ట్రిపోలి వదిలిపెట్టి నెలపైనే అవుతున్నా నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (టి.ఎన్.సి) తన పాలనను ట్రిపోలికి ఇంకా మార్చలేదు. పూర్తిగా విజయం చేజిక్కిందా లేదా అన్న విషయంలో కూడా తిరుగుబాటు నాయకుల్లో తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందర్నీ, అన్ని తెగలవారినీ కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన టి.ఎన్.సి పదవుల పంపకంలో ఏటూ తేలక వాయిదా వేసుకుంది.

“17 మంది సభ్యులుగా గల కిరాయి సేనల బృందం బాని ఫాలిద్ పట్టణంలో పట్టుబడ్డారు. వారు సాంకేతిక నిపుణులు. వారిలో సలహా అధికారులు కూడా ఉన్నారు” అని గడ్డాఫీ ప్రతినిధి మౌసా ఇబ్రహీం తెలిపాడు. సిరియా నుంచి నడిచే టొ.వి ఛానెల్ అర్రై టెలివిజన్ లో ఇబ్రహీం ఈ ప్రకటన చేశాడు. “వారిలో అధికులు ఫ్రెంచివారు. ఒకరు ఓ ఆసియా దేశానికి చెందినవారు. ఏ దేశమన్నదీ ఇంకా గుర్తించలేదు. ఇద్దరు బ్రిటిష్ వారు గా ఒకరు కతార్ దేశానికి చెందినవారు” అని ఇబ్రహీం తెలిపాడు.

అయితే ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు తేలుకుట్టిన దొంగల్లా అబ్బే మావాళ్ళు కాదు అని అంటున్నాయి. దాని గురించి తమ వద్ద సమాచారం ఏమీ లేదని ఫ్రాన్సు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిటిష్ విదేశాంగ శాఖ తాము మీడియా వార్త విన్నామనీ కాని ఆ వార్తను ధృవీకరించుకోళేదనీ తెలిపింది. కతార్ విదేశాంగ శాఖ అందుబాటులోకి రాలేదని రాయిటర్స్ తెలిపింది. గడ్డాఫీకి మద్దతుగా ఉన్న సిర్టే, బాని వాలిద్ లపై వైమానికా దాడులు కొనసాగిస్తున్న నాటో, లిబియా గడ్డపైన తమ బలగాలేవీ లేవని బొంకింది.

కాని పశ్చిమ దేశాలు గతంలో ప్రత్యేక బలగాలను పంపాయనీ, ప్రవేటు సెక్యూరిటీ సంస్ధలు గడ్డాఫీ వ్యతిరేక తిరుగుబాటుదారులకు ఆయుధ శిక్షణ ఇచ్చాయనీ రాయిటర్స్ తెలిపింది. లక్ష్యాలను ఛేదించడం, నాయకత్వం వహించడం వంటి వాటిలో కూడా శిక్షణ ఇచ్చారని రాయిటర్స్ తెలిపింది.

ట్రిపోలికి ఆగ్నేయంగా 150 కి.మీ దూరంలో ఉన్న బాని వాలిద్ పట్టణాన్ని గడ్డాఫీ మద్దతుదారులనుండి స్వాధీనం చేసుకోవడానికి తమ బలగాలు వెళ్తున్నాయని హెచ్చరిస్తూ గడ్డాఫీ బలగాలకు లొంగిపోవాల్సిందిగా ఎన్.టి.సి కోరింది. తీరా చూస్తే గడ్డాఫీ బలగాల ధాటికి తిరుగుబాటు బలగాలు నిలవలేక చెల్లా చెదురవుతున్నాయి. తిరుగుబాటుదారులు పదే పదే పట్టణంపైకి వెళ్ళినా వెనక్కి పరుగెత్తి వచ్చారు తప్ప ముందుకు వెళ్లలేకపొయారు. పెద్ద ఎత్తున కాల్పులు జరుగుతుండడంతో తిరుగుబాటు బలగాలకు పట్టణంలోకి ప్రవేశించే అవకాశమే లభించలేదు. ట్యాంకులు, ట్రక్కులను ముందునడిపి దాడి చేయాలన్న తిరుగుబాటుదారుల పధకాలన్నీ బెడిసికొట్టాయని రాయిటర్స్ తెలిపింది. సమన్వయం కొరవడిందని తిరుగుబాటు సైనికుల నాయకులు చెబుతున్నట్లు తెలుస్తోంది.

