జి7, యూరోజోన్‌ల వైఫల్యంతో ప్రపంచ స్ధాయిలో షేర్ల పతనం


శుక్రవారం జరిగిన జి7 గ్రూపు దేశాల సమావేశం యూరోజోన్ సంక్షోభం పరిష్కారానికి ఏ విధంగానూ ప్రయత్నించకపోవడంతో దాని ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. యూరోజోన్ దేశాల్లో, ముఖ్యంగా జర్మనీకీ ఇతర దేశాలకీ మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తడం కూడా షేర్ మార్కెట్లపై ప్రపంచ స్ధాయి ప్రభావం పడుతోంది. జపాన్ షేర్ మార్కెట్ నిక్కీ గత రెండున్నర సంవత్సరాలలోనే అత్యల్ప స్ధాయికి పడిపోయింది. భారత షేర్ మార్కెట్లలో సెన్సెక్స్ సూచి మళ్ళీ పదాహారు వేల పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ మరొకసారి ఐదు వేల మార్కును దాటి తగ్గిపోయింది. యూరప్ షేర్లు రెండు శాతానికి పైగా పడిపోయాయి. అమెరికా  మార్కెట్లు ప్రారంభం అయ్యాక అవి కూడా బాగా నష్టపోతాయని భావిస్తున్నారు.

యూరోజోన్ గ్రూపులో కోర్ దేశాలయిన జర్మనీ, ఫ్రాన్సులు కూడా రుణ సంక్షోభానికి దగ్గర్లో తచ్చట్లాడుతున్నాయి. యూరోజోన్ రుణ సంక్షోభం పర్యవసానంగానా అన్నట్లు యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులో (ఇసిబి) ఛీఫ్ ఎకనమిస్టుగా ఉన్న జర్మనీ ఆర్ధిక వేత్త స్టార్క్ శుక్రవారం రాజీనామా చేయడంతో యూరోజోన్ దేశాల విభేదాలు విస్మరించరాని స్ధాయికి చేరుకున్నాయని అర్ధమవుతోంది. జర్మనీ మరొకరిని స్టార్క్ స్ధానంలో నియమించినప్పటికీ రాజీనామా ప్రభావం సోమవారం మార్కెట్లపై పడింది. సంక్షుభిత యూరోజోన్ దేశాల సావరిన్ బాండ్లను ఇసిబి కొనుగోలు చేసే విషయంలో జర్మనీ, ఇతర దేశాల మధ్య విభేధాలు తలెత్తడమే రాజీనామాకి కారణమని భావిస్తున్నారు. శుక్రవారం జరిగిన జి7 గ్రూపు సమావేశాల్లో యూరోజోన్ దేశాలు మరింత పెట్టుబడిని మార్కెట్ కి అందుబాటులోకి తేవాలనీ, ప్రధానమైన దేశాలు అందుకు పూనుకోవాలని ఒక పిలుపు ఇచ్చి ఊరికుంది తప్ప సంక్షోభ పరిష్కారానికి గట్టిగా ప్రయత్నించిన దాఖలాలు కనపడలేదు.

యూరోజోన్ విభేధాలు, జి7 గ్రూపు అంటీముట్టనట్లు వ్యవరించడం మదుపుదారులను నిస్పృహకు గురిచేసింది. దానితో షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మరోవైపు గ్రీసు గురించిన ఆందోళన ఇంకా వెంటాడుతోంది. పదే పదే బడ్జెట్ లోటు టార్గెట్ లను చేరుకోవడంలో వైఫల్యం చెందుతున్నదని యూరోజోన్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. తదుపరి వాయిదా ఎనిమిది బిలియన్ యూరోలు విడుదల చేయడానికి ఇ.యు షరతులు విధించింది. గ్రీసి ప్రభుత్వం వద్ద ఉన్న సొమ్ము మరి కొన్ని వారాలవరకే సరిపోతుందని గ్రీసు ప్రభుత్వం ధృవపరిచింది. జర్మనీ పాలక కూటమిలోని సభ్యులు బహిరంగంగానే గ్రీసు దివాళా గురించి మాట్లాడుతున్నారు. బడ్జెట్ లోటు తగ్గించడంపై ఐ.ఎం.ఎఫ్, ఇ.యు లనుంది వస్తున్న ఒత్తిడితో గ్రీసు ప్రభుత్వం ఆదివారం కొత్త సంపధ పన్నును ప్రతిపాదించింది.

యూరప్ ఇప్పుడు ఒక సంక్షోభం నుండి మరొక సంక్షోభానికి ప్రయాణించడం కాకుండా, ఒక సంక్షోభం పరిష్కారం అయ్యేలోపుగానే మరొక సంక్షోభానికి గురవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రీసు భవిష్యత్తు అంచనాలకు అందడం లేదనీ, దానికి మద్దతు కూడా పలచబడుతున్నదనీ, జరగకూడనిది జరగనున్నదన్న అవగాహనకు మార్కెట్లు దాదాపుగా వచ్చేశాయని భావిస్తున్నారు. ఇటలీ, స్పెయిన్ సావరిన్ బాండ్లపన యీల్డ్ రేట్లుకూడా ఒత్తిడికి గురవుతున్నాయి. గ్రీసు యూరోజోన్ నుండి బైటికి వెళ్లక తప్పదన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. హాలండ్ ప్రభుత్వంలో కొంతమంది యూరోజోన్ నుండి ఏ దేశమైనా బైటికి వెళ్ళదలుచుకుంటే పాటించవలసిన షరతుల గురించి శనివారం మాట్లాడడంతో గ్రీసు భవిష్యత్తుపై ప్రతికూల ఊహాగానాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇతర యూరోజోన్ దేశాలు అటువంట్ ఊహాగానాలకు తెరదించడం బదులు వాళ్ళే ఊహాగానాల సృష్టికి కారణభూతులవుతున్నారు.

వ్యాఖ్యానించండి