
ఇవి గాంధీజీ ఆత్మకధలోని భాగాలు కావు. గుజరాత్‌లో అన్నా హజారే ప్రారంభించిన ‘మత సామరస్యతా మిషన్’ సందేశం కాదు. ఇది భారత దేశ చరిత్రలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ స్వయంగా తన రాష్ట్రానికే చెందిన ముస్లిం ప్రజలపై సామూహిక హత్యాకాండకు రౌడీలూ, గూండాలూ తదితర లంపెన్ శక్తులను పురిగొల్పిన అత్యంత కిరాతక రాజకీయ నాయకుడు ‘నరేంద్ర మోడి’ గుజరాత్ ప్రజలకు రాసిన లేఖలోని ఒక భాగం.
కొంగ జపం నిజమేనేమోనని మనం మళ్ళీ ఒకసారి శాస్త్రబద్ధంగా అధ్యయనం చేయాల్సిన అవసరం వచ్చింది. పులి మాంసాహారి అన్న నిత్య సత్యాన్ని మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. తోడేలు, మేకతో మనం ‘కలిసి ఉందాం. సామరస్యంగా ఉందాం’ అంటే నిజమేనని ఇప్పుడు మనం నమ్మవచ్చు. ‘నేటినుండి నేను గడ్డే తింటాను’ అని లేడి కూనతో హైనా అంటే సందేహం అనవసరం. నక్క నిజాయితీగా బతుకుతానని వాగ్దానం ఇస్తే నిస్సందేహంగా అభినందలు చెప్పవచ్చు. అంతెందుకు, ఇది ‘కలి యుగం’ కాదు ధర్మం నాలుగు పాదాల నడిచే ‘సత్య యుగం’ అని ఎవరైనా అంటే కళ్ళే కాదు అన్నీ మూసుకుని నమ్మవచ్చు.
మనం అర్జెంటుగా ఉన్న ఫళంగా, నాసాను బతిమిలాడుకునైనా సరే మరో భూగ్రహాన్ని వెతుక్కోవాల్సిందే. లేదంటే మన సూర్యమండలంలోని ఇతర అష్ట గ్రహాలనూ భూగ్రహం లాగా నివాస యోగ్యం చేయాల్సిన ప్రయోగాలు అత్యవసరంగా ప్రారంభించాలి. ప్రయోగాలు సాధ్యం కాదనుకుంటే, హాలీవుడ్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్‌ని అడిగి ఆ ‘అవతార్’ గ్రహం ఎక్కడుందో అడిగి ఆ గ్రహవాసులతో సంధి అయినా చేసుకుని కాసింత చోటిమ్మని అడగాలి. లేదంటే ఈ భూమి ధర్మాత్ములతో నిండిపోయి ఇంకా చాలామందికి చోటు దొరక్కుండా పోయే పరిస్ధితి వస్తుంది.
కాదా మరి! సాక్షాత్తు నరేంద్రులంతటివారు స్వయంగా మూడు రోజులు నిరాహార దీక్ష తలపెడితే, అన్నా హజారే మరో ముప్ఫై రోజులు నిరాహార దీక్ష చేసినా సరే, అది ఏపాటి? మోడీ అంతంటివారు శాంతి సామరస్యతల గురించి బోధిస్తుంటే ఇక ఆయన భోధనలను విని అర్జెంటుగా కత్తులు, తుపాకులను పరిత్యజించి వెజిటేరియన్లుగా మారే మాఫియా డాన్‌ల నివాసనికి ఈ భూమండలం సరిపోతుందా? నరేంద్ర మోడి అంతటివారు భారత దేశ లేదా కనీసం గుజరాత్ లోని సామాజిక జీవనంలో ఐకమత్యాన్ని బలీయం కావించవలసిన బృహత్తర కర్తవ్యాన్ని నెత్తిమీద వేసుకుంటే…, ఇక యాంటీ టెరరిస్టు స్క్వాడ్ ల అవసరం ఎందుకుంటుంది? ఇక భారత దేశంలో లేదా కనీసం గుజరాత్‌లో పోలీసు ఉద్యోగాలు కోల్పోయే నిరుద్యోగులకు పునరావాసం కల్పించవలసిన బృహత్తర ‘హ్యూమన్ ట్రాజెడీ’ సంభవించనున్నదా?
