పొదుపు ఆర్ధిక విధానాలలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులకు ఇస్తున్న నామ మాత్రపు సదుపాయాలను రద్దు చేయడమో, కోత పెట్టడమో చేసింది. సామాన్య ప్రజానికం, మధ్య తరగతిపై పన్నులు పెంచి బడా కంపెనీలకు పన్నుల రాయితీలు పెంచింది. ఫలితంగా ప్రజల జేబుల్లో ఉన్న కొద్ది పాటి మిగులు బడా కంపెనీలకు లాభాలుగా తరలి వెళ్తున్నాయి. దానితో మార్కెట్లలో సరుకులు కొనవలసిన వినియోగదారుల -కార్మికులు, ఉద్యోగులు- కొనుగోలు శక్తి క్షీణించింది. కొనుగోలు శక్తి క్షిణించడం ఒక విపరిమాణం కాగా, కుటుంబాల బడ్జెట్లే మొత్తంగా కుచించుకుపోయాయని ఐ.ఎఫ్.ఎస్ అధ్యయనంలో తేలడం రానున్న గడ్డురోజులను సూచిస్తున్నది.
గడ్డురోజులు రానున్నది ఒక్క కార్మికులు, ఉద్యోగులు తదితర సామాన్య ప్రజానీకానికే కాక పెట్టుబడిదారులకు కూడా అని గమనించవలసి ఉంది. అనేక కంపెనీలు, బ్యాంకులు ఇన్సూరెన్సు కంపెనీల లాంటి ద్రవ్య సంస్ధలు, పెట్టుబడి సరుకుల పరిశ్రమల నుండి వినియోగ సరుకుల పరిశ్రమల వరకూ అంతిమ లక్ష్యం వినియోగదారుడే నన్నది అందరూ ఎరిగినదే. అటువంటి వినియోగదారుడి కుటుంబ బడ్జెట్ కుచించుకుపోయాక అతను మార్కెట్లోకి వచ్చిపడే సరుకుల్ని ఎలా కొనుగొలు చేయగలడు? ప్రజల జేబులనుండి పెట్టుబడిదారుడి జేబుల్లోకి వెళ్ళీన సొమ్ము మళ్ళీ పెట్టుబడిగా అవతరించి కొత్త ఫ్యాక్టరీలు, కంపెనీలు పెట్టీ ఉద్యోగాలు ఇవ్వవలసి ఉండగా అది చేయకుండా ద్రవ్య పెట్టుబడిగా మారి గుడ్లు పెట్టే డబ్బులుగా ఎంచబడి కేవలం షేర్ మార్కేట్లలోనో, బాండ్ మార్కెట్లలోనో పెట్టుబడులుగా తరలి వెళ్తోంది. అంతిమంగా ఇది ఉత్పాదక రంగం మరింతగా కుచించుకుపోయి నిరుద్యోగాన్ని తగ్గించడానికి బదులు పెంచడానికి దారి తీస్తున్నది. వినియోగదారుల ఆర్ధిక కార్యకలాపాలను కూడా కుచించివేస్తున్నది.
గత ముప్ఫై సంవత్సరాలలోనే ఎన్నడూ లేనట్లుగా గత ఒక్క సంవత్సరమే కుటుంబాల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయని ఐ.ఎఫ్.ఎస్ సర్వే తెలిపింది. అత్యంత కింది స్ధాయిలో ఉన్న కుటుంబాలు ఇప్పటికే తరిగిన ఆదాయాలతో దరిద్రాన్ని అనుభవిస్తుండగా వీరు మరింతగా ఆదాయాలను కోల్పోతారని తద్వారా ఖర్చుచేయగల శక్తిని కోల్పోనున్నారనీ అధ్యయనం హెచ్చరించింది. బ్రిటన్ బడ్జెట్ లోటు తగ్గించడానికి అమలు చేస్తున్న పధకాలు తక్కువ వడ్డి రేట్లు విధించడం ద్వారా కష్టాలలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి ఉద్దేశించబడ్డాయని ట్రెజరీ చెబుతుండగా వాస్తవం అందుకు భిన్నంగా ఉంది.
