
మరొక అభివృద్ధి చెందిన దేశంలో అణు కర్మాగారం పేలిపోయింది. భారత దేశానికి అణు రియాక్టర్లు అమ్మడానికి ఉరకలు వేస్తున్న దేశాలలో ఒకటైన ఫ్రాన్సులో అణు వ్యర్ధాలను ప్రాసెసింగ్ చేసే కర్మాగారంలో అణు వ్యర్ధాలను మండించడానికి వినియోగించే బట్టి పేలిపోయిందని ఫ్రెంచి పత్రికలను ఉటంకిస్తూ గార్డియన్ తెలిపింది. పేలుడులో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారనీ, గాయపడ్డ వారిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉందనీ తెలుస్తోంది. ఫ్రాన్సు ప్రపంచంలోనే అత్యధికంగా అణు ఇంధనం ఉపయోగిస్తుంది. తన విద్యుత్ ఉత్పత్తిలో అత్యధిక భాగం అణు విద్యుత్ ద్వారానే అది సంపాదిస్తున్నది.
దక్షిణ ఫ్రాన్సులో మధ్యధరా సముద్రానికి దగ్గరలోని నిమెస్ వద్ద గల మార్కొలే న్యూక్లియర్ సైట్‌లో ఈ పేలుడు సంభవించింది. దీనిలో ఎం.ఓ.ఎక్స్ అనే ఇంధనాన్ని తయారు చేస్తుంది. అణ్వస్త్రాలను తయారు చేయగా మిగిలిన ప్లుటోనియం ఇంధనాన్ని రీసైకిల్ చేయడానికి దీనిని వినియోగిస్తారు. ఫ్రాన్సు అణు కంపెనీ అరెవా ఈ ఇంధనాన్ని వినియోగించే కంపెనీలలో ఒకటి. రీసైక్లింగ్ ప్రక్రియలో అత్యధిక స్ధాయికి వేడి చేయబడిన ప్లుటోనియం మరియు యురేనియంల గోళీలను మండించడం ద్వారా వాటి సైజులను తగ్గిస్తారు. నిలవ ఉంచడానికి వీలుగా చేయడానికి ఆ విధంగా చిన్న సైజులకు ఇంధన గోళీలను తగ్గిస్తారు.
ఒకరు చనిపోగా, నలుగురు గాయపడ్డారని స్ధానిక వార్తా పత్రిక ‘మిడి లీబర్’ తెలిపింది. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం గం.5:15ని.ల (10:45 బి.ఎస్.టి) సమయంలో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. చనిపోయిన కార్మికుడు శరీరం ప్లాంటు వద్ద కార్బొనైజ్ (జీవ పదార్ధం బొగ్గుగా మారే ప్రక్రియ) అయిన స్ధితిలో ఉన్నదని ఆ పత్రిక తెలిపింది. అణు ధార్మిక పధార్ధం లీక్ అయినట్లుగా సాక్ష్యం ఏమీ దొరకలేదని కూడా ఆ పత్రిక తెలిపింది. ఫుకుషిమా అణు ప్రమాదం సంభవించినప్పుడు కూడా మొట్టమొదట బైటికి వచ్చిన సమాచారం ఇదే కావడం గమనార్హం.
ఫ్రెంచ్ అణు ఇంధన అధారిటీ ప్రతినిధి “ఇప్పటికైతే అక్కడ ఏమీ (రేడియేషన్) బైటికి రావడం లేదు” అని పేర్కొన్నాడని గార్డియన్ తెలిపింది. ఫ్రెంచి అణు బద్రతా అధారిటీ సంస్ధ ఓ ప్రకటన విడుదల చేస్తూ “బలహీనమైన, మరియు అతి బలహీనమైన” అణు ధార్మికత ఉన్న అణు లోహ వ్యర్ధాన్ని మండిస్తున్న బట్టీలో పేలుడు జరిగిందని తెలిపింది. ‘యూరోప్ ఎకాలజీ’ అనే పేరుగల రాజకీయ పార్టీ జనరల్ సెక్రటరీ, ఈ సంఘటనపై ‘వాస్తవ సమయంలో’ మరియు ‘పారదర్శకమైన’ సమాచారం అందించాలని కోరాడు. అంటే ప్రమాద ఘటన సమాచారాన్ని ఆలస్యం లేకుండా ఎప్పటి కప్పుడు తెలియజేయాలని ఆయన కోరుతున్నాడు. ఆయన కోరికే అటువంటి సమాచారం అందే అవకాశాలు తక్కువ అని స్పష్టం చేస్తున్నదా?
కాని ఫ్రాన్సులోని అత్యవసర సర్వీసుల విభాగం అణు దార్మికత విడుదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లుగా ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక తెలిపింది. పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉన్నదీ తెలియనప్పటికీ ఎమర్జన్సీ సేవల విభాగం మాత్రం అణు ధార్మికత విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఫైర్ సిబ్బంది గానీ, ప్రభుత్వ అధికారులు గానీ కంపెనీ అధికారుల గానీ పూర్తి సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. పేర్లు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. ఔట్ లుక్ పత్రిక ‘మిడి లీబర్’ పత్రికనే ఉటంకిస్తూ అణు ధార్మికత లీక్ కాలేదని తెలిపింది. ప్రజలు ఖాళీ చేయాలని గానీ, రక్షణ పరిధి విధించడం గానీ జరగలేదని తెలిపింది. వియన్నాలోని ఐ.ఎ.ఇ.ఎ (అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ) ప్రతినిధి తాము ఫ్రాన్సు అధికారులతో సమాచారాన్ని ఇచ్చి పుంచుకుంటున్నామని, ప్రమాదం గురించి మరింత సమాచారం సేకరిస్తున్నామనీ తెలిపాడు. కానీ ఈయన కూడా పేరు చెప్పడానికి నిరాకరించాడని ఔట్‌లుక్ తెలిపింది.
ప్లాంటు చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లుగా అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అతి పెద్ద ఫ్రెంచి విద్యుత్ కంపెనీ సొకోడీ వినియోగించే ‘సెంట్రాకో సెంటర్’ లో పేలుడు సంఘటన చోటు చేసుకుంది. అంటే ప్రమాదానికి మసిపూసి మారేడు కాయ చేయడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయన్నమాట! పేరెన్నికగన్న పెద్ద పెద్ద కంపెనీల గొప్పతనం ఇటువంటి చిన్న చిన్న ప్రమాదాల వలన మసకబారటం ప్రభుత్వాలకు కూడా ఇష్టం ఉండదు మరి.
