పునరద్భవిస్తున్న కార్మికవర్గం, చైనా విప్లవం భవిష్యత్తు -1


(పాఠకులకు గమనిక: అమెరికానుండి వెలువడే ‘మంత్లీ రివ్యూ’ పత్రికలో మింషి లీ రాసిన ఆంగ్ల రచనకు ఇది యధాతధ అనువాదం. రచయిత 1990-92 కాలంలో చైనాలో రాజకీయ ఖైదీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన యూనివర్సిటీ ఆఫ్ ఉతా, (సాల్ట్ లేక్ సిటి) లో ఎకనమిక్స్ బోధిస్తున్నాడు. మావో కాలంనాటి చైనాలోని సోషలిస్టు వ్యవస్ధ, ఇప్పటి పెట్టుబడిఉదారీ వ్యవస్ధలను తులనాత్మకంగా ఈ వ్యాసం పరిశీలిస్తుంది. సైద్ధాంతిక వ్యాసం అయినందున కొంత కఠినంగా ఉండవచ్చు.)

జులై 2009లో జిలిన్‌లోని తొంఘువా స్టీల్ కంపెనీ కార్మికులు పెద్ద ఎత్తున ప్రవేటీకరణ వ్యతిరేక నిరసన నిర్వహించారు. అనంతరం 2010 వేసవిలో, చైనా కోస్తా తీరం వెంబడి ఉన్న రాష్ట్రాలను ఒక సమ్మెల వెల్లువ ముంచెత్తింది. ఈ ఘటనలు చారిత్రక మలుపుగా రుజువయ్యే అవకాశం ఉంది. దశాబ్దాల తరబడి ఓటమి, వెనకడుగు, నిశ్శబ్దంల తర్వాత చైనా కార్మిక వర్గం నూతన సామాజిక, రాజకీయ శక్తిగా పునరుజ్జీవనం చెందుతోంది.

చైనా కార్మిక వర్గ పునరుజ్జీవనం చైనా, ప్రపంచంల భవిష్యత్తును ఎలా రూపుదిద్దబోతున్నది? పెట్టుబడిదారీ వ్యవస్ధను కాపాడుకుంటూనే, చైనా పెట్టుబడిదారీ వర్గం కార్మిక వర్గం నుండి ఎదురయ్యే సవాళ్ళను కూడా కొనసాగించగలుగుతుందా (accommodate)? లేక చైనా కార్మిక వర్గ పునరుజ్జీవనం నూతన సోషలిస్టు విప్లవానికి దారితీసి తద్వారా ప్రపంచ సోషలిస్టు విప్లవానికి దారులు వేస్తుందా? ఈ ప్రశ్నలకు వచ్చే జవాబులు 21వ శతాబ్దంలో ప్రపంచ చరిత్ర ప్రయాణ మార్గాన్ని చాలావరకూ నిర్దేశిస్తాయి.

కార్మికవర్గ ఓటమి, చైనా పెట్టుబడిదారీ విధానం విజయం

చైనాలోని మెజారిటీ ప్రజలను, దేశీయ ఫ్యూడల్ భూస్వాములు, పెట్టుబడిదారులు, విదేశీ సామ్రాజ్యవాదుల దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కదిలించడం పైన, 1949 నాటి చైనా విప్లవం ఆధారపడి ఉంది. మావోయిస్టు కాలంలో చైనా, “సోషలిస్టు” దేశంగా చెప్పడానికి తగిన అర్హతను సంపాదించుకుంది. అన్ని చారిత్రక పరిమితులను పరిగణలోకి తీసుకుంటూనే, ముఖ్యంగా ఉపరితల (periphery) మరియు అర్ధ-ఉపరితల (semi-periphery) అంశాలకు సంబంధించినంతవరకూ, పెట్టుబడిదారీ రాజ్యంలో సహజంగా ఉండే లక్షణాలుగా కంటే, కార్మిక వర్గం విప్లవకర మరియు విప్లవకరేతర వర్గాలుగా పిలవబడడానికే చైనాలోని అంతర్గత వర్గ సంబంధాలు ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి.