ఆరోజున, నలభైమంది కరసేవకులు ఉన్మాదుల ఉన్మత్తతకు బలై కాలి బొగ్గుగా మారిన రోజున, నిజానికి దేశం అంతా విషాద సంద్రంగా మారవలసిన రోజు. మతోన్మత్త రధయాత్రల ప్రచారాలకు లోనై అమాయకుపు యువకులు కరసేవకులై, కరసేవకులుగానే మిగలకుండా తాత్కాలికంగా అరాచకానికి పాల్పడవచ్చుగాక! కాని ఆ కారణం చూపి వారిని సామూహికంగా తగలబెట్టి కాల్చడం మానవ సామాన్యులెవ్వరు హర్షించలేని దుర్మార్గం. అటువంటి బొగ్గువాడిన దేహాలకు, ఆ దేహాలను జన్మనిచ్చిన తల్లిదండ్రులకు దేశం అంతా అశ్రునయనాలతో సానుభూతి పలకకవలసిన విషాధకర క్షణాలవి.
కాని ఏం జరిగింది? హీనాతి హీనమైన రాజకీయ ప్రయోజనాల కోసం బొగ్గులై౦న కరసేవకుల దేహాలు ఆదునిక భారతం మున్నెన్నడూ ఎరగని మత మారణకాండ యజ్ఞానికి సమిధలుగా మారాయి. కరసేవకుల శరీరాల బొగ్గులను రాజేసి గుజరాత్ అంతటా మతవిద్వేషకాండను దావానలంలా కొద్ది గంటల్లోనె వ్యాపింపజేశారు. ‘చర్యకు ప్రతి చర్య ఉంటుందని గుజరాత్ ప్రజలు నిరూపిస్తున్నారని’ ప్రకటించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడి స్వయంగా ముస్లింల నరమేధాన్ని ప్రోత్సహించాడు. ‘చర్యకు ప్రతిచర్య’ అని నాటి సామూహిక నరమేధాన్ని ప్రస్తుతించిన నరేంద్ర మోడి నేడు ‘ద్వేషం ఎన్నటికీ ద్వేషాన్ని జయంచ లేద’ని అమాయకంగా ధర్మ పన్నాలు వల్లిస్తున్నాడు. నమ్మాలా?
ఆ రోజు హిందువులు సాగించే ప్రతీకార చర్యలను అడ్డుకోవద్దని చెప్పడానికి నరేంద్ర మోడి ఏర్పాటు చేసిన సమావేశానికి తానూ హాజరైనానని ఓ పోలీసాఫిసరు ఇప్పుడు ముందుకొస్తే ‘తాను వేటను మానేశానని నమ్మబలుకుతున్న ఈ నరేంద్రమోడి’, ఆయన పైన మొన్నీమధ్యనే కేసు బనాయించాడే? గుజరాత ముస్లింల హత్యాకాండ జరుగుతున్నప్పటి ఫోన్ సంభాషణలను రికార్డు చేసి, ఫోన్ నెంబర్లను పరిశోధించి కనుక్కొని సదరు టేపులనూ, ఫోన్ నెంబర్లనూ ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’ (సిట్) కు అందజేసిన మరొక పోలీసు అధికారిపై ఈ నరేంద్రమోడి ప్రభుత్వం ఆగ్రహించి కొద్ది రోజుల క్రితమే, ‘ప్రభుత్వ రహస్య సమచార పరిరక్షణా చట్టం’ కింద కేసు మోపాడే!? అవి కూడా రాష్ట్ర సమైక్యతను, సామాజిక సామరస్యాన్ని కాపాడేవేనా? అవి కూడా పులిగారి సర్వసంగ పరిత్యాగానికి చిహ్నాలేనా?
ఇంతకీ లేడి కూనగా మారిన మన పులి గారి సర్వసంగ పరిత్యాగానికి కారణాలేమిటి? సుప్రీం కోర్టు ఇచ్చిన ఒకానొక రూలింగ్ తో ఆయనా, ఆయన పార్టీవారు ఉబ్బితబ్బిబ్బులై పోతున్నారు. నరేంద్ర మోడి అమాయకత్వాన్ని సుప్రీం కోర్టు గుర్తించింది అని భాజపా అగ్ర నాయకుడు లాల్ క్రిష్ట అద్వానీ పత్రికలు, ఛానెళ్ళకు చెబుతున్నాడు. (నరేంద్ర మోడి తన ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వానికి ఎసరు తెస్తున్న సంగతిని తన ఉబ్బితబ్బిబ్బులో పడి అద్వానీ మరిచినట్లున్నారు!). నరేంద్ర మోడిపైన ముస్లింల హత్యాకాండ నేరంపై ముఖ్యంగా అప్పటి మత మారణ కాండలో ఆహుతైన కాంగ్రెస్ ఎం.పి ‘ఎహసాన్ జాఫ్రీ’ భార్య దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీం కోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. ఆ వ్యవహారం ట్రయల్ కోర్టే తేల్చాలన్నది సుప్రీం కోర్టు రూలింగ్.
