కాలుష్య ఫ్యాక్టరీపై చైనా గ్రామీణుల పోరాటం


తూర్పు చైనాలో వందలమంది గ్రామీణులు సోలర్ ప్యానెల్ ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లుతుండడంతో ఫ్యాక్టరీని అక్కడినుండి తరలించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. ఝెజియాంగ్ రాష్ట్రంలోని హైనింగ్ పట్టణంలో ఉన్న ఝెజియాంగ్ జింకో సోలార్ కంపెనీ ఎదుట ఐదొందల వరకూ గ్రామీణులు గురువారం గుమిగూడి ఆందోళన ప్రారంబించారు. ఆందోళనకారుల్లో కొందరు ఫ్యాక్టరీలోకి దూసుకెళ్ళి అక్కడ నిలిపి ఉన్న కంపెనీ కార్లను మూకుమ్ముడి బలంతో తిరగవేయడం, కార్యాలయంలో వస్తువులను ధ్వంసం చేయడం ప్రారంభించారని అధికారులు తెలిపారు.

కంపెనీకి సమీపంలో ఉన్న హాంగ్-గ్జియావో గ్రామ ప్రజలు కంపెనీ వెలువరిస్తునన్ కాలుష్యం వలన సమీపంలో ఉన్న నదిలో చేపలన్నీ చనిపోయాయనీ అప్పటినుండీ ఫ్యాక్టరీ కాలుష్యం పట్ల తమకు భయాలు ప్రారంభమయ్యాయనీ తెలిపారు. ఫ్యాక్టరీ పాఠశాలకూ కిండర్ గార్టెన్ పాఠశాలకూ దగ్గలోనే ఉందనీ, నదిలోకి వ్యర్ధాలను వదులుతున్నదనీ, దానికి ఉన్న డజన్ల కొద్దీ చిమ్నీల నుండి నిరంతరం దట్టమైన పొగ వెలువడుతున్నదనీ గ్రామీణులు ఆసోసియేటెడ్ ప్రెస్‌కి తెలిపారు. గ్రామ ప్రజలు ఈ ఫ్యాక్టరీని మరొక చొటికి తరలించాలని గట్టిగా కోరుతున్నారు. పిల్లలు, యువకుల ఆరోగ్యం చెడిపోతున్నదని గ్రామస్దులు ఆందోళన వ్యక్తం చేశారు.

శుక్రవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. అక్కడికి వచ్చిన పోలీసు వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేసారు. దానితో పరిస్ధితిని అదుపు చేయడానికి డజ్లకొద్దీ పోలీసులను ప్రభుత్వం అక్కడికి తరలించింది. ఫ్యాక్టరీ వ్యర్ధాలను వెలువరించే వ్యవస్ధ గత ఏప్రిల్ నుండీ కాలుష్య పరీక్షల్లో విఫలం అవుతున్నదని హైనింగ్ పట్టణ పర్యావరణ పరిరక్షణ బ్యూరో అధిపతి తెలిపాడని జిన్ హువా వార్తా సంస్ధ తెలిపింది. అప్పటినుండీ సంస్ధ కంపెనీని హెచ్చరిస్తున్నప్పటికీ దాని పనితీరులో మార్పు రాలేదని బ్యూరో అధిపతి తెలిపాడు. కంపెనీ న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజిలో లిస్టయిన జింకో సోలార్ హోల్డింగ్ కంపెనీకి అనుబంధ కంపెనీ కావడం గమనార్హం. రెండు కంపెనీలు పరిణామాలపైనా ఆరోపణలపైనా వ్యాఖ్యానించడానికి నిరాకరించారని బిబిసి తెలిపింది.