మూడు సంవత్సరాల నాటి ‘ది గ్రేట్ రిసెషన్’ బారినుండి బ్రిటన్ కుటుంబాలు సాపేక్షికంగా తక్కువ నష్టంతో బైటపడడానికి ప్రభుత్వం అందించిన సంక్షేమ వ్యవస్ధలు దోహదపడ్డాయనీ, ప్రభుత్వం కొద్దో గొప్పో ఆర్ధిక మద్దతు వారికి ఆదరువుగా నిలబడిందనీ ఐ.ఎఫ్.ఎస్ అధ్యయనం తెలిపింది. ఐ.ఎఫ్.ఎస్ అధ్యయనంలో తేలిన అంశాలలో ఇది ముఖ్యమైన విషయంగా పరిగణించవచ్చు. ప్రభుత్వాల మద్దతు ప్రజలకు ఉన్నట్లయితే వారు మాంద్యం పరిస్ధితులు ఏర్పడినప్పుడు, ఆ మద్దతు అందినమేరకు రక్షణ పొందుతారని ఈ అంశం తెలియజేస్తున్నది.
అయితే బడా కంపెనీలు, ప్రభుత్వం నుండి ప్రజలకు అందుతున్న ఈ కొద్ది పాటి మద్దతును కూడా రద్దు చేసి కంపెనీలకు ఇవ్వాలని కోరుతున్న ఫలితంగానే పొదుపు ఆర్ధిక విధనాలు రంగం మీదికి వచ్చాయి. పొదుపు ఆర్ధిక విధానాల పేరిట బ్రిటన్ ప్రభుత్వం రూపొందించిన విధానాలు, ప్రభుత్వం, ప్రజలకు సంక్షేమ పధకాల ద్వారా అందిస్తున్న మద్దతును కత్తిరించి లేదా రద్దు చేసి ఆ భాగాన్ని పన్నుల రాయితీ రూపంలో, ఎగుమతి దిగుమతి సబ్సిడీల రూపంలో, సెంట్రల్ బ్యాంకు అందిస్తున్న అతి తక్కువ వడ్డీ రేట్ల రూపంలో బహుళజాతి బడా కంపెనీలకు ఇవ్వడానికి దోహదపడుతున్నాయి.
ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పధకాల మద్దతు ప్రధానంగా మధ్య తరగతి, ఆ తర్వాత
కింద ఉండే కుటుంబాలలో కేంద్రీకరించబడి ఉన్నందున వారు మాంద్యం నుండి కొద్ది
మేరకు తట్టుకున్నారని ఐ.ఎఫ్.ఎస్ తెలిపింది. అయితే, గత సంవత్సర కాలంలో కుటుంబాల ఆదాయాలు, ప్రభుత్వ సదుపాయాలు, పన్నుల మినహాయింపు ద్వారా వచ్చే క్రెడిట్లూ అన్నీ నిజ గణాంకాలలో చూసినప్పుడు తగ్గిపోయాయని ఐ.ఎఫ్.ఎస్ తెలిపింది. ఫలితంగా కుటుంబాల సగటు నికర ఆదాయం 3.5 శాతం పడిపోయిందని అధ్యయనం చేసిన పరిశోధకులు అంచనా వేశారు. 1981 నుండి, అంటే గత ముప్ఫై సంవత్సరాలలొ ఒకే సంవత్సరం ఇంత మొత్తంలో ఆదాయాలు తగ్గిపోలేదని సర్వే తేల్చింది. ఈ తగ్గుదల వలన బ్రిటన్ కుటుంబాల ఆదాయం 2003-04 స్ధాయికి పడిపోయిందని అధ్యయనం కనుగొంది. పెరుగుతున్న రేట్లు, జీవన వ్యయం నేపధ్యమ్లో నిజ వేతనాలు పెరగవలసి ఉండగా అందుకు విరుద్ధంగా తగ్గిపోతుండడం కుటుంబాల జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయనడానికి సూచిక.