అంతే జరిగింది. సుప్రీం కోర్టు తాను ఇతమిద్ధంగా ఏమీ నరేంద్ర మోడి నిందితుడా కాదా అని ఏ విషయమూ చెప్పలేదు. ఇంతకాలం విచారణ జరిపించి క్రింది కోర్టే. అదింకా ఒక కొలిక్కి రానేలేదు. అక్కడ విచారణ పూర్తి కాకుండా లేదా లాజికల్ గా ముగింపు పలకకుండా తాను జోక్యం చేసుకోజాలనని సుప్రీం కోర్టు భావించి ఉండవచ్చు. ఈ మద్య కాలంలో ఇలాంటి తీర్పులను ఇతర ముఖ్యమైన కేసుల్లో సైతం సుప్రీం కోర్టు ఇచ్చింది కూడా. కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ 2జి స్పెక్ట్రం కేసులో సహ నిందితుడిగా చేర్చడం పైన కూడా సుప్రీం ఇదే కాకపోయినా ఇలాంటి తీర్పునే ఇచ్చింది. హైకోర్టు అదేశాల అనుసారం సి.బి.ఐ విచారణ జరుపుతున్నపుడు మాతో ఏం పని? చేప్పేదేమన్నా ఉంటే సి.బి.ఐ కే చెప్పుకోమ్మని సుప్రీం కోర్టు జగన్ కి చెప్పి పంపింది.
కాని భాజపాలో అంతర్గతంగా మరొకటి జరుగుతోందని ఆ పార్టీ నాయకుల ప్రతిస్పందనను బట్టి భావించవలసి ఉంది. భాజపా పార్టీ అగ్ర నాయకత్వం అంతా ఒక విధమైన ఆందోళనలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో కోర్టులు మరీ చురుకుదనం ప్రదరిశిస్తున్న నేపధ్యంలో వారి ఆందోళన మరింత తీవ్రమైంది. సుప్రీం కోర్టు నరేంద్ర మోడి పైన కేసు దాఖలు చేయాలని తీర్పు ఇస్తుందేమో అన్నదే వారి అందోళనంతా. ఏ తీర్పు వస్తుందా అని టెన్షన్ ఉగ్గబట్టుకుని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో వెలువడుతున్న వరుస కుంభకోణాల పుణ్యాన కాంగ్రెస్ నెగిటివ్ ఓటు తమకు పాజిటివ్ ఓటు అవుతుంది కనక తదుపరి అధికార పీఠం తమదే అని భాజపా నమ్మకంగా ఉంది. అలాంటిది, ఈ నరేంద్ర మోడి వ్యవహారం ప్రతికూలంగా పరిణమిస్తుందేమో, అధికారం కోసంమరో ఐదేళ్ల బాధాకరమైన ఎదురుచూపులు తప్పవేమో, వచ్చే సంవత్సరం యు.పి లాంటి చోట్ల జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోడి వ్యవహారం చేటు తెస్తుందేమో అని ఆ పార్టీ నాయకులు ఆందోళనగా ఉన్న నేపధ్యంలో సుప్రీం కోర్టు రూలింగ్ వచ్చింది.
గుజరాత్ మారణకాండను నరేంద్ర మోడి ప్రోత్సహించాడన్నది పచ్చి నిజం. కాకుంటే ‘చర్యకు ప్రతి చర్య’ అని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనకు అర్ధం ఏమిటి? జరిగిన ఘోరాలపై సంవత్సరాల తరబడి ఎటువంటి దర్యాప్తూ జరగకపోవడానికి కారణాలేమిటి? అన్ని వందలమంది చనిపోయినా దర్యాప్తులో ఎవరూ ధోషులుగా తేలకపోవడం ఎలా జరిగింది? మారణకాండకు సాక్ష్యాలు సమకూర్చిన పోలీసు అధికారిపై సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేసు బనాయించడానికి కారణం ఏమిటి? ఇవన్నీ నరేంద్ర మోడి దోషిత్వాన్ని తెలుపుతున్నాయా? నిర్దోషిత్వాన్ని తెలుపుతున్నాయా? దోషిత్వాన్నే తెలుపుతున్నాయి. ఆ నిజం స్ఫటికంగా ఎంత స్పష్టంగా ఉందంటే భాజపా నాయకులు దాదాపు నిశ్చయించుకున్నారు, నరేంద్ర మోడి పై విచారణ తధ్యమని. మాజీ కేంద్ర మంత్రులు జైలు పాలు కావడం, తమ ఫైనాన్షియర్ గాలి జనార్ధనుడు జైల్లో ఊచలు లెక్కపెడుతుండడం వారి భయాన్ని దాదాపు నిర్ధారిస్తున్నట్లుగా తోడయ్యాయి. ఆ పరిస్ధితుల్లో వచ్చింది సుప్రీం కోర్టు రూలింగ్.