చారిత్రాత్మక మావోయిస్టు విజయాలు ఉన్నప్పటికీ, చైనా, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధలో భాగంగానే కొనసాగింది. పెట్టుబడిదారీ వ్యవస్ధ మౌలిక గతి సూత్రాల పరిధిలోనే చైనా వ్యవస్ధ బలవంతంగా కొనసాగింది. పెట్టుబడి పోగుబడడానికీ తద్వారా పారిశ్రామికీకరణ సాధించడానికీ వీలుగా, రాజ్యం చేతిలో ఆర్ధిక మిగులు కేంద్రీకృతమయ్యింది. ఫలితంగా ఇది నూతన బ్యూరోక్రటిక్-టెక్నోక్రాటిక్ ఉన్నతవర్గం జనించడానికి అనుకూలమైన భౌతిక పరిస్ధితులను సృష్టించింది. ఈ నూతన వర్గం అంతకంతకూ ఎక్కువ భౌతిక వసతులనూ, రాజకియ శక్తినీ డిమాండ్ చేయడం ప్రారంభించింది. నూతన వర్గం, కమ్యూనిస్టు పార్టీలోనే తమ రాజకీయ ప్రతినిధులను ఏర్పరుచుకున్నారు. వారే, “అధికారంలోనూ, పార్టీలోనూ ఉన్న పెట్టుబడిదారీ మార్గ నిర్దేశకులుగా” (చైనాలో ఉన్న సాధారణ పదబంధం ఇది) ఆవిర్భవించారు.

కార్మికులు, రైతులు, విద్యార్ధులకు నేరుగా అప్పీలు చేయడం, కదిలించడం ద్వారా పెట్టుబడిదారీ పునరుద్ధరణవైపుకి మళ్ళిన ధోరణిని వెనక్కి తిప్పడానికి, మావో జెడాంగ్, ఆయన విప్లవ కామ్రేడ్లు ప్రయత్నించారు. కానీ రాజకీయంగా అనుభవం లేక అయోమయంలో ఉన్న కార్మికులు, రైతులు నేరుగా తమ ఆర్ధిక, రాజకీయ శక్తిని వినియోగించడానికి సిద్ధంగా లేరు. 1976లో మావో మరణానంతరం, డెంగ్ గ్జియావోపింగ్ నేతృత్వంలోని పెట్టుబడిదారీ పధ నిర్దేశకులు విప్లవ వ్యతిరేక కుట్ర నిర్వహించి, మావోయిస్టు నాయకులను అరెస్టు చేశారు. మరి కొద్ది సంవత్సరాలలోనే డెంగ్ గ్జియావో పింగ్ తన రాజకీయ అధికారాన్ని స్ధిరపరచుకున్నాడు. ఫలితంగా చైనా, పెట్టుబడిదారీ వ్యవస్ధగా మార్పు చెందడానికి మార్గం సుగమం అయ్యింది.

ఆర్ధిక సంస్కరణలు గా పేర్కొన్న విధానాలు గ్రామాల్లో ప్రారంభమయ్యాయి. ప్రజా కమ్యూన్లను కూల్చివేసి వ్యవసాయాన్ని ప్రవేటీకరించారు. తదనంతరం కొనసాగిన సంవత్సరాలలో కొన్ని వందల మిలియన్ల గ్రామీణ కార్మికులు మిగులు కార్మికులుగా తేలారు. వారు స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారీ సంస్ధల దోపిడీకి అందుబాటులోకి తేబడ్డారు.

