రూపాయి విలువ అడ్డం పెట్టుకుని మోస పూరితంగా పెట్రోల్ రేట్లు పెంచిన ప్రభుత్వం


కేంద్ర ప్రభుత్వం శనివారం పెట్రోల్ ధరలను లీటరుకు మూడు రూపాయలకు పైగా పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే తగ్గిపోయినందున కంపెనీలు దిగుమతులకు ఎక్కువ చెల్లించవలసి వస్తున్నదనీ దానివలన నష్టాలు పెరిగాయనీ కారణం చూపి ప్రభుత్వం పెట్రోలు ధరలు పెంచింది. కాని వాస్తవానికి రూపాయి విలువ తగ్గుదల తాత్కాలిక పరిణామమేననీ కొద్దిరోజుల్లోనే రుపాయి పూర్వ విలువను పొందుతుందనీ ప్రభుత్వ అధికారులే నాలుగురోజుల క్రితం ప్రకటిన సంగతి గమనిస్తే, ప్రభుత్వం ప్రజలను మోసం చేసి, అబద్ధాలు చెప్పి పెట్రోలు ధరల్ని పెంచిన విషయం అర్ధం కాగలదు. రూపాయి విలువ తగ్గడం తాత్కాలికం అయినందునే ఆర్.బి.ఐ కూడా రూపాయి విలువ పడిపోకుండా ఉండడానికి జోక్యం చేసుకోకుండా మిన్నకుండడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి ఆర్.గోపాలన్ రూపాయి విలువ క్షీణత కేవలం కొద్ది కాలం వరకూ ఉండే పరిణామమే అయినందున ఆర్.బి.ఐ జోక్యం అవసరం లేకపోయిందని గత బుధవారం, సెప్టెంబరు 14 తేదీన తెలిపాడు. రూపాయి మారకం విలువ ఫలావా వద్ద మాత్రమే ఉండే విధంగా చూడడం తన విధానం కాదని ఆర్.బి.ఐ ఎప్పుడూ చెబుతుంటూంది. రూపాయికి పూర్తి కన్వర్టిబులిటీ కల్పించాలని అమెరికా, యూరప్‌లు ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకుల ద్వారా డిమాండ్ చేస్తున్న నేపధ్యంలోనే ఆర్.బి.ఐ జోక్యం చేసుకోకూడదన్న విధానం పెట్టుకుంది తప్ప ఆ విధానం గొప్ప విధానమని కాదు. నిజానికి రూపాయిని మార్కేట్ తోడేళ్లకు వదలడం భారత దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైనది. భారత ప్రజలకు కూడా అది నష్టకరమే. ఎలా నష్టకరమన్నది తాజా పెట్రోలు ధరల పెంపు ద్వారా నిరూపితమయ్యింది కూడా. రూపాయి విలువ క్షీణతతో పెట్రోలు దిగుమతి ఖరీదు పెరిగిందని చెప్పి ప్రజలనుండి వసూలు చేస్తున్నారు తప్ప కంపెనీలుగానీ, ప్రభుత్వం గానీ భరించడం లేదు.

గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గిపోతున్నది. సాధారణంగా డాలరుకు 45 రూపాయల చొప్పున రూపాయి విలువ ఉండగా సోమవారం నాటికి అది 6.0 శాతం తగ్గి డాలరుకు 47.77 రూ.ల వద్ద ఉన్నది. ఇది ఇంకా డాలరుకు 48 రూపాయల వరకూ తగ్గి తిరిగి కోలుకుంటుందని ప్రభుత్వాధికారులతో పాటు మార్కేట్ విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు. ఎఫ్.ఐ.ఐ లు భారత షేర్ మార్కెట్లనుండి ఉపసంహరించుకుని డాలర్, బంగారంలలో పెట్టుబడి పెడుతున్నందున రూపాయి విలువ తగ్గిపోతున్నది. ఎఫ్.ఐ.ఐ ల రాక పోక లు సర్వ సాధారణమేనని అందరికీ తెలిసిన విషయం. అటువంటి ఎఫ్.ఐ.ఐ ల రాకపోకలమీదా, మరి కొన్ని తాత్కాలిక అంతర్జాతీయ పరిణామల పైనా ఆధారపడి రూపాయి క్షిణించడాన్ని కారణంగా చూపి పెట్రోలు ధర పెంచడం పూర్తిగా మోసపూరితమైన చర్య. కంపెనీలకు, పెట్టుబడిదారులకూ, విదేశీ ప్రవేటు కంపెనీలకు లాభం చేకూర్చడమే తప్ప దీనిలో ఇంకేమీ లేదు.

