ఐ.ఎం.ఎఫ్ మాజి మేనేజింగ్ డైరెక్టర్ స్ట్రాస్ కాన్ జైలునుండి బైటకు వచ్చాక మొదటిసారి నోరు విప్పాడు. హోటల్ మెయిడ్‌పైన తాను బలవంతం చేయనప్పటికీ ఆమెతో తన ప్రవర్తన నా నైతిక పతనమేనని అంగీకరించాడు. “భారత దేశ రాజకీయ నాయకుడు స్ట్రాస్ కాన్ ఉన్న పరిస్ధితిలో ఉన్నట్లయితే, మొత్తం ఘటననే పెద్ద అభద్దం అని బొంకి ఉండేవాడు. అసలు అటువంటిది ఏమీ జరగనే లేదనీ, మెయిడ్‌ని తానసలు ఇంతవరకూ చూడనేలేదనీ అనేక ఒట్లు పెట్టి ఉండేవాడు. కావాలంటే బహిరంగ చర్చకు సిద్ధమనో, ఫలానా కాణిపాకలో ప్రమాణం చేస్తాను మీరు సిద్ధమేనా అని ప్రత్యర్ధులనుగానీ ఆరోపణలు చేస్తున్నవారిని గానీ సవాలు చేస్తుండేవాడు. పనిలో పనిగా తనపై ఆరోపణలు చేసినవారి చరిత్రను తవ్వి వీలయితే లేనివి కలిపి ప్రత్యారోపణలు చేసి ఉండేవాడు. ఇవేవీ చేయనందుకు స్ట్రాస్ కాన్ అభినందనియుడే కదా?!” అని అమెరికా, యూరప్ లేదా ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు ఆరాధకులు ధైర్యంగా నిలదీసే మంచి అవకాశాన్ని స్ట్రాస్ కాన్ తాజా ప్రకటనతో కల్పించాడు.
ఘటనలో తాను హింసకు గానీ బలవంతానికి ఆనీ పాల్పడలేదని స్ట్రాస్ కాన్ పేర్కొన్నాడు. కనుక చట్టబద్ధంగా తాను తప్పు లేదని పరోక్షంగా సెలవిచ్చాడు. మే 14 తేదీన జరిగిన ఈ ఘటన తర్వాత కాన్ మొదటిసారి ఫ్రెంచి టెలివిజన్ ఛానెల్ టి.ఎఫ్1కు ఇరవై నిమిషాల పాటు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని కాన్ తెలిపాడు. తనకూ న్యూయార్క్‌లోని సోఫీ టేల్ హోటల్ మెయిడ్ ‘నఫిస్సాటౌ దియల్లో’కూ మధ్య జరిగినది “సరైన సంబంధం కాదు. అంతేకాక అంతకంటే ముఖ్యంగా అది తప్పు” అని అంగీకరించాడు.
హోటల్ మెయిడ్ తో కక్కుర్తిపడేంతవరకూ స్ట్రాస్ కాన్ ఫ్రాన్సులో వచ్చే సంవత్సరం జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో అందరికంటే ముందు ఉన్నాడు. అత్యధిక శాతం ఆమోదంతో ఇతర పోటీదార్ల కంటే ముందున్నాడు. సర్కోజీ రెండో సారి అధ్యక్ష పదవికి నెగ్గడం కష్టమేనని అందరూ భావించారు. అధ్యక్ష పదవికి తన అభ్యర్తిత్వాన్ని ప్రకటించనప్పటికీ స్ట్రాస్ కాన్, కాబోయే ఫ్రాన్సు అధ్యక్ధుడుగా ఫ్రాన్సులో మన్ననలు అందుకుంటున్న పరిస్ధితిలో దియల్లో స్ట్రాస్ కాన్ వ్యవహారాన్ని బైటపెట్టింది. అయితే అసలు స్ట్రాస్ కాన్, వివాహేతర సంబంధం పెట్టుకోవడమే నేరంగా పరిగణించబడే సంస్కృతి, చట్టాలు ఉన్నట్లయితే పరిస్ధితి మరోలా ఉండేది. నైతికంగా నేరమైనది చట్టపరంగా నేరం కాకపోవడం ఒక సామాజిక వైరుధ్యం. అనేక సామాజిక వైరుధ్యాలున్న సమాజం గనకనే నేను నైతికంగా తప్పిదం చేశాను అని బహిరంగంగా చెప్పడానికి స్ట్రాస్ కాన్ సిద్ధపడ్డాడు. లేనట్లయితే సదరు ఒప్పుకోలు వెలువడి ఉండేది కాదేమో!