1990లలో పెద్ద ఎత్తున ప్రవేటీకరణను చేపట్టారు. దాదాపు అన్ని చిన్న, మధ్య తరహా పరిశ్రమలనూ, కొన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలోని పెద్ద పరిశ్రమలను ప్రవేటీకరించారు. వీటన్నింటినీ, కృత్రిమంగా నిర్ణయించిన అతి తక్కువ ధరలకి అమ్మడమో లేదా ఉచితంగా ఇచ్చేయడమో చేశారు. ఇలా లబ్ది పొందినవారిలో ప్రభుత్వాధికారులు, పాత ప్రభుత్వరంగ సంస్ధల మేనేజర్లు, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న ప్రవేటు పెట్టుబడిదారులు, టి.ఎన్.సి (ట్రాన్స్‌నేషనల్ కార్పొరేషన్స్) ఉన్నారు. పర్యవసానంగా పెద్ద ఎత్తున “ప్రారంభ సంచయం” (primitive accumulation – పెట్టుబడిదారీ వ్యవస్ధ ద్వారా పెట్టుబడి పోగుబడడం కాకుండా, ఇతర మార్గాల ద్వారా ‘పెట్టుబడిదారీ వ్యవస్ధ ప్రాధమిక అభివృద్ధికి’ అవసరమైన పెట్టుబడి పోగుబడడం) పూర్తయింది. ప్రభుత్వ, సహకార రంగాల ఆస్తులను కొల్లగొట్టడం పైన ఆధారపడిన  నూతన పెట్టుబడిదారి వర్గం ఆవిర్భవించింది. దానితోపాటు ప్రభుత్వ, సహకార రంగాల కార్మికులను పదుల మిలియన్ల (కోట్ల) సంఖ్యలో పనినుండి తొలగించడంతో వారు దరిద్రంవైపుకి నెట్టబడ్డారు.

ఈ నూతన పెట్టుబడిదారీ వర్గ చట్టబద్ధతను కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం గుర్తించింది. 2002 లో జరిగిన 16వ పార్టీ కాంగ్రెస్‌లో పార్టీ చార్టర్‌ను సవరించారు. పాత ఛార్టర్ ప్రకారం, వేతన కార్మికుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే పాత్రలో కార్మికవర్గానికి కమ్యూనిస్టు పార్టీ చోదక శక్తిగా పరిగణించబడింది. సవరించబడిన ఛార్టర్ ప్రకారం, “విశాల ప్రజారాశులకు,” “అత్యంత పురోభివృద్ధి చెందిన ఉత్పాదక శక్తులకు” రెండింటి ప్రయోజనాలకూ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిగా పరిగణించబడింది. “అత్యంత పురోభివృద్ధి చెందిన ఉత్పాదక శక్తులు” అన్న పదబంధం నూతన పెట్టుబడిదారీ వర్గానికి పెట్టిన పేరని అంతా భావించారు.

చైనా కార్మికవర్గం ఎదుగుదల

చైనా మొత్తం ఉపాధిలో వ్యవసాయేతర ఉపాధి వాటా1980 లో 31 శాతం ఉండగా, అది 2000 నాటికి 50 శాతానికీ, 2008 కల్లా 60 శాతానికీ పెరిగింది. 2002లో ‘చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం, వ్యవసాయేతర కార్మికులలో 80 శాతం మంది ‘పారిశ్రామిక కార్మికులు, సేవలరంగ కార్మికులు, గుమస్తా కార్మికులు, నిరుద్యోగులు’ లాంటి వేతన శ్రామికులుగా మార్చబడిన (proletarianized) వారేనని తేలింది. వ్యవసాయేతర కార్మికులలో అత్యధిక భాగం, జీవించడానికి శ్రమను అమ్ముకోవడం తప్ప మార్గాంతరం లేని వేతన కార్మికులు అయినందున, వ్యవసాయేతర ఉపాధి వేగంగా పెరగడం అనేది వేతన శ్రామికులుగా మార్చబడిన కార్మికవర్గం పెద్ద ఎత్తున ఏర్పడిందని సూచిస్తున్నది.

కొన్ని వందల మిలియన్ల సంఖ్యలో (పదుల కోట్లు) ఉన్న చైనా కార్మికులను నిర్దయగా దోపిడి చేయడం పైననే చైనాలో వేగంగా ఏర్పడిన పెట్టుబడి సంచయం (పెట్టుబడి పోగుబడడం) ఆధారపడి కొనసాగింది. 1990 నుండి 2005 వరకూ గడిచిన కాలంలో చైనా శ్రామికవర్గ ఆదాయం, జిడిపిలో 50 శాతం నుండి 37 శాతానికి పడిపోయింది. ఇతర దేశాలతో చైనా కర్మికవర్గ ఆదాయాన్ని పోల్చి చూస్తే, అమెరికా కార్మికవర్గ ఆదాయంలో చైనా కార్మికవర్గ వేతన రేటు కేవలం 5 శాతం మాత్రమే. అదే దక్షిణ కొరియా కార్మికు;అ వేతనంలో 6 శాతం, మెక్సికో కార్మికుల వేతనంలో 40 శాతం వేతన రేటుని చైనా కార్మికులు కలిగి ఉన్నారు.