ఇదిలా ఉండగా షాంఘై ప్రభుత్వం రెండు ఫ్యాక్టరీలను తాత్కాలికంగా మూసివేయాల్సిందిగా శుక్రవారం ఆదేశాలిచ్చింది. సీసం కి సంబంధించిన కాలుష్యం వెలువడుతుండడంతో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. కాంగ్ క్వియావో ఏరియాలో నివసిస్తున్న కొద్దిమంది పిల్లల రక్తంలో సీసం పాళ్ళు అదనంగా ఉన్నట్లుగా ఈ నెలారంభంలో జరిగిన పరీక్షల్లో తేలిందని తెలుస్తోంది. బ్యాటరీలు తయారు చేసే ప్లాంటు “షాంఘై జాన్సన్ కంట్రోల్స్ ఇంటర్నేషనల్ బ్యాటరీ కంపెనీ” ఈ ఆదేశాలతో మూసివేతకు గురయ్యింది. ఈ కంపెనీ కూడా న్యూయార్క్ ఎక్ఛేంజిలో లిస్టయిన అతి పెద్ద కంపెనీ జాన్సన్ కంట్రోల్స్ కంపెనికి చెందిన యూనిట్ కావడం గమనార్హం.

చైనాలోని తన కంపెనీవద్ద ఉత్పత్తిని నిలిపి వేశామనీ, అధికారులకు సహకరిస్తున్నామని జాన్సన్ కంట్రోల్ కంపెనీ  ప్రతినిధి తెలిపాడు. కాని సమస్యకు తమ ఫ్యాక్టరీ కారణం కాదని నమ్ముతున్నట్లు ఆ ప్రతినిధి తెలిపాడు. వృత్తిగత ఆరోగ్యం, భద్రతలకు సంబంధించి తమ బ్యాటరీ ప్లాంటు 2006లో జాతీయ నమూనా సంస్ధగా అవార్డు పొందిందనీ, చైనా జాతీయ ప్రమాణాల కంటె ఏడోవంతు సీసం మాత్రమే వెలువరిస్తుందనీ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

అమెరికలో పర్యావరణ చట్టాలు కఠినంగా ఉంటాయి. అదీ కాక అమెరికా చట్టాల ప్రకారం కార్మికులకు అధిక వేతనాలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఖర్చుని తప్పించుకోవడానికే అమెరికా కంపెనీలు పెద్ద ఎత్తున చైనాకు తరలివెళ్ళాయి. చైనాలో లభ్యమవుతున్న చౌక శ్రమను కొల్లగొడుతూ లాభాలు సంపాదిస్తున్నాయి. పర్యావరణ చట్టాలు, కార్మిక చట్టాలు బలహీనంగా ఉండడంతో కంపెనీలలో కార్మికులకు వసతులు అత్యంత దుర్భరంగా ఉంటాయి. ఈ సత్యాన్ని పై రెండు ఉదాహరణలూ మరొకసారి రుజువుపరిచాయి.

పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి సౌర విద్యుత్‌ను వినియోగించాలని ప్రచారం జరుగుతున్న సంగతి విదితమే. కాని సౌర విద్యుత్ తయారీకి వినియోగించే సోలార్ ప్యానెళ్లను తయారు చేసే ఫ్యాక్టరీలు మాత్రం పర్యావరణ కాలుష్యానికి దోహదపడతాయని ఈ వార్తతో స్పష్టమవుతున్నది. పిల్లల శరీరంలో సీసం పాళ్ళు అధికంగా ఉండడానికి తమ కంపెనీ కారణం కాదని చెపుతున్న జాన్సన్ కంట్రోల్ కంపెనీ దానికి తమ కంపెనీ 2006లో సంపాదించిన సర్టిఫికెట్ ను రుజువుగా చూపడం విచిత్రం. ఇటువంటి సర్టిఫికెట్లు వార్ధిక ప్రాతిపదికన జారీ చేస్తారు.

తాము కాలుష్యం వెదజల్లడం లేదని ఐదు సంవత్సరాల క్రితం పొందిన సర్టిఫికెట్ ను ఇప్పటికీ చూపుతున్నదంటే ఆ కంపెనీ ఎంత కాలుష్య రహితమో అర్ధమవుతూనె ఉంది. ఒక కంపెనీ గత ఏప్రిల్ నుండీ కాలుష్య పరీక్షలను ఫెయిలవుతూ వస్తే, మరొక కంపెనీ ఐదు సంవత్సరాల క్రితం సర్టిఫికెట్ ను చూపుతున్నది. విదేశీ కంపెనీల అరాచకాలను అరికట్టడంలో చైనా అధికారులు ఎంత ఖచ్చితంగా ఉంటున్నారొ కూడా ఈ ఘటనలు తెలియజేస్తున్నాయి.

వ్యాఖ్యానించండి