యూరప్ రుణ సంక్షోభం బ్యాంకింగ్ సంక్షోభానికి దారితీస్తుందని ప్రపంచ మార్కేట్లలో ఆందోళన కలిగి యూరో నుండి డాలర్ కు పెట్టుబడులు వెళ్ళడంతో ఆ ప్రభావం రూపాయిపైన కూడాపడింది. “ఇది చాలా తక్కువ కాల పరిమితికి సంబంధించిన పరిణామం. ఇటువంటి స్వల్పకాలిక ఎగుడుదిగుడులకు మన విధానాన్ని సవరించవలసిన అవసరం లేదు” అని గోపాలన్ పత్రికా విలేఖరులకు గత బుధవారం తెలిపినట్లుగా సి.ఎన్.బి.సి మనీ కంట్రోల్ వెబ్ మేగజైన్ తెలిపింది. “ఆసియా, ఇండియాలనుండి డాలర్లను ఉపసంహరించుకుని ఇతర చోట్ల మదుపు చేయడం వలన రూపాయి ప్రధానంగా క్షీణించింది. ఇది వచ్చేవారం మరింత క్షీణించి ఆ తర్వాత కోలుకుంటుంది” అని సింగ్‌పూర్ లోని వెస్ట్ పాక్ ఇనిస్టిట్యూషనల్ బ్యాంక్ సీనియర్ వ్యూహకర్త జొనాధన్ కేవెనాగ్ చెప్పినట్లుగా అదే వెబ్ సైట్ పేర్కొన్నది.

ఇక పెట్రోలియం ధరలను పరికిస్తే ఆగష్టు ధరలతో పోలిస్తే ఇప్పటి పెట్రోలు ధర తగ్గిందే తప్ప పెరగలేదు. ఆగష్టు ప్రారంభంలో బ్యారెల్ కు  116 డాలర్లున్న క్రూడాయిల్, ప్రస్తుతం ఫ్యూచర్స్ ధర బ్యారెల్ కు 112 డాలర్లు పలుకుతోందని మనీ కంట్రోల్ తెలిపింది. యూరో జోన్, అమెరికాల రుణ సంక్షోభం వలన అక్కడ క్రూడాయిల్ కు డిమాండ్ తగ్గిపోతుందన్న అంచనాతో ఫ్యూచర్స్ ఆయిల్ రేటు పడిపోతున్నది. ఏదో వంక చూపి పెట్రోల్ ధరలను పెంచడంలో భారత ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ధరలు తగ్గినపుడు ఆ తగ్గుదలను ప్రజలకు అందించడంలో లేదు.

2 thoughts on “రూపాయి విలువ అడ్డం పెట్టుకుని మోస పూరితంగా పెట్రోల్ రేట్లు పెంచిన ప్రభుత్వం

  1. డాలర్ విలువ 50 దాకా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు పెట్రోల్ rs.48 ఉంది. అది డాలర్ 45 కు తగ్గాక, పెట్రోల్ ధర తగ్గించారా?? లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందని పెంచుతారు.. అది తగ్గినప్పుడు తగ్గించరు. ఎప్పుడూ పెంచడమే కాని, తగ్గించడం ఉండదా?? ప్రపంచం మొత్తం మీద ఇంత దారుణంగా పెట్రోల్ ధరలు ఇలాంటి తొక్కలో కారణాల వల్ల పెంచే ఏకైక దేశాం దరిద్ర నాయకుల పాల్బడిన మన దేశం మాత్రమే అనుకుంటా… సిగ్గులేని ప్రణబ్ ముఖర్జీ 2008 లో క్రూడ్ ఆయిల్ ధర $70 ఉంది, ఇప్పుడు $130 అని అంటున్నాడు. ఆ మధ్యన $150 వెళ్ళిందని ఏకంగా Rs.8(or Rs.10) పెంచారు… అది మర్చిపోయారా??

    ఎందుకిలాగా?? ఎవరూ అడిగే వారు లేరా??

వ్యాఖ్యానించండి