1980ల ప్రారంభం నుండీ 150 మిలియన్ల మందికి (15 కోట్లు) పైగా వలస కార్మికులు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు ఉపాధిని వెతుక్కుంటూ వలస వచ్చారు. చైనాలోని ఎగుమతి తయారీ పరిశ్రమ అంతా అత్యధిక భాగం ఈ వలస కార్మికులను దోపిడి చేయడం పైనే ఆధారపడి ఉన్నది. పెరల్ నదీ పరివాహాక ప్రాంతంలో (గువాంగ్ ఝౌ, షెన్‌జెన్, హాంగ్‌కాంగ్ లు దీనికిందికి వస్తాయి) ఒక అధ్యయనం జరిగింది. వలస కార్మికులలో మూడింట రెండొంతులు రోజుకి ఎనిమిది గంటలకు పైగా పని చేశారనీ, వారెప్పుడు వారాంతాలలో సెలవు తీసుకోలేదనీ ఆ అధ్యయనంలో తేలింది. కొంతమంది కార్మికులు తెంపు లేకుండా 16 గంటలవరకూ పని చేస్తారని తెలిసింది. పెట్టుబడిదారీ మేనేజర్లు, కార్మికులను క్రమశిక్షణలో పెట్టడానికి శారీరక, భౌతిక శిక్షలను అమలు చేయడం చాలా సాధారణంగా అమలు చేస్తారు. 200 మిలియన్ల (20 కోట్లు) మంది చైనా కార్మికులు ప్రమాదకర పరిస్ధితుల్లో పని చేస్తున్నారు. చైనాలో ప్రతి సంవత్సరం కార్మికుల పనికి సంబంధించిన గాయాలు 700 మిలియన్ల వరకూ ఉంటున్నాయి. వారిలో వంద వేల (లక్ష) మందికి పైగా జీవితాలను చాలిస్తున్నారు.

పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసే పోరాటం వివిధ దశలలో అభివృద్ధి చెందిందని మార్క్స్, ఏంగెల్స్ లు ‘కమ్యూనిస్టు మానిఫెస్టో‘ లో వాదించారు. మొదట, పెట్టుబడిదారుల చేత నేరుగా దోపిడీ చేయబడిన వ్యక్తులు వ్యక్తిగతంగా పోరాటం సాగించారు. పెట్టుబడిదారీ పరిశ్రమ అభివృద్ధి చెందడంతో వేతన కార్మికుల సంఖ్య పెరిగి పెద్ద సంఖ్యలో కేంద్రీకరించబడ్డారు. కార్మికుల శక్తి పెరిగి, పెట్టుబడిదారులను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి యూనియన్లు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. చైనాలో ఈనాడు అదే గతి సూత్రం అమలు జరుగుతున్నది. అంతకంతకూ మరింతమంది వలస కార్మికులు పట్టణాలలో స్ధిరపడుతూ, తమను తాము రైతులుగా కంటే, వేతన కార్మికులుగానే గుర్తించడం పెరుగుతున్న కొద్దీ, అంతకంతకూ ‘వృద్ధి చెందుతున్న వర్గ దృక్పధంతో’ కూడిన ఒక నూతన వేతన కార్మిక వర్గం ఆవిర్భవిస్తున్నది. ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్లు, ప్రధాన స్రవంతి మీడియాలు రెండూ “రెండవ తరం వలస కార్మికులు” పెరుగుతుండడాన్ని గుర్తిస్తున్నారు.