తాము అంత గట్టిగా నమ్మింది ఒక్కసారిగా తారుమారు అయ్యేసరికి భాజపా నాయకుల అందోళన అంతా చేత్తో తీసివేసినట్లయ్యింది. దుర్భరమైన ఆందోళనలో ఉన్నపుడు ఏ చిన్న అనుకూల వార్త కూడా అపారమైన సంతోషాన్నీ, నమ్మకాన్ని ఇస్తుంది, అది తాత్కాలికమే అయినా. భాజపా నాయకులకు కూడా అటువంటి సంతోషమే సమకూరింది. ఎంతగా సంతోషించారంటే, సుప్రీం కోర్టు నరేంద్ర మోడి అమాయకత్వాన్ని గుర్తించింది అని ప్రకటించేటంతగా. లేదంటే అద్వానీ అన్నట్లుగా నరేంద్ర మోడి అమాయకుడా? నిఝ్ఝంగా అమాయకుడా? అద్వానికి, సుష్మా స్వరాజ్ కీ ఇంకా ఇతర అగ్రనాయకులందరికీ తెలుసు నరేంద్ర మోడి ఎంత అమాయకుడో. నరేంద్ర మోడికి మద్దతుగా వచ్చే మేధావులు కూడా ‘ఇంకా అప్పటి సంగతిని పట్టుకు వేళ్ళాడతారా? గుజరాత్ లో ఆయన చేసిన అభివృద్ధిని చూడరా?’ అని అడుగుతారు తప్ప ‘నరేంద్ర మోడి అమాయకుడు’ అని మాత్రం ఎన్నడూ అనరు. అంతెందుకు? నరేంద్ర మోడీయే స్వయంగా తన పాలనలో ముస్లింలు సాధించిన అభివృద్ధిని చూడండి అంటాడు తప్ప, గుజరాత్ మారణకాండలో నా పాత్ర లేదు అని ఎన్నడూ నేరుగా చెప్పడానికి ప్రయత్నించిన దాఖలాలు లేవు. అంటే అప్పుడేదో చేస్తే చేశాను. ఆ తర్వాత బాగానే ఉన్నాను కదా? దానిని కొనసాగించలేదు కదా? ఇంకెందుకు దాన్ని పదే పదే గుర్తు చేస్తారు? గుర్తు చేసి నా ప్రధాని పదవి అభ్యర్ధిత్వానికి నష్ట ఎందుకు తేస్తారు? అన్నది ఆయన పరోక్ష ప్రతిఘటన!
ప్రవాహంలో పడి కొట్టుకు పోతున్నవాడు చిన్న గడ్డి పోచ దొరికినా ఆబగా పట్టుకుంటాడు. అది తనని రక్షిస్తుందనే ఆ క్షణంలో నమ్ముతాడు. ప్రస్తుతం “నరేంద్ర మోడి వ్యవహారం కింది కోర్టు తేల్చాలి” అని సుప్రీం కోర్టు ఇచ్చిన రూలింగ్ కూడా అటు భాజపాకు, ఇటు నరేంద్ర కూ గడ్డిపోచ ఆధారంగానే కనిపిస్తోంది. అదే తమను ఒడ్డుకి లాగుతుందని భావిస్తున్నారు. అందుకే దాన్ని సొమ్ము చేసుకోవాలన్నట్లుగా భాజపా నాయకులంతా హడావుడిగా ప్రకటనలు గుప్పించారు. తమ భుజాల్ని తాము చరుచుకుంటున్నారు. తమకు తాము సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ పనిలో పనిగా మోడికి కూడా సర్టిఫికెట్లు ఇస్తున్నారు.
