దక్షిణ చైనా సముద్రంలో ఇండియా ప్రాజెక్టు రాజకీయంగా రెచ్చగొట్టడమే -చైనా


చైనా ప్రభుత్వ ప్రతినిధి నుండి ఇండియాకు హెచ్చరిక అందిన మరుసటి రోజే మరొకసారి పరోక్షంగా హెచ్చరిక జారీ అయింది. ఈ సారి చైనా ప్రభుత్వం నడిపే “గ్లోబల్ టైమ్స్” పత్రిక, దక్షిణ చైనా సముద్రంలో ఇండియా కంపెనీలు ప్రాజెక్టులు చేపట్టడం అంటే చైనాను రాజకీయంగా రెచ్చగొట్టడమేనని పేర్కొన్నది.

భారత కంపెనీ ఒ.ఎన్.జి.సి, దక్షిణ చైనా సముద్రంలో చమురు, సహజవాయువుల అన్వేషణ ప్రాజెక్టును చేపట్టకుండా సాధ్యమైన “అన్ని సాధనాలనూ’ వినియోగించాలని చైనా ప్రభుత్వాన్ని గ్లోబల్ టైమ్స్ పత్రిక కోరింది. వియత్నాంతో ఆ మేరకు ఎటువంటి ఒప్పందం కుదుర్చుకున్నా అది “రాజకీయగా తీవ్రస్ధాయిలో రెచ్చగొట్టడమే కాగలదని” హెచ్చరిస్తూ అటువంటి చర్య “చైనాను పరిమితి వరకూ నెడుతుంద”నీ గ్లోబల్ టైమ్స్ తెలిపింది.

గ్లోబల్ టైమ్స్ పత్రిక ఇంకా ఇలా పేర్కొన్నది, “ఒ.ఎన్.జి.సి ఇటువంటి చర్యకు పాల్పడకుండా చైనా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి. కారణాలను వివరిస్తూ నచ్చజెప్పడానికి మొదట ప్రయత్నించవచ్చు. కాని ఇండియా తన ప్రయత్నాలను కొనసాగించినట్లయితే దానిని ఆపడానికి చైనా సాధ్యమైన అన్ని సాధనాలనూ వినియోగించాలి” అని గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో హెచ్చరించింది.

చైనా అధికారులు దక్షిణ చైనా సముద్రంలోని ఇండియా ప్రాజెక్టులతో తగాదా లేదని శుక్రవారం కొట్టిపారేసినప్పటికీ, కమ్యూనిస్టు పార్టీ పత్రిక అయిన గ్లోబల్ టైమ్స్ పత్రిక భారత ప్రభుత్వం చైనా ఇచ్చను పరీక్షిస్తున్నదని ఆరోపించింది. చైనా శాంతియుతంగా పైకి ఎదగాలని భావిస్తున్నప్పటికీ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇతర సాధనాలను ఉపయోగించే హక్కును వదులుకోదని తెలిపింది.

వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఇండియా ఎటువంటి ప్రాజెక్టు చేపట్టడానికయినా చైనా వ్యతిరేకిస్తుందని గురువారం చైనా ప్రభుత్వ ప్రతినిధి చెప్పాడు. అయితే నేరుగా ఇండియా పేరును ప్రతినిధి చెప్పలేదు. శుక్రవారం మాత్రమ్ చైనా అధికారులు దానిపై ఏమీ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

వియత్నాం, ఒ.ఎన్.జి.సి కంపెనీ మధ్య జరగనున్న ఒప్పందం పెరుగుతున్న ఇండియా లక్ష్యాలను తెలియజేస్తున్నదనీ, హిందూ మహా సముద్రంలో చైనా ప్రవర్తనకు  కౌంటర్ గానే దక్షిణ చైనా సముద్రంలో ఇండియా కదలికలను చూడవచ్చని పత్రిక పేర్కొన్నది. “దలైలామా సమస్యలో ఇండియా జోక్యం పట్ల చైనా సమాజం ఇప్పటికే అసంతృప్తితో ఉన్నది. దక్షిణ చైనా సముద్రంలో ఇండియా చర్యలు చైనాను పరిమితి వరకూ నెడుతున్నాయని గుర్తించాలి” అని గ్లోబల్ టైమ్స్ పేర్కొన్నది.

“చైనా భారత్ స్నేహాన్ని చైనా గౌరవిస్తుంది. కానీ దానర్ధం ఇతర అంశాలన్నింటికంటే దానినే ఉన్నతంగా చూస్తున్నట్లుగా దానర్ధం కాదు” అని గ్లోబల్ టైమ్స్ పేర్కొన్నది. కమ్యూనిస్టు పార్టీ ప్రచార విభాగం అనుమతి లేకుండా గ్లోబల్ టైమ్స్ ఇటువంటి ఎడిటోరియల్ రాయదని ది హిందూ పత్రిక తెలిపింది. అయితే పత్రిక, పార్టీలోని అతివాద భావాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా కనపడుతుందని ఆ పత్రిక తెలిపింది. కమ్యూనిస్టు పార్టీలోని జాతీయ వాద సెంటిమెంట్లను ఈ ఎడిటోరియల్ ప్రతిబింబిస్తున్నదనీ ది హిందూ తెలిపింది.

“చైనా కేవలం ఆర్ధిక వృద్ధిలోనే ఆసక్తి కలిగున్నదన్న అభిప్రాయం ప్రపంచానికి కలిగేలా చైనా వ్యవహరించకూడదు. శాంతియుత శక్తిగా పేరు సంపాదించడం వరకే చైనా పరిమితం కాకూడదు. దానివలన చైనా మూల్యం చెల్లించవలసి ఉంటుంది” అని ఎడిటోరియల్ పేర్కొన్నది.

“గ్లోబల్ టైమ్స్” పత్రిక గతంలోనూ ఇలాగే ఇండియాను విమర్శించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు మాత్రం ఈ పత్రిక ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించదని తరచుగా చెబుతూ ఉంటారు. ప్రవేటుగా పత్రికను అతివాద లైన్ తీసుకున్నందుకు విమర్శించడం కూడా కద్దు. తాజా వివాదం ఇరు పక్షాల సంబంధాలను ఎంతవరకూ ప్రభావితం చేస్తుందన్నది చూడవలసి ఉన్నది. గ్లోబల్ టైమ్స్ పత్రిక అభిప్రాయాలతో సంబంధం లేదని చైనా ప్రభుత్వం చెప్పినా, దాని దూకుడు స్వభావం తనకు అవసరమని చైనా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

వ్యాఖ్యానించండి