కాశ్మీరులో 2,156 గుర్తు తెలియని సమాధులు, డి.ఎన్.ఎ సేకరణకు నిర్ణయం


గుర్తు తెలియని సమాధుల్లో పాతి పెట్టిన 2,156 శవాలను గుర్తించాలని జమ్మూ కాశ్మీరు “రాష్ట్ర మానవ హక్కుల సంఘం” సిఫారసు చేసింది. మానవ హక్కుల సంఘానికి చెందిన పోలీసు విభాగం ఈ సమాధులను గత నెలలో గుర్తించడం సంచలనం కలిగించింది. కాశ్మీరులో భారత భద్రతా బలగాలు దేశ రక్షణ పేరుతోనో, తీవ్రవాదం పేరుతోనో కాశ్మీరు యువకులను అనేక వేలమందిని మాయం చేశాయని చాలా కాలం నుండి కాశ్మీరు ప్రజలు ఆరోపిస్తున్నారు. 2001 జనాభా లెక్కల సేకరణ అనంతరం ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల వివరాలు ప్రకటించినప్పటికీ కాశ్మీరు లెక్కలను ఇంతవరకూ ప్రకటించలేదు. జమ్ము & కాశ్మీరు రాష్ట్రంలో మగవారి సంఖ్య ఆడవారి సంఖ్యతో పోలిస్తే బాగా తక్కువ ఉండడంతో గణాంకాల వివరాలు ప్రకటించకుండా అపివేశారు.

దేశం మొత్తం అన్ని రాష్ట్రాలలో పురుషులతో పోల్చినపుడు స్త్రీల సంఖ్య ఆందోళనకర రీతిలొ తక్కువగా నమోదు కాగా ఒక్క జమ్ము&కాశ్మీరు రాష్ట్రంలో పరిస్ధితి అందుకు పూర్తి భిన్నంగా ఉండడంతో ప్రపంచ దృష్టి  కాశ్మీరుపై కేందీకృతం కాకుండా ఉండడానికి భారత ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నదని అప్పట్లో భారత ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంది. తమ యువకులు, మగాళ్లలో అనేక మందిని భద్రతా బలగాలు మాయం చేశాయనీ, వారిని ఏంచేశారో తెలియజేయాలనీ కాశ్మీరు ప్రజలు అనేక సార్లు కోరినప్పటికీ భారత భద్రతా బలగాలుగానీ, భారత ప్రభుత్వంగానీ ఎన్నడూ పట్టించుకోలేదు. తాజాగా రాష్ట్ర మానవ హక్కుల సంఘం పోలీసు విభాగం చేస్తున్న దర్యాప్తుతో అప్పటి నిజాలు, భద్రతా బలగాల హత్యలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మానవ హక్కుల సంస్ధకు చెందిన డివిజనల్ బెంచ్ ఒకటి దాదాపు 38 చోట్ల కనుగొనబడ్డ గుర్తు తెలియని శవాలను గుర్తించడానికి డి.ఎన్.ఎ సేకరణతో సహా అన్ని సాధనాలను ఉపయోగించాలని సూచించింది. రిటైర్డ్ జస్టిస్ సయ్యద్ బషీరుద్దీన్ ఛైర్మన్ గా గల ఈ డివిజన్ బెంచిలో జావేద్ అహ్మద్ కవూస్ సభ్యులుగా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి బెంచి ఆరు సిఫారసులు చేసింది. గతంలో రాష్ట్రంలో వ్యక్తులు మాయమైన కేసులకూ ఈ గుర్తు తెలియన్ సమాధులకూ సంబంధం ఉండవచ్చని సూచించింది. “డి.ఎన్.ఎ ప్రొఫైల్, భౌతిక వర్ణన, దంతాల పరీక్ష, వివిధ వైద్య లక్షణాలు, వేలి ముద్రలు, కార్బన్ డేటింగ్, ఫోరెన్సిక్ పాధాలజీ మున్నగు శాస్త్రీయ పద్ధతులన్నింటినీ ఉపయోగించి గుర్తు తెలియన్ సమాధుల్లోని శవాలను గుర్తించాలి” అని డివిజన్ సిఫారసు చేసింది. మాయమయిన వ్యక్తుల గుర్తింపుతో గుర్తు తెలియని శవాల గుర్తింపు సరిపోయినదీ లేనిదీ తెలుసుకోవడమే ఈ పరీక్షల లక్ష్యమని బెంచి పేర్కొన్నది.