అందులో భాగంగానే నరేంద్ర మోడి శాకహార లేఖను విడుదల చేశారు. అత్యంత చిత్రాతి చిత్రమైన భోధనలను ఆ లేఖలో గుప్పించారు. కొందరు నోట్లో పడ్డప్పుడు ‘రామ’ అన్నా బూతులాగానే వినపడతుంది. నరేంద్ర మోడి చేయనున్న మూడు రోజుల నిరాహార దీక్ష కూడా అలాంటిదే. లేకుంటే నరేంద్ర మోడి సమైక్యత గురించి సామరస్యం (మత సామరస్యం అనడానికి దమ్ముల్లేవు మళ్ళీ) గురించీ బోధనలు చేయడం ఏమిటి? పులి వేట మాని గడ్డి తిన్నట్లు!!!

Your blog says “National and International News”. But you are giving opinion and trying to present itself as news. That is not correct.
I appreciate Modi for whatever he has done. even Gujarathi people accepted to whatever he has done and hence he won in next elections too. Why Hindus alone have to be the victims ? Others should also know what could happen if Hindus turn aggressive ?
I want Modi to be the next PM. His candidature can not be declined based on one decision he has taken which is been accepted by his own Gujarathis.
హరీష్ గారు, దూషణలు లేకుండా మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పారు. అందుకు మీకు అభినందనలు.
‘బ్లాగ్ గురించి’ లో రాశాను. మీరు చూడలేదు కాబోలు. వార్తలతో పాటు అంతర్లీనంగా విశ్లేషణ కూడా ఉంటుందని.
భారత దేశంలో జరిగే ఎన్నికల ఫలితాలను ఒక వ్యక్తి చేసిన దుర్మార్గాలకు కూడా సమర్ధనగా, ఆమోదంగా తీసుకోవడం కరెక్టు కాదనుకుంటా. ఇక్కడ ఎన్నికలు అనేక ప్రలోభాలకు గురవుతూ జరుగుతాయి. అందులో మతం, కులం, డబ్బు, గ్రూపులు, ప్రాంతం, కుల అణచివేత (కొన్ని కులాల వాళ్ళను ఓటింగ్ రాకుండా అడ్డుకుని తామే ఓట్లు వేసుకుంటున్న గ్రామాలు చాలా ఉన్నాయి. కడపలో పులివెందుల నియోజకవర్గంలో అవి ఉన్నాయి. మన జగన్ గారు కూడా ఐదు లక్షల ఒట్లు వచ్చాయి కనుక తన అవినీతిని ప్రజలు సమర్ధించారనో లేదా పట్టించుకోలేదనో లేదా అవినీతి చేయలేదనో చెప్పారని జగన్, ఆయన మిత్రులు చెబుతున్నారు. అంగీకరిద్దామా?
ఎవరు బాధితులు? ఆఫ్ఘనిస్ధా, ఇరాక్, లిబియాలలో హిందువులు బాధితులా? పాలస్తీనాలో హించువులు బాధితులా? భారత దేశంలో ఎక్కడ హిందువులు బాధితులు? టెర్రరిస్టు చర్యలు హిందూ గ్రూపులు కూడా చేస్తున్నాయి కదా?
నరేంద్ర మోడి ఇప్పుడు హిందువులు బాధితులు, ముస్లింలు దుర్మార్గులు అని చెప్పడం లేదు, మీరు గమనిస్తున్నారా? అదంతా జాంతానై సమైక్యత కావాలని అంటున్నాడు. పైగా ద్వేషం ద్వేషాన్ని జయించలేదు అని కూడా చెబుతున్నాడు. మీరేమో ఆ నరేంద్రమోడి గతంలో చెప్పినవి పట్టుకుని ఆయన ప్రధాని కావాలంటున్నారు. మీ భావాలని నరేంద్ర మోడీయే అంగీకరించడం లేదిప్పుడు. వాటికి నిరసనగా మూడురోజుల దీక్ష చేపట్టబోతున్నాడు.
ఇంతకీ అద్వానీ గారు ప్రధాని కావడానికి వీల్లేదా? ఆయనకి మీ మద్దతు లేదా?
ఆవేదన, వ్యంగ్యం కలగలిపి తర్కాన్ని మిళితం చేస్తూ ఎంతో బాగా రాశారు!
