అమెరికా, యూరప్ సంక్షోభాలకు పరిష్కారం చూపని జి7 సమావేశాలు


శుక్రవారం జరిగిన జి7 సమావేశాలు చప్పగా ముగిశాయి. ప్రపంచ ఆర్ధికవ్యవస్ధ మరొక మాంద్యం ముంగిట నిలబడి ఉన్నప్పటికీ ఇతమిద్ధమైన పరిష్కారారాన్నేదీ చూపలేకపోయింది. అందరం కలిసి ఉమ్మడి సహకారంతో సంక్షోభానికి స్పందించాలన్న మొక్కుబడి ప్రకటన తప్ప సమావేశాలు ఏమీ సాధించలేకపోయాయి. పైగా యూరప్ రుణ సంక్షోభంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి నిరాశపరిచాయి. యూరప్ రుణ సంక్షోభం పరిష్కారానికి యూరోప్ కి చెందిన శక్తివంతమైన దేశాలు యూరోజోన్ లోని బలహీన దేశాలకు ద్రవ్య మద్దతు ఇవ్వాలని అమెరికా నొక్కి చెప్పగా, జర్మనీ మాత్రం ఆయా దేశాలు బడ్జెట్ లోటులని తగ్గించడం పైన దృష్టి పెట్టాలని వాదించింది.

ఫ్రాన్సులోని మార్సెల్లీ పట్టణంలో జరిగిన జి7 సమావేశాలలో గంటల తరబడి చర్చించి ఉమ్మడి అంశాలతో కూడిన ప్రకటనను జారీ చేసారు. “ఆర్ధిక వృద్ధి, బడ్జెట్ లోటులు, సావరిన్ రుణం మున్నగు వాటికి నూతన సవాళ్ళు ఎదురవుతున్న కాలంలో మేము సమావేశం అయ్యాము. ప్రపంచ ఆర్ధిక వృద్ధి నెమ్మదిస్తున్నడనడానికి స్పష్టమైన సంకేతాలు ఇప్పుడు నెలకొని ఉన్నాయి. ఈ సవాళ్లకు ఉమ్మడి సమన్వయంతొ స్పందించడానికి కట్టుబడి ఉన్నాము” అని ఉమ్మడి ప్రకటన పేర్కొంది. “వివిధ దేశాల జాతీయ పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుంటూ ఆర్ధిక కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూస్తూనే, కఠినమైన బడ్జెట్ సర్దుబాటు పధకాలను రూపొందించుకోవలసి ఉంటుంది” అని ప్రకటన పేర్కొన్నది.

అంటే బడ్జెట్ లోటు తగ్గించడానికి ప్రజలపైన భారం వేశే పొదుపు విధానాలను అమలు చేస్తూ ఆర్ధిక వృద్ధి సాధించాలని ఓ ఆదర్శాన్ని ప్రకటించాయి జి7 దేశాలు. కఠినమైన విధానాలు అన్నారంటే అది కార్మికులు, ఉద్యోగులు తదితర ప్రజానీకానికి కఠినమైనవే తప్ప కంపెనీలకు, ధనికులకు ఎంతమాత్రం కాదు. ధనికులు, కంపెనీలు ఏ సంక్షోభం వచ్చినా తమకు ఏమిస్తారనే చూస్తాయి తప్ప దేశ ఆర్ధిక వ్యవస్ధ గాడిన పెట్టడానికి ఏం చేద్దామని ఎన్నడూ భావించవు. ఎటొచ్చీ తేలికగా దొరికేది కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వృద్ధులూ, పెన్షనర్లూ మాత్రమే. వారికి ఇచ్చే సదుపాయాలను ఏమేరకు తగ్గిద్దామన్నదే ప్రభుత్వాల ధ్యాస తప్ప బడా కంపెనీలు, బడా ధనికులకు ఇస్తున్న పన్ను రాయితీలు రద్ధి చేద్దామని గానీ, పన్నులు పెంచుదామని గానీ భావించలేదు.

స్పష్టత లేని ఈ ప్రకటనకు మార్కెట్లు సంతృప్తి చెందలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అది కూడా ఫ్రాన్సు ఒత్తిడిమేరకే ఇచ్చారని జర్మనీ వర్గాలు చెప్పాయని రాయిటర్స్ తెలిపింది. ఈ సంక్షోభానికి ఒకే పరిష్కారం ఉందన్న ఆలోచననుండి బైటికి రావాలి. ఆర్ధిక వృద్ధి, పొదుపు విధానాలను ఒకదాని ఎదుట మరొకదానిని మొహరించడం మా ఉద్దేశ్యం కాదు” అని ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి విలేఖరులకు తెలిపాడు కాని ఆచరణలో జరుగుతున్నది మాత్రం పొదుపు విధానాల వలన ఆర్ధిక వృద్ధి క్షీణించడమే. గ్రీసుకి బెయిలౌట్ మంజూరు చేసి దరిమిలా అమలు చేసిన కఠినమైన పొదుపు విధానాల వలన ఆ దేశ ఆర్ధిక వృద్ధి తీవ్ర స్ధాయిలో పడిపోయింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించే పేరుతో ప్రజలపైన పలు భారాలు మోపడంతో మార్కెట్ లో సరుకుల వినియోగం చేసేవారు లేకపోయారు.

