
కాబూల్ నడిబొడ్డున తాలిబాన్ మరొకసారి ప్రత్యక్షమైంది. నిరంతరం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శతృ దుర్భేధ్యంగా ఉండే ఆఫ్ఘనిస్ధాన్ రాజధానిలో తాలిబాన్ ప్రతిఘటనా దళాలు మరొక దాడికి శ్రీకారం చుట్టాయి. పెద్ద ఎత్తున పేలుళ్ళు, తుపాకి కాల్పులు వినిపిస్తున్నాయని కాబూల్ పోలీసులు ధృవీకరించారు. కాబూల్ నడిబొడ్డున గల వివిధ భవనాల నుండి ఈ కాల్పులు వినిపిస్తున్నాయని పోలీసుల ప్రతినిధి ఒకరు తెలిపారు.
“వరుస పేలుళ్ళు వినబడ్డాయి. ఆ తర్వాత తుపాకి కాల్పులు జరుగుతున్నట్లుగా శబ్దాలు వస్తున్నాయి. సంఘటన పైన మేము దృష్టి సారిస్తున్నాము” అని కాబూల్ పోలీసు ప్రతినిధి హష్మత్ స్టానిక్జాయ్ తెలిపాడు. అమెరికా రాయబార కార్యాలయం, నాటో నేతృత్వంలోని ‘ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఫోర్స్ (ఐ.ఎస్.ఎ.ఎఫ్) బలగాల కేంద్ర కార్యాలయం నెలకొని ఉన్న ప్రాంతం నుండి కాల్పులు, పేలుళ్ళు జరుగుతున్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
దాడులకు తమదే బాధ్యత అని తాలిబాన్ ప్రకటించింది. “కాబూల్‌లో గల అనేక ప్రభుత్వ, రాయబార, గూఢచార సంస్ధల కార్యాలయాలపైనా, అమెరికా ఎంబసీ భవంతులపైనా మా కామ్రేడ్లు దాడి జరిపారు” అని తాలిబాన్ ప్రతినిధి ‘జబీయుల్లా మూజాహిద్’ గుర్తు తెలియని ప్రదేశంనుండి ఫోన్‌లో తెలిపినట్లుగా ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. “మా వాళ్ళు వివిధ రకాల ఆయుధాలు వాడుతున్నారు. నడుముకు కట్టుకున్న ఆత్మాహుతి బాంబు బెల్టులు, మెషిన్ గన్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ లాంటి కొత్త ఆయుధం ’82’ లు వాటిలో ఉన్నాయి” అని ముజాహిద్ తెలిపాడు.
దాడికి పాల్పడుతున్నవారు 13 అంతస్ధుల భవంతిని తమ అదుపులోకి తీసుకున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘అబ్దుల్ హక్ స్క్వేర్’లో గల ఈ భవంతి నిర్మాణంలో ఉందని వారు తెలిపారు. ఐ.ఎస్.ఎ.ఎఫ్ కార్యాలయం పక్కనే ఈ భవంతి ఉన్నదని వారు తెలిపారు. రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ ఆయుధాలతో అమెరికా ఎంబసీపై దాడులు చేస్తున్నారని కూడా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అమెరికా ఎంబసీ సిబ్బంది సురక్షిత ప్రదేశంలో తలదాచుకున్నారని అమెరికా ఎంబసీ ప్రతినిధి తెలిపాడు. ఐ.ఎస్.ఎ.ఎఫ్ సిబ్బంది ఒకరు తాము దాడికి గురవుతున్నామని ధృవీకరించాడు. తమ బలగాలు తగినవిధంగా స్పందిస్తున్నారని ఆ ప్రతినిధి వివరించాడు.
సంఘటన స్ధలాన్ని పోలీసులు చుట్టుముట్టి రాకపోకలు బందు చేశారు. ఆఫ్ఘన్ సైనికులు, నాటో సైనికులు ఇరువురూ దాడులు చేసినవారిపై పోరాడుతున్నారని తెలుస్తోంది. ఎన్ని బధ్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ తాలిబాన్‌లు కాబుల్ నగరంలోకి జొరబడి తాము అనుకున్న పని నెరవేర్చుకోవడం సాధారణంగా మారింది. అమెరికా అధికారులకు, వివిధ ఉద్యోగులకు పూర్తి స్ధాయి రక్షణ ఏర్పాట్లు ఉండే కాబూల్‌లో సైతం రక్షణ లభిస్తుందన్న గ్యారంటి లేకపోవడం నాటోకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఏదో విధంగా తాలిబాన్ దాడులు జరగడంతో, ఆఫ్ఘన్ పోలీసులు ఇతర భద్రతా సిబ్బందిలోనే తాలిబాన్ మద్దతుదారులు ఉన్నారన్న అనుమానాలు సాధారణమైనాయి.
ఆఫ్ఘనిస్ధాన్ పోలీసులు, సైన్యంలోకి తాలిబాన్ చొచ్చుకుపోయింది. బాగా నమ్మకస్తులనుకున్నవారే అకస్మాత్తుగా కాల్పులకు తెగబడడం నాటో బలగాలనూ, అధికారులను నిశ్చేష్టులకు గురి చేస్తున్నది. వివిధ రంగాలలో దురామ్రణ బలగాలకు సేవ చేస్తున్న ఆఫ్ఘన్ దేశీయులనుండే దాడులు ఎదురవుతుండడంతో ఎవర్నీ నమ్మలేని పరిస్ధితులకు దారి తీస్తున్నది. దురాక్రమణను కట్టిపెట్టి ఇప్పటికైనా వెనుదిరిగి వెళ్ళడం తక్షణం నాటో చేయగలిగిన ఉత్తమ కార్యక్రమం.