సమన్వయం లేదన్న మాట తిరుగుబాటు మొదలైనప్పటినుండీ వారు చెబుతూనే ఉన్నారు. పైగా ఫ్రెంచి, బ్రిటిష్, అమెరికన్ సలహాదారులు అనేకులు తిరుగుబాటు బలగాలకు సలహాలు ఇచ్చారనీ, శిక్షణ ఇచ్చారని చెబుతున్నప్పటికీ ఇంకా సమన్వయం కొరవడడం దగ్గరే వారు సాకులు చూపుతున్నారు. బాని వాలిద్ పట్టణం నుండి సేకరించిన మనుషులకూ ట్రిపోలి నుండి వచ్చిన తిరుగుబాటు సైనికులకూ మధ్య ఉద్రిక్తలు తలెత్తుతున్నాయని కూడా చెబుతున్నారు. ఒక దశలో బానివాలిద్ కి చెందిన గ్రూపు నాయకుడు, తన గ్రూపులోని ట్రిపోలీ సైనికులు గాల్లోకి కాల్పులు జరపొద్దని ఆదేశాలిచ్చినందుకు అతనిని ఎగతాళి చేస్తూ నవ్వారు తప్ప అదేశాలు పాటించలేదని రాయిటర్స్ తెలిపింది.

రాజకీయ రంగానికి వస్తే మధ్యంతర ప్రభుత్వంలోని ప్రధాని మహ్మౌద్ జిబ్రిల్ కొన్ని కేబినెట్ పదవులను భర్తీ చేయలేకపోయాడు. కౌన్సిల్ సభ్యులందర్ని నుండీ మద్దతు లేకపోవడంతో ఆ నిర్ణయాలు వాయిదా పడ్డాయి. “మేము చాలా పోర్టుఫోలియాల విషయంలో అంగీకారానికి వచ్చాం. ఇంకా చర్చించాల్సిన పోర్ట్‌ఫోలియాలు కూడా చాలానే ఉన్నాయి” అని జిబ్రిల్ ఆదివారం తెలిపాడని రాయిటర్స్ వెల్లడించింది. కాని కనీసం అంగీకారానికి వచ్చిన జాబితాను కూడా కౌన్సిల్ చూపలేకపోయింది. కేబినెట్ స్ధానాలకు సంబంధించిన చర్చలలో ప్రధాని జిబ్రిల్ పదవే ప్రశ్నార్ధకంగా మిగిలిందని తెలుస్తోంది.

లిబియా విముక్తం అయ్యిందని ప్రకటించక ముందు మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలా వద్దా అన్నదానిపై బేధాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గడ్డాఫీని వ్యతిరేకించడంలో ఐక్యంగా ఉన్న తిరుగుబాటు బలగాలు పదవుల పంపకంలో విఫలమవుతున్నారు. తిరుగుబాటు బలగాల్లో మొత్తం మూడు రకాల గ్రూపులు ఉన్నాయని తెలుస్తోంది. పశ్చిమదేశాల అనుకూల వర్గం ఒకటి కాగా, రహస్యంగా ఉన్న ఇస్లామిస్ట్ మిలిటెంట్లు (ఆల్-ఖైదా) ఒక వర్గంగానూ, గడ్డాఫీ వైపునుండి గోడదూకి వచ్చినవారు మరొక వర్గంగానూ కొనసాతున్నారని తెలుస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s