అమెరికా ట్రజరీ సెక్రటరీ తిమోతి గీధనర్, యూరప్ లోని పెద్ద దేశాలు ఉదారంగా బెయిలౌట్లు ఇవ్వాలని కోరాడు. యూరోజోన్ లోని బలహీన దేశాలు ఫిస్కల్ క్రమశిక్షణ పాటించకుండా విచ్చలవిడిగా ఖర్చు చేసిన పాపానికి తమపై భారం మోపడం ఏమిటని జర్మనీ ప్రజలు నిలదీస్తుండడంతో జర్మనీ ప్రబుత్వం, బెయిలౌట్లపైన కేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నది. దానికి బదులు దేశాలు బడ్జెట్ ఖర్చులు తగ్గించుకుని బడ్జెట్ లోటు తగ్గించుకోవాలని గట్టిగా కోరుతున్నది. జి7 సమావేశాల్లో చర్చ ప్రధానంగా యూరప్ రుణ సంక్షోభంపై కేంద్రీకరించారని తెలుస్తున్నది. జి7 గ్రూపు, ఐ.ఎం.ఎఫ్ తో కలిసి యూరప్ సంక్షోభ పరిష్కారానికి కృషి చేస్తుందని గీధనర్ హామీ ఇచ్చినా అదెలాగో ఎవరికీ స్పష్టత లేదు.

గురువారం అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించిన 447 బిలియన్ డాలర్ల ఉద్యోగాల ప్యాకేజీకి జి7 మద్దతు ప్రకటించింది. వివిధ కరెన్సీల ఎక్ఛేంజి రేట్లను మార్కెట్లే నిర్ణయించాలని తీర్మానించారు. అయితే జర్మనీకి మిగిలి యూరోజోన్ సభ్యులకు మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. జర్మనీ తరపున యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులో (ఇసిబి) ఉన్న అధికారి గురువారం రాజీనామా చేసి సంచలనం సృష్టించాడు. యూరోజోన్ దేశాల సంక్షోభ పరిష్కారం కోసం సంక్షోభ దేశాల సావరిన్ రుణ బాండ్లను ఇసిబి కొనుగోలు చేయాలన్న బ్యాంకు విధానాన్ని వ్యతిరేకిస్తూ జర్మనీ ప్రతినిధి రాజీనామా చేశాడు. దీనితో యూరోజోన్ దేశాల్లో ఉన్న తీవ్ర వైరుధ్యాలు బైటపడ్డాయి.

యూరప్ అప్పు సంక్షోభం తీవ్రం కావడం పట్ల ఆందోళన, యూరప్ బ్యాంకులు సైతం బలహీనంగా తగులడడం, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన, బడ్జెట్ తగ్గింపుపై అమెరికా కాంగ్రెస్ లో ఏర్పడిన ప్రతిష్టంభన అన్నీ కలిసి గత కొన్ని వారాలనుండి మార్కెట్లను బలహీనపరిచాయి. స్టాక్ మార్కెట్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి. రికవరీకి సంబంధించిన కొత్త ప్రమాదకర దశలో అడుగుపెడుతున్నామనీ కనుక అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్ధలు గల దేశాలు అందుబాటులో ఉన్న అన్ని పరికరాలను ఉపయోగించి వృద్ధిని పట్టాలెక్కించాలని ఐ.ఎం.ఎఫ్ ఎం.డి క్రిస్టీన్ లాగార్డే కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. తలా ఒక మాట, మార్గం, పరిష్కారం చూపుతున్నప్పటికీ అవన్నీ గతంలో అమలు చేసి విఫలం చెందినవే కావడం గమనార్హం.

పెట్టుబడిదారీ వ్యవస్ధకు ఇప్పటిలాగా మున్నెన్నడు ఇలాంటి సవాళ్లు ఎదురుకాకపోవడంతో అదిప్పుడు పూర్తిగా అయోమయంలో పడిపోయింది. చేసినవే చేస్తూ, చెప్పినవే చెబుతూ ఏవో కొత్తది చెబుతున్నట్లుగా తమను తామే మోసం చేసుకుంటూ అంతిమంగా ప్రజలపైన పెనుభారాన్ని ప్రభుత్వాలు మోపుతున్నాయి. వివిధ సందర్బాలలో, సందర్భాన్ని బట్టి పేర్లు మార్చడం తప్ప తమ చర్యల అంతిమ ఫలితం ప్రజలను బాదడమే అన్న అంశాన్ని అవి సమర్ధవంతంగా దాచిపెడుతున్నాయి. అమెరికా, యూరప్ ల ప్రజలు పరిస్ధితిని తమ చేతుల్లోకి తీసుకుంటే తప్ప ప్రజలకు అనుకూలమైన పరిష్కారాలు లభించవు.

వ్యాఖ్యానించండి