
శుక్రవారం జరిపిన ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరొక సారి వడ్డీ రేట్లను పెంచింది. యధావిధిగా ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు పెంచక తప్పడం లేదనీ, ద్రవ్యోల్బణం కట్టడి చేయడమే తమ ప్రధమ కర్తవ్యమనీ ఆర్.బి.ఐ గవర్నర్ మరొకసారి ప్రతిజ్ఞ చేశాడు. వడ్డీ రేట్ల పెంపుదల జిడిపి పెరుగుదల రేటుకు ప్రతికూలంగా పరిణమించడంతో ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్.బి.ఐ గవర్నర్ వడ్డీ రేట్లు పెంచడం కాకుండా ఇతర మార్గాలను అనుసరించాలని ప్రధాని ఆర్ధిక సలహా మండలి అధిపతి కౌశిక్ బసు శనివారం అభిప్రాయపడ్డాడు. పన్నెండు సార్లు వడ్డీ రేట్లు పెంచినా ఇంకా ద్రవ్యోల్బణం అదుపులోకి రాలేదంటే ఇక వడ్డీ రేట్ల పెంపుదలపైన ద్రవ్యోల్బణం ఆధారపడి లేదన్న విషయం గ్రహించవలసి ఉందని సూచించాడు. ఆర్.బి.ఐ ఔట్ ఆఫ్ ది బాక్స్ దృక్పధంతో ఆలోచించాలని కౌశిక్ బసు సూచించాడు.
కౌశిక్ బసు ప్రకటనను బట్టి ప్రభుత్వ విధాన రూపకర్తలలొ ద్రవ్యోల్బణం అదుపు ఎలా చేయాల్సిందన్నదీ ఏకాభిప్రాయం లేదన్న సంగతి అర్ధం అవుతోంది. ఇంతకాలం ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ద్రవ్యోల్బణం అదుపుకి వడ్డీ రేట్లు పెంచక తప్పదని చెబుతూ వచ్చిన దృక్పదం నిజానికి గన్ షాట్ లాంటి చర్య కాదని అది కూడా చీకట్లో రాయిలాంటిదేననీ కౌశిక్ బసు సూచన ద్వారా అర్ధమవుతోంది. అంటే కేవలం చీకట్లో రాయి విసరడంతో సమానమైన చర్యపైన ఆధారపడి వడ్డీ రేట్లు పెంచడం ప్రజలకు రుణాలు ఖరీదు చేయడానికి సైతం ఆర్.బి.ఐ వెనకాడలేదని అర్ధం అవుతోంది. వడ్డీ రేట్ల పెంపుద్వారా ద్రవ్యోల్బణం తగ్గేపనైతే అది ఇప్పటికే తగ్గిందనీ ఇక అదేపనిగా వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతే వడ్డీ రేట్లు పెరిగి రుణాల ఖరీదు అధికమై పెట్టుబడులు తగ్గి ఆర్ధిక వ్యవస్ద వృద్ధి నెమ్మదిస్తునదనీ కౌశిక్ బసు వ్యాఖ్యానించాడు.
ఒకవైపు ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నదని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు గుర్తుకొచ్చినప్పుడల్లా పేట్రోల్, డీజిల్, వంట గ్యాసు రేట్లను పెంచుతూ పోతోంది. ద్రవ్యోల్బణం పెరుగుదలపై ఆందోళన ఉన్నట్లయితే ప్రభుత్వం కంపెనీలకు నష్టాల పేరుతో పెట్రోల్ తదితర ఇంధనం రేట్లు పెంచి తద్వారా ద్రవ్యోల్బణం మరింత పెరగడానికి దోహదపడి ఉండేది కాదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినట్లయితే రవాణా ఛార్జీలు పెరిగి సరుకుల ధరలు అన్ని పెరగడం దానితో ద్రవ్యోల్బణం కూడా కట్టుతప్పడం అనివార్యంగా ఏర్పాడే పరిణామం. పెట్రోల్ ధరలు డీకంట్రోల్ చేసిన ఫలితంగా అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా అవి తీవ్ర మార్పులకు గురవుతున్నాయి. పెరిగినప్పుడు ధరలు పెంచే ప్రభుత్వం, ధరలు తగ్గినపుడు ఆ తగ్గుదలను ప్రజలకు అందించండానికి సిద్ధపడడం లేదు.
ఆర్.బి.ఐ వడ్డీ రేట్లను పెంచడంతో అది బ్యాంకులపై ప్రభావం చూపింది. భారతదేశ బ్యాంకుల్లో అతి పెద్దదైన ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’తో పాటు అతి పెద్ద ప్రవేటు బ్యంకు ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు షేర్లు కూడా సోమవారం పడిపోయాయి. బి.ఎస్.ఇ, ఎన్.ఎస్.ఇ సూచిలు రెండు దాదాపు ఒక శాతం పడిపోగా ఎస్.బి.ఐ షేరు 1.7 శాతం, ఐ.సి.ఐ.సి.ఐ షేరు 2.4 శాతం పడిపోయాయి. తనఖా అప్పులు మంజూరు చేసే హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు షేరు కూడా ఒక శాతం పైన పడిపోయింది. గతవారం లాభాలను ఆర్జించిన సెన్సెక్స్ పదిహేడు వేల మార్కుకు దగ్గరగా వచ్చినప్పటికీ సోమవారం దెబ్బతో మళ్ళి వెనక్కి వెళ్ళినట్లయింది.
ఆర్.బి.ఐ వడ్డీ రేట్ల పెంపుదలతో పాటు అమెరికా, యూరప్ ల ఆర్ధిక వృద్ధికి సంబంధించిన భయాలు తీవ్ర స్ధాయిలో కొనసాగుతూనె ఉండడంతో ఆ ప్రభావం కూడా షేర్ మార్కెట్లపైన కొనసాగుతోంది. యూరప్ రుణ సంక్షోభంపై గత వారం జరిగిన ఇ.యు సమావేశాలు పెద్దగా చర్యలేవీ ప్రకటించకుండానే ముగిశాయి. అమెరికా ట్రెజరీ సెక్రటరీ గీధనర్ ఈ సమావేశాలకు హాజరైనప్పటికీ ఫలితం చూపలేదు. మరింతగా ఫిస్కల్ ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఇ.యు లోని ప్రధాన దేశాలను అమెరికా గట్టిగా కోరుతోంది. ఈ సూచనను జర్మనీ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఫ్రాన్సు కూడా రుణ సంక్షోభానికి గురికానున్న ఛాయలు కనిపిస్తుండడంతో మదుపుదారులు తమ పెట్టుబడులను ఆదాయం ఎక్కువ వచ్చే చోటు కంటే భద్రంగా ఉండే చోట మదుపు చెయ్యడానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు. బంగారం కాని, అమెరికా ట్రెజరీ బాండ్లలో గాని మదుపు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