“అదొక వైఫల్యం. నా భార్య, పిల్లలు, స్నేహితులు వీరందరి ఆదరాభిమానాల నేపధ్యంలో చూస్తే అదీ తీవ్రమైన వైఫల్యం. ఫ్రాన్సు ప్రజల దృష్టిలో కూడా అది తీవ్ర వైఫల్యమే. వారు నాలో మార్పు వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు” అని స్ట్రాస్ కాన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. “అది నైతిక పతనం అని భావిస్తున్నాను. దానిపట్ల నేను గర్వంగా లేను. ఆ విషయమై నేను అనంతమైన బాధను అనుభవిస్తున్నాను. గత ఐదు నెలలుగా ప్రతిరోజూ నేను వ్యాకుల పడుతూనే ఉన్నాను. అదింకా పూర్తయిందని నేను భావించడం లేదు” అని స్ట్రాస్ కాన్ పేర్కొన్నాడు.
స్ట్రాస్ కాన్ సాహసాలు ఇప్పటికి అనేకం పత్రికలు వెల్లడి చేసాయి. ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉంటూ కూడా తన కుక్క బుద్ధిని కాన్ పోగొట్టుకోలేదు. ఐ.ఎం.ఎఫ్ లోనే ఒక ఉద్యోగినితో సంబంధం పెట్టుకుని ఐ.ఎం.ఎఫ్ బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు. అప్పుడే తగిన చర్య తీసుకున్నట్లయితే దియల్లో ఘటన జరిగి ఉండేది కాదని, దియల్లో ఆరోపణలు వెలువడినప్పుడు ఐ.ఎం.ఎఫ్ బోర్డు గుణపాఠం తీసుకుంది. స్ట్రాస్ కాన్ పెద్ద ‘వుమెనైజర్’ అని అందరూ, ముఖ్యంగా ఫ్రాన్సు రాజకీయ లోకం అంతా అంగీకరించే నిజంగా దియల్ళో ఘటన జరగడానికి చాలాకాలం మునుపే స్ధిరపడి ఉంది. ఫ్రాన్సులో రాజకీయ నాయకులు ఇటువంటి వేషాలు వేసినా వారి రాజకీయ జీవితానికి ఆటంకం కలగదనీ ఒక అభిప్రాయం కూడా వార్తా సంస్ధలు అనేక కధనాలు రాశాయి. ఈ నేపధ్యంలో మాత్రమే స్ట్రాస్ కాన్ ధైర్యంగా తాను నైతికంగా పతనమయ్యాయని ప్రకటించగలిగాడు.
దియల్లో పదే పదే మాట మారుస్తున్నందున ఆమె తరపున నిలబడి కేసు నిర్మించడం కష్టంగా మారిందని ప్రాసిక్యూటర్లు ప్రకటించిన మరుక్షణం నుండే స్ట్రాస్ కాన్ తిరిగి రాజకీయాల్లోకి అడుగు పెట్టే అవకాశాలపైన వార్తా సంస్ధలు ఊహాగానాలు మొదలు పెట్టాయి. కానీ ఇంటర్వ్యూలో రాజకియాల్లోకి వస్తున్న సంగతిని కాన్ ఏమీ చెప్పలేదు. అయితే ఆ ప్రయత్నాలు తిరిగి మొదలైనా ఆశ్చర్యం అవసరం లేదు. స్ట్రాస్ కాన్ దియల్లో అంగీకారంతోనే వికారానికి పాల్పడినా ఆయన హోదా రీత్యా, ప్రపంచ సంస్ధ నాయకుడిగా ఆయనకు ఉండవలసిన లక్షణాల రీత్యా, వయసు రీత్యా ఆయన నేరం స్ధాయి పెరిగిందే కాని తరగలేదు. నైతిక నేరాలకూ, బౌతిక నేరాలకూ మధ్య సరిహద్దులు గీసిన సమాజంలో స్ట్రాస్ కాన్ బతికి బట్టకట్టాడు.