నిజానికి (మూడు సంవత్సరాల క్రితం సంభవించిన) మాంద్యం వలన సామాన్యులకు ఎదురు కావలసిన కష్టాలు కొద్ది కాలం వాయిదా వేయబడ్డాయే తప్ప అసలుకే రద్దు కాలేదని అధ్యయనం తేల్చింది. అంటే ప్రభుత్వ సంక్షేమ పధకాల ద్వారా కుటుంబాలు మాంద్య ప్రభావాన్ని కొద్ది మేరకు తట్టుకున్నప్పటికీ బడా కంపెనీలకు వందల బిలియన్ల బెయిలౌట్లు ఇవ్వడం వలన పోగుబడిన అప్పు తీర్చడానికి సంక్షేమ పధకాలు రద్దు చేయడం లేదా కోత విధించడంతో సదరు మాంద్యం ప్రభావాన్ని మూడు సంవత్సరాల తర్వాత ప్రజానీకం భరించవలసి వస్తున్నదని ఐ.ఎఫ్.ఎస్ అధ్యయనం చెబుతున్నది. కనుక ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్న మాంద్యం వాస్తవానికి మూడు సంవత్సరాల క్రితమే ప్రారంభం అయ్యిందని ఐ.ఎఫ్.ఎస్ ఆర్ధిక వేత్త రాబర్డ్ జాయ్స్ పేర్కొన్నాడు.
ఇతర అభివృద్ధి చెందిన దేశాలకు మల్లేనే మాంద్యానికి సంబంధించిన అత్యంత తీవ్ర ప్రభావాలు బ్రిటన్ జీవన ప్రమాణాలపై పడడం ఇప్పుడే ప్రారంభం అయ్యిందని ఐ.ఎఫ్.ఎస్ తెలిపింది. ఈ ప్రభావం రానున్న అనేక సంవత్సరాలపాటు ప్రజలు ఎదుర్కొంటారని కూడా ఆ సంస్ధ తెలిపింది. సగటు జీవన ప్రమాణాలలో క్షీణత కనీసం 2013-14 వరకూ కొనసాగుతుందని ఐ.ఎఫ్.ఎస్ గత అధ్యయనం వివరించగా, ఆ గడువును తాజా నివేదిక మరింతగా పొడిగించింది. ఆర్ధిక వృద్ధి బలహీనంగా ఉన్న నేపధ్యంలో పొదుపు విధానాల పేరుతో ప్రజల గోళ్ళు ఊడగొడితే అది మరో మాంద్యానికి దారితీయడం తప్ప మరో ఫలితం రాజాలాదు. గ్రీసు ఉదాహారణ అందుకు తాజా ప్రబల సాక్ష్యంగా నిలుస్తున్నది. కనుక బ్రిటన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీవ్రమయిన పొదుపు ఆర్ధిక విధానాల పట్ల పునరాలోచన అవసరమని అనేక మంది ఆర్ధికవేత్తలు, ప్రతిపక్షాలు ఇటీవల కాలంలో హెచ్చరిస్తున్నాయి. బ్రిటన్ మాత్రమే కాక ఇతర యూరప్ దేశాలు, అమెరికా కూడా బలహీన ఆర్ధిక వృద్ధితో తీసుకుంటున్న సంగతిని వారు ఎత్తి చూపుతున్నారు.