చైనాలోని ప్రధాన స్రవంతి మీడియా వివరణ ప్రకారం ప్రస్తుతం చైనాలో 1980 తర్వాత పుట్టిన రెండవ తరం వలస కార్మికులు వంద మిలియన్లు (పది కోట్లు) ఉన్నారు. వారిలో చాలా మంది హైస్కూలు లేదా మిడిల్ స్కూల్ విద్య పూర్తి చేసిన వెంటనే పట్టణాలకు వలస వచ్చారు. వీరిలో చాలా మందికి వ్యవసాయ ఉత్పత్తిలో అనుభవం లేదు కూడా. వారు తమను తాము గ్రామాల కంటే పట్టణలతోనే ఎక్కువగా గుర్తించుకుంటారు. మొదటి తరం వలస కార్మికులతో పోలిస్తే రెండవ తరం వారు మెరుగైన విద్య పొంది ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కనుక వారు తమ ఉపాధిపైన అధిక అంచనాలను పెట్టుకుంటారు. వారు మెరుగైన బౌతిక, సాంస్కృతిక జీవన ప్రమాణాలను డిమాండ్ చేస్తారు. కఠినమైన పని పరిస్ధితులను భరించడానికి తక్కువ సిద్ధంగా ఉంటారు.

2010 వేసవి కాలంలో, చైనాలో ఆటో, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్ రంగాలలో డజన్ల కొద్దీ సమ్మెలు చోటు చేసుకున్నాయి. వాటి వలన పెట్టుబడిదారులు వేతనాల పెంపుదలను అంగీకరించక తప్పలేదు. తీవ్రమైన సమ్మెల చెలరేగే కాలంలోకి చైనా అడుగుపెడుతున్నదనీ, అది చైనాకు ప్రత్యేకమైన చౌకగా శ్రమశక్తి లభించే కాలాన్ని అంతమొనర్చగలదనీ తద్వారా చైనాలో ‘సామాజిక స్ధిరత్వం’ భంగం కలిగే ప్రమాదం ఎదురవుతుందనీ, ప్రధాన స్రవంతి చైనా స్కాలర్లు ఆందోళన చెందుతున్నారు.

కార్మిక వర్గ సంఘాల ఎదుగుదలకు అనుకూలమైన వస్తుగత పరిస్ధితులను పెట్టుబడిదారీ అభివృద్ధే స్వయంగా సిద్ధం చేస్తున్నది. అనేక సంవత్సరాలపాటు వేగవంతమైన పెట్టుబడి సంచయం (పోగుపడడం) జరిగాక, చైనా గ్రామీణ ప్రాంతాలలోని చౌక శ్రమశక్తి తగ్గిపోవడం ప్రారంభమయ్యింది. చైనాలో మొత్తం ‘శ్రమ చేయగల వయసు’ గల జనాభా (15 సం నుండి 60 సం. వయసుగల వారు) సంఖ్య 2012 లో అత్యధిక సంఖ్య 970 మిలియన్లు లేదా 97 కోట్లకు చేరుకుని 2020 నాటికి 940 మిలియన్లకు లేదా 94 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. చౌకయిన, నైపుణ్యం లేని శ్రమలో ఎక్కువ భాగాన్ని అందించే, ప్రధాన వయసులో (19 – 22 సం.ల మద్య వయసు గలవారు) ఉన్న శ్రామికులు 2009లో 100 మిలియన్లు లేదా 10 కోట్ల నుండి 2020 నాటికి 50 మిలియన్లు లేదా 5 కోట్లకు తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధాన శ్రామిక వయసుగల కార్మికుల సంఖ్య వేగంగా తగ్గడం వలన, అది యువ కార్మికుల బేరమాడే శక్తిని మరింత పెంచే అవకాశం ఉందనీ, తద్వారా మరింత శాశ్వత కార్మిక వర్గ సంఘాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రోత్సాహం అందుతుందని భావిస్తున్నారు.

బ్రెజిల్, దక్షిణ కొరియాలలో 1970లు, 1980ల మధ్య, అక్కడి ఉపాధిలో వ్యవసాయేతర ఉపాధి (వేతన కార్మికులుగా మార్పు జరుగుతున్నదనడానికి దగ్గరి సూచిక) భాగం, 70 శాతానికి పైగా పెరిగినప్పుడే, కార్మిక వర్గ ఉద్యమం శక్తివంతమైన సామాజిక, రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. అటువంటి పరిణామమే ఇప్పుడు ఈజిప్టులో జరుగుతున్నది.