1990ల నుండి కాశ్మీరులో కొన్ని వేల మంది కాశ్మీరీ ప్రజలు మాయమయ్యారని మానవ హక్కుల సంస్ధలు ఆరోపిస్తున్నాయి. అయితే రికార్డు చేయబడిన కేసుల సంఖ్య ఒక మాదిరిగానే ఉన్నప్పటికీ అది తక్కువ మాత్రం కాదని అవి పేర్కొన్నాయి. అదృశ్యమైన వ్యక్తుల తల్లిదండ్రుల సంఘం (ఎ.పి.డి.పి – ది అసోసియేషన్ ఆఫ్ పేరెంట్స్ ఆఫ్ డిజప్పియర్డ్ పర్సన్స్) 350 మంది పేర్లతో కూడిన జాబితాను సమర్పిస్తుండంగా, ప్రభుత్వ లెక్కలలో 1200 వరకూ మాయమయినట్లుగా నమోదయ్యింది. మాయమయిన వారిలో అత్యధికులను భారత భద్రతా బలగాలు చట్ట విరుద్ధమైన పద్ధతులలో చంపివేశాయని మానవ హక్కుల సంస్ధలు ఆరోపిస్తుండగా, నియంత్రణ రేఖను దాటి మిలిటెంట్లుగా శిక్షణ పొందడానికి వెళ్ళిన యువకులే వారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది.

కుటుంబ సభ్యుల డి.ఎన్.ఎతో మాయమయినవారి డి.ఎన్.ఎ సరిగూగినంత మాత్రానే మాయమయినవారి గురించిన చర్చ పరిష్కరించబడే అవకాశాలు తక్కువే అని చెప్పుకోవాలి. చనిపోయినవారు ఏ పరిస్ధితుల్లొ చనిపోయారో నిర్ధారించవలసి కూడా ఉంటుంది. అంటే నిజమైన ఎన్‌కౌంటర్ లోనే వారు చనిపోయారని భద్రతా దళాలు చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ మొత్తంగా చూసినపుడు ఈ సమాధులు జమ్ము&కాశ్మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారతాయని చెప్పవచ్చు. రాష్ట్ర మానవ హక్కుల సంస్ధ ఆగష్టు 20న వెలువరించిన మొదటి అధికారిక విచారణ నివేదిక ప్రకారం, బారాముల్లా, బందిపూర్ కుప్వారా జిల్లాలలో 2730 గుర్తుతెలియని సమాధులు ఉన్నాయని వెల్లడయ్యింది. వీటిలో 574 సమాధులు స్ధానికుల సమాదులుగా గుర్తించడంతో మిగిలిన 2,156 సమాధులు గుర్తు తెలియనివిగా తేలాయి.

తమ కుటుంబాలకు చెందిన వ్యక్తుల అచూకీ కనుగొనాలని కోరిన వారి సంబంధీకుల డి.ఎన్.ఎ లు సేకరించి వాటిని సమాధులలో లభ్యమయిన శవాల గుర్తింపులతో సరి పోల్చాలని నిర్ణయించారు. శవాలను గుర్తించిన తర్వాత హత్యలాంటి నేరాల విచారణ ప్రారంభమవుతుందని డివిజన్ బెంచి నిర్ణయించింది. మాయమయిన వ్యక్తులు అసహజ మరణాలకు గురయ్యారని తేలినట్లయితే సంబంధిత కుటుంబాలకు నష్టపారిహారంతో కూడిన న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.

రెండు దశాబ్ధాలకు పైగా వాస్తవాలు తొక్కిపెట్టిన భారత ప్రభుత్వం గానీ, భద్రతా బలగాలు గానీ తమ అకృత్యాలు బైటపడుతుంటే చూస్తూ ఊరుకుంటారని భావించలేము. జమ్మూ&కాశ్మీరు రాష్ట్రం ఇంకా భద్రతా దళాల ప్రత్యేక అధికారాలా చట్టం నీడలోనే బిక్కు బిక్కుమంటూ బతుకు వెళ్ళదీస్తున్న నేపధ్యంలో వాస్తవాలు బైటికి రాకుండా అన్ని చర్యలూ ప్రభుత్వాలు తీసుకుని తీరతాయి. కోర్టులు, మానవ హక్కుల సంస్ధలు తమకు అప్పజెప్పిన భాద్యతలను నిర్వహించడంలో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తే తప్ప ప్రభుత్వం, భద్రతా బలగాలు ఎర్పరిచే ఆటంకాలను అధిగమించలేరన్నది నిష్టుర సత్యం.

One thought on “కాశ్మీరులో 2,156 గుర్తు తెలియని సమాధులు, డి.ఎన్.ఎ సేకరణకు నిర్ణయం

వ్యాఖ్యానించండి