కాని ఐ.ఎం.ఎఫ్ మాత్రం ప్రభుత్వాల ఆర్ధిక బలహీనతలు గానీ, దేశాల ఆర్ధిక వృద్ధిగానీ అవసరం లేదు. దానికి కావలసింది బహుళజాతి కంపెనీలు, ద్రవ్య సంస్ధలు, ‘టూ బిగ్ టు ఫెయిల్’ మరిన్ని లాభాలు మూటగట్టుకోవడమే. దాని చరిత్ర అంతకంటే గొప్పగా ఎప్పుడూ ఏడ్వలేదు. అందుకే అది మామూలుగానే బ్రిటన్ పొదుపు విధానాలను భేష్ అని మెచ్చుకుంటున్నది. పైగా విధానాలు రూపొంచించడమే కాదు వాటిని అమలు చేసి చూపాలి అని హెచ్చరికలు కూడా జారీచేస్తున్నది. ప్రస్తుతం నెలకొన్న ఆర్ధిక వాతావరణంలో బ్రిటన్ పొదుపు విధానాలను అమలు చేయడం ఒక సవాలు వంటిదనీ, ఆ సవాలుని బ్రిటిష్ ప్రభుత్వం స్వీకరించాలనీ ఐ.ఎం.ఎఫ్ ఎం.డి క్రిస్టీన్ లాగార్డే గత వారం పేర్కొన్నది.
ఉద్యోగులు, కార్మికులకు ఇస్తున్న సంక్షేమ సదుపాయాలను తగ్గించడం ఒక ఎత్తు కాగా, నిరుద్యోగం పెరుగుతుండంతో పాటు, ఉద్యోగాల రద్దువలన ఉపాధి తగ్గిపోతున్న పరిస్ధితి కూడా చోటు చేసుకుంటున్నది. బ్రిటన్ జిడిపి అత్యునత స్దాయినుండి మాంద్యం కాలంలో 6 శాతం పైగా పడిపోయిందని ఐ.ఎఫ్.ఎస్ తెలిపింది. ప్రపంచంలో మాంద్యం ఎదుర్కొన్న దేశాలు నష్టపోయిన జిడిపిలతో పోలిస్తే ఇది అత్యధిక నష్టమూ లేదా అత్యల్ప నష్టమూ కాకుండా మధ్య స్ధాయిలో ఉందని అధ్యయనం తెలిపింది. ఉదాహరణకి ఐరిష్ రిపబ్లిక్, జపాన్, స్వీడన్ లు అత్యంత ఎక్కువగా జిడిపి నష్టపోగా, కెనడా అత్యల్ప స్ధాయిలో జిడిపిని నష్టపోయింది. బ్రిటన్ లో మాంద్యం సమయంలో ఉపాధి నష్టం తక్కువగా ఉన్నప్పటికీ ఆ తర్వాత పొదుపు విధానాల దెబ్బకి అధికంగా ఉందని సర్వే తెలిపింది. మాంద్యం కాలంలో -2007, 2009 మధ్య- ఉపాధి నష్టం కేవలం 1.6 శాతం ఉన్నదనీ, ఇది జిడిపి నష్టంతో పోలిస్తే చాలా తక్కువని తెలిపింది. ఇదే కాలంలో జర్మనీలో ఉపాధి జర్మనీలో పెరగగా, ఫ్రాన్సులో పెద్దగా మార్పు జరగలేదనీ, అమెరికాలో 4 శాతం పైగా పడిపోయిందనీ అధ్యయనం తెలిపింది.
యూరప్, అమెరికాల ప్రభుత్వాలు చెబుతున్నట్లుగా పొదుపు ఆర్ధిక విధానాలు ఆ దేశాల అర్ధిక వ్యవస్ధల సమస్యలను పరిష్కరించకపోగా మరింత తీవ్రం చేస్తాయి. వాటివలన లబ్ది పొందేది ఒక్క పెట్టుబడిదారీ బహుళజాతి కంపెనీలె తప్ప ప్రజలు మాత్రం కాదు. పైగా ప్రజల జీవన ప్రమాణాలు, ఐ.ఎఫ్.ఎస్ అధ్యయనం పేర్కొన్నట్లుగా, మరింతగా క్షీణించడమే కాకుండా దేశాల ఆర్ధిక వ్యవస్ధలు మళ్లీ మాంద్యం లోకి వెళ్ళడానికి దారితీస్తాయి. ఎన్ని అధ్యయనాలు జరిపిన తేలేది ఇదే. ఈ సత్యానికి ఎన్ని సార్లు మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేసిన అది దాగదు కాక దాగదు.