చైనాలో మొత్తం ఉపాధిలో, వ్యవసాయేతర ఉపాధి భాగం ఇప్పుడు 60 శాతం ఉంది. 1980 నుండి 2008 వరకు చైనాలో వ్యవసాయేతర ఉపాధి భాగం సవంత్సరానికి ఒక శాతం చొప్పునపెరుగుతూ వచ్చింది. అదే ధోరణి చైనా కొనసాగించినట్లయితే, అపుడు చైనా వ్యవసాయేతర ఉపాధి భాగం కీలక పరిమితి 70 శాతాన్ని, 2020 నాటికి దాటుతుంది.

రానున్న ఒకటి, రెండు దశాబ్దాలలో చైనా కార్మిక వర్గం శక్తివంతమైన సామాజిక, రాజకీయ శక్తిగా ఎదగనున్న నేపధ్యంలో, చైనా కార్మిక వర్గ ఉద్యమం ఏ రాజకీయ దిశవైపుగా పపయనిస్తుందన్నదే కీలక ప్రశ్నగా తలెత్తుతుంది. వివిధ సామాజిక వర్గాల మధ్య రాజీలు కుదర్చడం ద్వారా, సో కాల్డ్ సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించాలన్నది ప్రస్తుతం చైనా ప్రభుత్వ అధికారిక విధానం. చైనా పాలకులలోని ఉన్నతవర్గంలోని కొన్ని సెక్షన్లు, కార్మికవర్గం నుండి ఎదురవుతున్న సవాలుని నీరుగార్చి, దారి మళ్ళించడానికి పశ్చిమ దేశాల తరహా బూర్జువా ప్రజాస్వామ్యాన్ని తెచ్చే ‘రాజకీయ సంస్కరణలు’ ప్రవేశపెట్టాలని పిలుపునిస్తున్నారు.

పెట్టుబడిదారీ వ్యవస్ధకు చెందిన మౌలిక ఆర్ధిక రాజకీయ క్రమాన్ని కొనసాగిస్తూనే, చైనా పెట్టుబడిదారీ వర్గం, కార్మిక వర్గ సవాళ్ళకు చోటు కల్పించడంలో నెగ్గుకు రాగలదా? లేక చైనా కార్మికవర్గ ఉద్యమం ప్రపంచ చారిత్రాత్మక విజయాలను నమోదు చేస్తూ, విప్లవకర సోషలిస్టు పంధాను ఎంచుకుని, ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవస్ధతో తెగతెంపులు చేసుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వస్తుగత మరియు విషయగతమైన చారిత్రాత్మక పరిస్ధితులపై ఆధారపడి ఉంటాయి.

సోషలిస్టు వారసత్వం: ప్రభుత్వరంగ కార్మిక వర్గం

మావోయిస్టు సోషలిస్టు యుగంలో,

చైనా కార్మికులు, ఏ పెట్టుబడిదారీ రాజ్యంలోనైనా సరే, సగటు కార్మికుడు ఊహించనలవి కాని ఒక స్ధాయి వర్గాధికారాన్నీ, గౌరవాన్నీ అనుభవించారు (ముఖ్యంగా, ఉపరితల మరియు అర్ధ ఉపరితలాల సందర్భంలో – అంటే కార్మికవర్గ వర్గాధికారం ఉపరితలం నుండి పునాదివరకూ చొచ్చుకొని పోవాలన్నది ఆశయమైతే, అది చైనాలో మావో కాలంలో, ఉపరితలం స్ధాయినుండి, ఉపరితలం-పునాదిల మధ్య పొర అయిన అర్ధ-ఉపరితలం వరకూ చొచ్చుకెళ్ళగలిగిందని రచయిత చెప్పదలిచి ఉండవచ్చు -అనువాదకుడు.) అయితే, చైనా కార్మికవర్గం యౌవనంలో ఉంది. దానికి అనుభవం లేదు. మావో మరణానంతరం, చైనా కార్మికవర్గం, నాయకుడు లేకుండా వదిలివేయబడి, 1990లలో పెద్ద ఎత్తున జరిగిన ప్రవేటీకరణలో వినాశనకరమైన ఓటమిని ఎదుర్కొన్నది.ప్రభుత్వరంగ కార్మికులు (వీరిని చైనాలో “పాత కార్మికులు” అంటారు) అప్పటినుండి ప్రవేటీకరణకూ, పెద్ద ఎత్తున జరిగిన మూసివేతలకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలను నిర్వహించారు.  వారి పోరాటాలు, తొలగించబడిన కార్మికులపైనే కాకుండా ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉపాధి పొందుతున్న కార్మికులపై కూడా ప్రభావం పడవేశాయి. ఇది చైనాలోని వేతన శ్రామికులుగా మార్చబడ్డవారిలోని ఒక సెక్షన్ -ప్రభుత్వరంగ వేతన శ్రామికులు- లో గణనీయమైన స్ధాయిలో సోషలిస్టు చైతన్యమే కాకుండా వర్గ చైతన్యాన్ని కూడా పెరగడానికి దోహదం చేసింది.

