దక్షిణ చైనా సముద్రంలో ఇండియా చైనాల ఢీ


దక్షిణ చైనా సముద్రంలో భారత్ చైనాల మధ్య వైరం రగులుకుంటోంది. వియత్నాం దేశం ఆహ్వానం మేరకు దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్ వెలికి తీతకు ఒ.ఎన్.జి.సి ప్రయత్నాలు చేయడాని వ్యతిరేకంగా చైనా ప్రభుత్వం ఇండియాను హెచ్చరించింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో ఆయిల్, సహజ వాయువుల వెతుకులాటకు ఇండియా కంపెనీలు దిగడాన్ని తాము వ్యతిరేకిస్తామని చైనా గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. భారత విదేశాంగ మంత్రి వియత్నాం సందర్శించనున్న నేపధ్యంలో దక్షిణ చైనా సముద్రంలో వియత్నాంతో ఆయిల్ వెలికితీత ఒప్పందాలను కుదుర్చుకోరాదని కోరింది.

“చైనా పరిధిలో గల జలాల్లో ఏ దేశమైనా ఆయిల్, సహజ వాయువుల అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాలు జరపడాన్ని మేము మొదటినుందీ స్ధిరంగా వ్యతిరేకిస్తున్నాము” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జియాంగ్ యు అన్నది. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం తమదిగా చెబుతున్న రెండు ఆయిల్ బ్లాకుల్లో భారత కంపెనీ ఒ.ఎన్.జి.సి విదేశ్ కంపెనీ చమురు సహజవాయువు అన్వేషణ ప్రాజెక్టులను చేపట్టనున్నదని వస్తున్న వార్తలపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా జియాంగ్ ఈ సమధానం ఇచ్చింది. చమురు సహజవాయువు ప్రాజెక్టులలొ ఇండియా కంపెనీలు ఉన్నాయన్న సంగతి తమకు తెలియదని చెబుతూ ఆమె దక్షిణ చైనా సముద్రంపైనా, అందలి దీవులపైనా చైనాకు పూర్తి హక్కులు కలిగి ఉన్నదని తెలిపింది.

“విదేశాలు ఈ వివాదంలో తలదూర్చవని మేము భావిస్తున్నాము. ఈ ప్రాంతంలోని దేశాలు ద్వైపాక్షిక మార్గాల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న అంశాన్ని బయటి దేశాలు గౌరవిస్తాయని భావిస్తున్నాము” అని ఆమె తెలిపింది. దక్షిణ చైనా సముద్రాల పైనా అందలి దీవులపైనా చైనా వియత్నాంలు రెండూ తమవంటే తమవని వాదులాడుకుంటున్నాయి. జున్ నెలలో సముద్రంలో చైనా, వియత్నాంల పడవల మధ్య ఘర్షణలు జరిగాక ఇరు దేశాల మధ్య స్ప్రాట్లీ, పారాసెల్ దీవులపైన ఉద్రిక్తలు తలెత్తాయి.

ఈ వారంతంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ వియత్నాం రాజధాని హనోయ్ సందర్శించనున్నారు. మీడియా సమాచారం ప్రకారం, దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం తనది గా చెప్పుకుంటున్న రెండు ఆయిల్ బ్లాకులలో ఒ.ఎన్.జి.సి విదేశ్ సంస్ధ చమురు, సహజవాయువుల కోసం అన్వేషణ జరిపే ఒప్పందం జరగనున్నది. ఐక్యరాజ్య సమితి రూపొందించిన సముద్ర చట్టాల ప్రకారం ఆ రెండు బ్లాకులపైన తమకు యాజమాన్య హక్కులు ఉన్నాయని వియత్నాం ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. దానితో ఇండియా ప్రాజెక్టులపై ఒప్పందం కుదుర్చుకోవచ్చని భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో పాకిస్ధాన్ ఆక్రమిత కాశ్మీరులో చైనా చేపట్టనున్న ప్రాజెక్టులపై భారతదేశం కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ అంశంపై భారత దేశ అభ్యంతరాలను చైనా నిరాకరించింది. సదరు వివాదాన్ని పాకిస్ధాన్, భారత్ లు పరిష్కరించుకోవాలని తాము భావిస్తున్నట్లుగా తెలిపింది.