అయితే దియల్లో లాయర్లు స్ట్రాస్ కాన్ ఒప్పుకోలును కొట్టిపడేశారు. ఆయన అంగీరించినవి నిజాలే అయినా, అంగీకరించని నిజాలు కూడా ఉన్నాయని తెలిపారు. చెప్పిన విషయాలు అటుంచి ఆయన చెప్పడానికి నిరాకరించినవే అసలు విషయాలని వారు ఎత్తి చూపారు. గదిలో వాస్తవానికి ఏంజరిగందన్న ప్రశ్నకు కాన్ అది నైతిక పతనంగా పేర్కొన్నప్పటికీ వాస్తవంగా ఏంజరిగిందన విషయాన్ని తెలపడానికి నిరాకరించాడు. ఇలా చెప్పడానికి నిరాకరించిన దానిలోనే స్ట్రాస్ కాన్ నేరం దాగి ఉందని దియల్లో లాయర్లు తెలిపారు. “ఆయన ఏం చెప్పలేదో అదే ఆసక్తికరమైన విషయం” అని దియల్లో లాయర్ డగ్లస్ విగ్డర్ పేర్కొన్నాడు. “వాస్తవంగా ఏం జరిగిందన్న విషయంపై ఆయన ఏమీ చెప్పలేదు” అని ఆయన అన్నాడు. తన క్లైంటు తరపున సివిల్ కేసు వేస్తామని లాయర్ స్పష్టం చేశాడు.
స్ట్రాస్ కాన్ పై ఆరోపణలు చేసిన ఫ్రెంచి విలేఖరి ట్రిస్టేన్ బెనాన్ విషయంలో కూడా స్ట్రాస్ కాన్ అసలేమీ జరగలేదని చెప్పలేకపోయాడు. “ఓక సాక్షిగా నన్ను ఇంటర్వ్యూ చేశారు. దాడి గానీ ఒత్తిడిగాని లేదనే నేను చెప్పదలుచుకున్నాను. అంతకంటే నేనేమీ చెప్పను” అని స్ట్రాస్ కాన్ తెలిపాడు. ఇరువురు మహిళలతో ఎన్‌కౌంటర్ నిజమే అయినా వారు ఆరోపించినట్లు జరగలేదంటున్న కాన్ తన అధ్యక్ష అభ్యర్తిత్వం అవకాశాలు లేనట్లేనని అంగీకరించాడు. అయితే అంతటితో తన రాజకీయ జీవితం ముగిసినట్లే అనడాన్ని ఆయన తిరస్కరించాడు. భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశాడు.

పెట్టుబడిదారీ దేశాలలో సులభంగా దొరికే బ్లూ ఫిలిం సిడిలు, బూతు బొమ్మల పత్రికల ప్రభావానికి చివరికి ఉన్నత పదవులలో ఉన్నవాళ్ళు కూడా చెడిపోయి కోర్టులకెళ్ళే స్థితిలో ఉన్నారు.
ప్రవీణ్, ఈ విషయం చాలా తక్కువ మంది గుర్తిస్తున్న విషయం. బూతు సాహిత్యం, బూతు మీడియా అన్ని వర్గాల వారిని విచక్షణా రహితులుగా మార్చివేస్తోంది. వావి వరుసలు మరిచేలా చేస్తోంది. ఒకప్పుడు మహాపాపంలా భావించిన సంబంధాలు ఇప్పుడు చాలా తేలికగా చేస్తున్నారు. కూతుళ్లపైనా, చిన్న పిల్లలపైనా ఇలా వయసు, వరుసా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అమెరికాలో విచ్చలవిడి సంబంధాలు పెరిగిపోవడం వెనకా, వైవాహిక వ్యవస్ధ ఛిద్రం అవడం వెనకా ఈ బూతు పాత్రం తక్కువ కాదు.
ఇండియా, పాకిస్తాన్ లాంటి సెమి-ఫ్యూడల్ దేశాల కంటే అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశాలలో రేప్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయని ఒక వెబ్‌సైట్‌లో చదివాను. డబ్బు కోసం ఏమైనా చేసే సామ్రాజ్యవాద సంస్కృతి రేప్‌లని పెంచి పోషిస్తుంది.