సంయమనం పాటించమని కోరాల్సిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ మాట అనకపోగా ‘చర్యకు ప్రతి చర్య’ అంటూ ప్రకటించి ప్రతిహింసను ప్రోత్సహించటం దేశచరిత్రలో ఎక్కడా జరిగివుండలేదు. ఇన్నేళ్ళ తర్వాత ఆయనకిప్పుడు ‘ద్వేషం ఎన్నటికీ ద్వేషాన్ని జయంచలేదు’ అని బోధపడిందన్నమాట. అందుకే కాబోలు- సామరస్యం గురించి ఈ ధర్మపన్నాలు! ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్న గాంధీ పుట్టిన రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి! గాంధేయ సోషలిజాన్ని కొంతకాలమైనా తలకెత్తుకున్న పార్టీ కి ప్రధాన నాయకుడు! నరేంద్రమోడీ కానీ, మరొకరు కానీ కేవలం ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన పాత దోషాలు కరిగిపోయి పునీతులు కాలేరెవ్వరూ!
“His candidature can not be declined based on one decision he has taken which is been accepted by his own Gujarathis.”
ఈవాక్యాన్ని యధాతథంగా అర్థం చేసుకుంటే గుజరాత్ ప్రజల నైతిక జీవితమే ప్రశ్నార్థకంలా మారుతుందేమో. 70 మంది ఓటర్లలో 50 మంది వేసిన ఓట్లు అధికారంలో కూర్చోబెడితే దాన్ని సాకుగా చూపించి, శ్రీమాన్ ‘శాఖాహారి’కి గుజరాతీల ఆమోదం లభించిందని నమ్మేయటం సత్యసమ్మతమేనా? గెలుపొక్కటే జనాంగీకారానికి సూచిక అయితే ఈ క్షణంలో గాలి జనార్ధనుడిని విడుదల చేసి ఎన్నికల్లో పోటీ చేయమని అడిగితే అఖండ మెజారిటీతో గెలిచే ప్రమాదముంది. ఓట్లరూపంలో జనాభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటే జగన్‌ని ఏ కోర్టూ విచారించకూడదు.
బతకడానికి అర్హతలేని ‘పందులు’ (పందిజాతి క్షమించాలి) గురించి శ్రీశ్రీ గతంలో అన్నారు. తన కవితా వాక్యాన్ని ఇవ్వాళ యధాతథంగా తీసుకుంటే మన సమకాలీన ఆలోచనా విధానానికి భంగకరం అవుతుందేమో కాని, ప్రపంచంలో న్యాయం నాలుగు పాదాలా నడిచే గడ్డ ఎక్కడైనా ఉంటే అక్కడ మొట్టమొదటిగా ఉరి తీయవలసింది ఎవరినో వాచ్యంగా చెప్పవలసిన పని లేదనుకుంటున్నాను. ఉరికి వ్యతిరేకంగా మానవచైతన్యంలో మార్పు వస్తున్నప్పటికీ పై వాక్యాన్ని ప్రతీకాత్మకంగా ఉపయోగించడానికి సాహసిస్తున్నాను.
హరీష్ గారూ, నా వ్యాఖ్యను వ్యక్తిగతంగా తీసుకోవద్దని మనవి. మీ అబిప్రాయ వ్యక్తీకరణలో ద్వేషభావం లేదు కానీ మీతో ఏకీభవించలేకపోతున్నాను. హిందువులు బాధితులవుతున్నారు అనే భావన నుంచి బయటపడి ప్రపంచాన్ని చూడాలని నా అభ్యర్థన.
ఈ లింక్ చదవండి: http://telugu.stalin-mao.in/70178682
హరీశ్ గారు, సున్నీ ముస్లింలలో ఎక్కువ మంది సద్దాం హుస్సేన్‌నే అభిమానిస్తున్నారని సద్దాం హుస్సేన్‌కి Mr Clean అని ధృవపత్రం ఇవ్వగలమా? కమ్యూనిస్ట్ అనే అనుమానంతో తన సొంత తమ్ముడినే చంపిన చరిత్ర సద్దాం హుస్సేన్‌కి ఉంది. హిందువులలో ఎక్కువ మంది నరేంద్ర మోడీని అభిమానిస్తున్నారని నరేంద్ర మోడీని సచ్ఛీలుడు అనుకుంటే సద్దాం హుస్సేన్ కూడా సచ్ఛీలుడే అనుకోవాలి.
పింగ్‌బ్యాక్: ప్రధాని అయ్యాక ‘రాజధర్మ’ నిర్వహణ గుర్తుకొచ్చింది! -కార్టూన్ | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ
పింగ్‌బ్యాక్: ప్రధాని అయ్యాక ‘రాజధర్మ’ నిర్వహణ గుర్తుకొచ్చింది! -కార్టూన్ | జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