ఇండియా టెర్రరిస్టులే ఢిల్లీ పేలుళ్ళ బాధ్యులు కావచ్చు -హోం మంత్రి


ఇండియాలో ఉన్న టెర్రరిస్టులే ఢిల్లీ హైకోర్టులో జరిగిన పేలుళ్లకు బాధ్యులు కావచ్చని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం అన్నాడు. ” భారతదేశంలో జరిగే టెర్రరిస్టు దాడులకు ఇప్పుడు కేవలం సరిహద్దుల అవతలినుండే జరుగుతున్నాయని ఆరోపించలేము” అని ఆయన అన్నాడు. వార్తా ఛానెళ్ళకు అందిన ఈ మెయిళ్ళ సమాచారాన్ని నిపుణులు ఇంకా విశ్లేషిస్తున్నారని ఆయన తెలిపాడు. ఢిల్లీ హైకోర్టు పేలుళ్ళలో చనిపోయినవారి సంఖ్య 13కి చేరుకుందని కూడా ఆయన తెలిపాడు.

పాకిస్ధాన్ నుండి నడిచే హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ, ఇండియాలో తలెత్తిన ఇండియన్ ముజాహిదీన్ సంస్ధలు రెండూ తామే పేలుళ్ళకు బాధ్యులము వేరు వేరుగా పంపిన ఈ మెయిళ్ళలో పేర్కొన్నాయి. హోం మంత్రి చిదంబరం మాటలను బట్టి పాకిస్ధాన్ నుండి నడిచే హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ సంస్ద పేలుళ్ళకు బాధ్యత కాకపోవచ్చు. హూజి పంపినట్లుగా చెబుతున్న ఈ మెయిల్ కాశ్మీర్ నుండి వచ్చినట్లు కనుగొన్న పొలీసులు అక్కడ ఐదుగురు అనుమానితులను అరెస్టు చేశారు. అరెస్టు చేసినవారిలో ఈ మెయిల్ పంపినట్లుగా భావిస్తున్న అనుమానితుడు కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

పేలుళ్ళకు బాధ్యత తనదేనని హుజీ చెబుతున్నప్పటికీ ఆ గ్రూపు ఇండియాలో ఈ మధ్య కాలంలో చురుకుగా లేదని చిదంబరం అభిప్రాయపడ్డాడు. “ఇండియాలో ఇప్పటివరకు మూడు చోట్ల పెద్ద దాడులు జరిగాయి. అవి ముంబై, పూనె, ఢిల్లీలలో జరిగాయి. ముంబై, పూనే లలో జరిగిన దాడులలో ఇండియన్ మాడ్యూళ్ళు గాని లేదా ఇండియాలో ఉన్న మాడ్యూళ్ళు గాని పాత్ర పోషించారని దాదాపు ఖాయమయ్యింది” అని చిదంబరం బిబిసి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

అయితే పాకిస్ధాన్ నుండి ఇక టెర్రరిస్టు దాడుల భయం ఇక తప్పినట్లేనా? కాదని చిదంబరం అంటున్నాడు. పాకిస్ధాన్ నుండి టెర్రరిస్టు మాడ్యూళ్ళు వచ్చి టెర్రరిస్టు దాడులు చేయగల అవకాశం రద్దు కాలేదని చిదంబరం చెప్పాడు. కాని ఇండియా అధారిత మాడ్యూళ్ళూ కానీ లేదా భారతీయ మాడ్యూళ్ళు గానీ టెర్రరిస్టు దాడులు చేయగల శక్తిని సంతరించుకున్నాయని చిదంబరం ఎత్తి చూపాడు. ఇండియా ఇప్పుడు టెర్రరిస్టు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహరించగల సామర్ధ్యం సంతరించుకోవలసిన అవసరం ఉందనీ, తద్వారా ఇండియాలో ఉన్న మిలిటెంట్ల గ్రూపులను అంతం చేయాలని చిదంబరం అన్నాడు.

ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లతో ఉన్న భౌగోళిక సాన్నిహిత్యం భారత దేశానికి ప్రమాదకరంగా పరిణమించిందని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశాడు. భారత యువత అంతకంతకూ తీవ్రవాద భావజాలం పట్ల ఆకర్షితం అవుతోందని చిదంబరం తెలిపాడు. ఢిల్లీ దాడులతో భారత ప్రభుత్వం టెర్రరిజం సమస్యపై మరింత వత్తిడికి గురవుతున్నది. వరుస దాడులు జరుగుతున్నప్పటికీ టెర్రరిజం ఎదుర్కోవడానికి ఇండియా సిద్ధం కాలేదని విమర్శలు ఎదుర్కొంటున్నది. ఢిల్లీ పేలుళ్ళు జరిగి మూడు రోజులైనా దర్యాప్తులో ఇంకా ఎటువంటి ముందంజ లేకపోవడంతో భారత ప్రభుత్వం, దర్యాప్తు సంస్ధలు సమాధానం చెప్పవలసిన స్ధితిలో ఉన్నాయి.

టెర్రరిస్టు చర్యలను అడ్డుకోవడానికి పోలీసులు, ఇంటలిజెన్స్ సామర్ధ్యం పెంచితే అది కొంతమేరకే ఫలితాలనిస్తుంది తప్ప పూర్తిగా టెర్రరిజానికి అంతం పలకడానికి సరిపోదన్న సంగతి పాలకులకు బాగానె తెలుసు. టెర్రరిజం పుట్టుకకు దోహదపడుతున్న మూలాలు కనిపెట్టి పరిష్కరించనంతవరకూ టెర్రరిస్టు దాడులు జరగకుండా ఆపడం దాదాపుగా అసంభవం అనే చెప్పాలి. భారత దేశానికి సంబంధించి కాశ్మీరు సమస్య, ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా దురాక్రమణ దాడికి మద్దతునివ్వడం, ఆఫ్ఘనిస్ధాన్ నుండి సైనికుల ఉపసంహరణ కూడదని చెప్పడం మున్నగు విధానాలు భారత దేశంపై టెర్రరిస్టు దాడులకు పురిగొల్పు తున్నాయి. కాశ్మీరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తగిన రాజకీయ నిర్ణయం తీసుకోవడం, పొరుగున అగ్రరాజ్యాల దురాక్రమణ దాడుల పట్ల వ్యతిరేక వైఖరి కలిగి ఉండడం జరిగినట్లయితే దేశంపై టెర్రరిస్టు దాడులు అత్యధికం తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది.

వ్యాఖ్యానించండి