ఒక ప్రముఖ చైనా కార్మికవర్గ కార్యకర్త మాటల్లో చెప్పాలంటే, ఇతర పెట్టుబడిదారీ దేశాలలోని కార్మిక వర్గాలతో పోలిస్తే, చైనా ప్రభుత్వరంగ కార్మికవర్గం “సాపేక్షికంగా పూర్తి వర్గ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోగలిగింది. సోషలిస్టు మరియు పెట్టుబడిదారీ కాలాలు రెండింటిలోనూ దానికి ఉన్న ప్రత్యేక చారిత్రాత్మక అనుభవం వలన ఇది సాధ్యమయ్యింది.

ఈ చారిత్రాత్మక అనుభవం వలన, చైనా ప్రభుత్వరంగ కార్మిక వర్గ పోరాటాలు తరుచుగా తక్షణ ఆర్ధిక డిమాండ్లవరకే పరిమితం కాలేదు.

వ్యక్తిగత పెట్టుబడిదారుల దోపిడీ వల్లనే కాక, ఇంకా మౌలికమైన స్ధాయిలో, సోషలిజంపై పెట్టుబడిదారీ విధానం తాత్కాలికంగా విజయం సాధించిన ఒక పెద్ద వర్గ యుద్ధంలో, ఎదురైన చారిత్రాత్మక ఓటమి ఫలితంగా కూడా ప్రస్తుత పరిస్ధితులు ఏర్పడ్డాయని చాలామంది కార్మికవర్గ కార్యకర్తలు అర్ధం చేసుకున్నారు.తొలగించబడిన కార్మికుల నాయకుడొకరు ఇలా పేర్కొన్నాడు, “సోషలిజం నీడలో, కార్మికులే ఫ్యాక్టరీ యజమానులు. కార్మికులు ఒకే వర్గంలో సోదరులు, సోదరీమణులు. పెద్ద ఎత్తున ఉద్యోగాలనుండి తొలగించడం సంభవించి ఉండేది కాదు. కానీ ప్రవేటీకరణ తర్వాత, కార్మికులు వేతన కార్ముకులుగా దిగజార్చబడ్డారు. వారిక ఎంతమాత్రం యజమానులు కాదు. పెద ఎత్తున ఉద్యోగాల తొలగింపుకు ఇదే నిజమైన కారణం.” ఈ నాయకుడు ప్రకారం, కార్మికవర్గ పోరాటాలు వ్యక్తిగత కేసులకే పరిమితమై ఉండకూడదు. లేదా నిర్ధిష్ట డిమాండ్లు పరిష్కారం అవడంతోనే సంతృప్తి చెందకూడదు. కార్మికుల “మౌలిక ప్రయోజనాలు”, “ఉత్పత్తి సాధనాలపై ప్రభుత్వ యాజమాన్యం” ద్వారానే పునరుద్ధరింపబడతాయి.

10 thoughts on “పునరద్భవిస్తున్న కార్మికవర్గం, చైనా విప్లవం భవిష్యత్తు -1

  1. “కార్మికుల “మౌలిక ప్రయోజనాలు”, “ఉత్పత్తి సాధనాలపై ప్రభుత్వ యాజమాన్యం” ద్వారానే పునరుద్ధరింపబడతాయి.”
    మీరు అనువదించిన వ్యాసం పూర్తిగా చదివాను. చైనా గత ప్రస్తుత పరిస్థితులపై మంచి అవగాహన కలిగిస్తోంది.

