ఘోరంగా పడిపోయిన పారిశ్రామిక వృద్ధి, షాక్‌లో మార్కెట్లు


అసలే అమెరికా, యూరప్ ల రుణ సంక్షోభాలతో, అమెరికా ఆర్ధిక వృద్ధి నత్త నడకతోనూ నష్టాలతో ప్రారంభమైన ఇండియా స్టాక్ మర్కెట్లకు పారిశ్రామిక వృద్ధి సూచిక గణాంకాలు షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాయి. పారిశ్రామిక వృద్ధి సూచిక (ఐఐపి – ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) మార్కెట్ అంచనాలను మించి క్షీణించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు పెద్ద ఎత్తున నష్టాలను రికార్డు చేశాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి సెన్సెక్స్ రెండు శాతం పైగా 390 పాయింట్లు కోల్పోయి 16485 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా రెండు శాతం పైగా 123 పాయింట్లు కోల్పోయి 4935 వద్ద ట్రేడవుతోంది.

పారిశ్రామిక వృద్ధి జూన్ నెలలో 8.8 శాతం నమోదు కాగా, జులై నెలలో 6.2 శాతానికి పడిపోతుందని అంచనా వేశారు. కాని అది మరింత ఘోరంగా 3.3 శాతానికి పడిపోయి మార్కెట్ పరిశీలకులను నిశ్చేష్టులను చేసింది. అమెరికా, యూరప్‌ల నుండి అందిన ప్రతికూల సంకేతాల వలన స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే రెండు శాతం దగ్గరిలో నష్టాలతో ప్రారంభం కాగా, ఐ.ఐ.పి గణాంకాల దెబ్బకు నష్టాలు మరింత విస్తరించాయి. వినియోగ సరుకుల ఉత్పత్తి గత సంవత్సరం జులైలో 14.8 శాతం నమోదు కాగా, అది ఈ సంవత్సరం జులై నెలలో 8.6 శాతానికి పడిపోయింది. మాన్యుఫాక్చరింగ్ ఉత్పత్తి గత సంవత్సరం జులై నెలలో  10.8 శాతం కాగా, మొన్నటి జులై నెలలో 2.3 శాతానికి పడిపోయింది. పెట్టుబడి సరుకుల ఉత్పత్తి గత సంవత్సరం జులై కంటే ఈ జులైలో  15 శాతం పడిపోయింది.

ఈ దెబ్బతో పెట్టుబడి సరుకుల షేర్లు బాగా నష్టపోతున్నాయి. భెల్, లార్సన్, క్రాంప్టన్ గ్రీవ్స్ లాంటి కంపెనీల షేర్లు రెండు నుండి నాలుగు శాతం వరకూ నష్టపోయాయి. ఐ.టి కంపెనీల షేర్లు కూడా గణనీయంగా నష్టపోతున్నాయి. ఇండియా సావరిన్ అప్పు బాండ్ల వడ్డీ రేట్లు (యీల్ద్) సెకండరీ మార్కెట్లో అమాంతంగా పెరిగిపోయాయి. ఉత్పత్తి పడిపోయి జిడిపి వృద్ధి  నెమ్మదిస్తున్నప్పటికీ ఆర్.బి.ఐ మరోసారి వడ్డీ రేట్లను పెంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చర్య మదుపుదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని భావిస్తున్నారు.

యూరప్ దేశాలు సంక్షోభం విస్తరించకుండా తీసుకోవలసిన చర్యలపై భిన్నాభిప్రాయలతో ఉన్న నేపధ్యంలో యూరప్ రుణ సంక్షోభం భయాలు ఇండియా మార్కెట్లను వెన్నాడుతున్నాయి. మరోపక్క బ్యాంకు రేట్లను మరోసారి పెంచుతారన్న భయాలు కూడా తోడయ్యాయి. ఈ రెండు అంశాలు ప్రధానంగా మార్కెట్లపై ఒత్తిడి పెంచుతుండగా సోమవారం వాటికి తోడు ఐ.ఐ.పి గణాంకాలు నిరాశపరిచాయి. రానున్న శుక్రవారం రివ్యూలో బ్యాంకు రేట్లు పెంచుతారని భావిస్తున్నారు.

వ్యాఖ్యానించండి