జియాంగ్ కూడా దక్షిణ చైనా సముద్రం వివాదంపై ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాలను ఉటంకించింది. సమితి సముద్ర చట్టాలు ఏ దేశానికి కూడా ఇతర దేశాలకు చెందిన ప్రాంతాలలో తమకే పరిమితమైన ఆర్ధిక ప్రాంతాలను ఏర్పాటు చేసుకునే హక్కును దఖలు పరచలేదని ఆమె తెలిపింది. చరిత్రలో ఏర్పడిన హక్కులను, స్ధిరంగా ప్రస్తావిస్తూ వస్తున్న హక్కులను నిరాకరించాలని సమితి చట్టాలు చెప్పలేదని ఆమె పేర్కొన్నది.

దక్షిణ చైనా సముద్రంలో చైనా, వియత్నాంలతో పాటు ఇతర దేశాలు కూడా తమవంటే తమగని వాదిస్తున్నాయి. ఈ వివాదాలు ఇటీవల కాలంలో వివిధ సంఘటనలతో మళ్ళి తెర ముందుకు వచ్చాయి. చైనా ఈ ప్రాంతంలో అంతకంతకూ దూకుడును ప్రదర్శిస్తున్నదని దాని పొరుగు దేశాలు వాదిస్తున్నాయి. చైనా నావికాదళం ఉద్రక్తలు రేకెత్తిస్తున్నట్లుగా ఆరోపిస్తున్నాయి. ఈ జలాల్లో వియత్నాం, ఫిలిప్పైన్స్ దేశాలు రెండింటితో చైనాకు ఉద్రిక్తలు తలెత్తాయి. వీటి వెనుక అమెరికా హస్తం ఉందని చైనా ఆరోపిస్తున్నది. ఈ ప్రాంతంలోని తమ పొరుగుదేశాలతో అమెరికా సైనిక ఒప్పందాలను పునః సమీక్షించుకుని ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నదని చైనా ఆరోపించింది.

హిందూ మహా సముద్రంలో చైనా కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఇండియా కూడా చైనాపై ఆరోపణలు చేస్తున్నది. హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలకు కౌంటర్ గానే ఇండియా దక్షిణ చైనా సముద్రంలో పాత్ర నిర్వహించడానికి ముందుకు వస్తున్నదని చైనా మిలట్రీ వర్గాలు, చైనా పార్టీలోని జాతీయ శక్తులు అంచనా వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీర్ఘ కాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ఇండియా దక్షిణ చైనాలో అడుగు పెడుతున్నదని భావించవచ్చు. ఇరు పక్షాల ప్రయోజనాలలో సమతూకం సాధించే దిశలో ఇండియా ప్రయత్నాలను చూడవచ్చు.

One thought on “దక్షిణ చైనా సముద్రంలో ఇండియా చైనాల ఢీ

  1. చైనా, భారత్‌ల ఆధిపత్య స్వభావంతో కూడిన పెత్తందారీతనం గురించి మరింత దాపరికం లేకుండా మాట్లాడుకుంటే మంచిదేమో.. జాతుల ఆకాంక్షల విషయంలో, చిన్నదేశాల హక్కుల విషయంలో చైనా, భారత్ రెండు దేశాలూ సక్రమంగా వ్యవహరించని చరిత్ర దశాబ్దాలుగా కొనసాగుతోంది. టిబెట్ వ్యవహారంలో చైనా మొదటినుంచి వ్యవహరిస్తున్న పాత్ర సహజ న్యాయానికి చాలా దూరంగా ఉందనేది నిరూపిత సత్యం.

    ఒక దళారీ వ్యవస్థ, ఒక కమ్యూనిస్టు ముసుగులోని పెట్టుబడిదారీ మార్గీయ వ్యవస్థ రెండూ కూడా ఆసియా ఖండంలో పెద్దన్న పాత్రను పోషిస్తూ తాము డాంబికంగా చెప్పుకుంటూ వస్తున్న విలువలకు కూడా దూరంగా జరిగిపోయి చాలా కాలమే అయింది. పొరుగు దేశాల విషయంలో, స్వంత ప్రజల విషయంలో ఈ రెండు దేశాలూ కూడా పెద్దన్న తత్వంతో ఆధిపత్యం ధోరణిని అవలంబిస్తున్నట్లు రుజువవుతూనే ఉంది.

    యూరప్‌తో, అమెరికాతో పోటీ పడుతున్న ఆర్థిక ధిక్కారంతో ఈ రెండు ఆసియా దేశాలూ భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల పోరుకు, ఆర్థిక ప్రయోజనాల పోరుకు తలపడక తప్పదనిపిస్తోంది. భారత, చైనాల మధ్య పోరు సైద్దాంతికంగా కాకుండా మార్కెట్ల విస్తరణ, సైనిక ప్రాధాన్యతల కోణంలోనే జరుగుతున్నదంటే విభేదించపనిలేదు.

వ్యాఖ్యానించండి