    దీని తరువాయి భాగంలో ఉత్పత్తి సంబంధాల మౌలిక పరివర్తన గురించి ప్రస్తావిస్తారనుకుంటున్నాను. ఎందుకంటే “ఉత్పత్తి సాధనాలపై ప్రభుత్వ యాజమాన్యం” వరకే మార్పు ఆగిపోతే ఏం జరుగుతుందో సోవియట్ యూనియన్, చైనా తదితర సోషలిస్ట్ దేశాలలోని పరిణామాలు మంచి అనుభవాన్నేఇచ్చాయి. ఉత్పత్తి సంబంధాల్లో మౌలిక విప్లవం జరగనిదే.. ఉత్పత్తి ప్రక్రియలో కార్మికులకు నిజమైన అధికారం, పాత్ర ఏర్పడనిదే రష్యా, చైనాల్లో ప్రభుత్వరంగ సంస్థలకు, భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు మధ్య పెద్ద తేడా కనిపించదు.

    1930ల నుంచి సోవియట్ యూనియన్‌లో కర్మాగారాలపై కమ్యూనిస్టు పార్టీ దొరల ఆధిపత్యమే నడిచిందని గ్రేట్ డిబేట్ డాక్యుమెంట్లు, 1960లలో మావో రచనలు చెబుతున్నాయి. ఈ కామ్రేడ్ దొరల ఆధిపత్యాన్ని అంతమొందించడానికే చైనాలో సాంస్కృతిక విప్లవం మొదలై మధ్యలోనే పక్కదోవ పట్టిందని కూడా విశ్లేషణ జరిగింది. ఫ్యాక్టరీలను, సమిష్టి వ్యవసాయ కేంద్రాలను మేనేజర్లు, పార్టీ బాస్‌లు నడపాలా లేదా కార్మికులు నిజమైన అర్థంలో వాటిని నిర్వహించాలా అనే వైరుధ్యాన్ని పరిష్కరించే క్రమంలోనే 20వ శతాబ్ది సోషలిజం విఫలమైందని ఇప్పటికే మనం చదువుకున్నాం కూడా.

    ఏది ఏమైనా ఈ వ్యాసం రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. డాక్టర్ ఎపి విఠల్ ఈరోజు ఆంధ్రజ్యోతిలో “చైనా కమ్యూనిస్టుల పయనమెటు” అనే వ్యాసం రాశారు. చూశారనుకుంటున్నాను. చైనాకమ్యూనిస్టు పార్టీ 91వ వార్షికోత్సవ సభ మావో చేసిన చాలా తప్పులను ఇన్నాళ్లుగా భరిస్తూ వచ్చామని తేల్చి పడేసిందట. మావోను ఏమన్నా చెల్లుబాటయ్యేంతగా చైనాలో పెట్టుబడిదారీ మార్గేయులు బలపడిపోయారన్నమాట.

    మంచి వ్యాసం అనువదించినందుకు అభినందనలు. రెండో భాగం కూడా త్వరగా అనువదించి ప్రచురించండి.

  2. విశేఖర్,
    పునరుద్భవిస్తున్న కార్మికవర్గం, చైనా విప్లవ భవిష్యత్తు ఆర్టికల్ చదివాను. బాగుంది. ఆర్టికల్ తేలికగానే అర్ధమవుతోంది. నీ అనువాదం కూడా బాగుంది. అదనపు మిగులు పెట్టుబడిదారీ వర్గం ఉద్భవించడానికి దోహదపడింది. ఈ అనుభవం రష్యా న్యూ ఎకనమిక్ పాలసీలోనే నాయకత్వంకి ఉంది. చైనాలో కూడా మావో కొంత ప్రయత్నం చేసినా పార్టీలో రివిజనిజం పైచేయి సాధించి రివల్యూషనరీ పార్టీ దెబ్బతిన్నది. గ్రేట్ డిబేట్ లో అనేక విషయాలు అనుభవాలు ఉన్నా పార్టీ దెబ్బతిన్నది. మావొ టైంకే పార్టీలో అధికారిక పంధా మైనారిటీలో ఉంది అనికూడా చదివాను. అధికారిక పంధా వైఫల్యం వల్లనే రివిజనిజం తలెత్తింది అని విమర్శ కూడా ఉంది. ఏదేమైనా నేడు కార్మిక వర్గం తిరిగి పోరాటబాట పట్టడం శుభపరిణామం. అయితే ఈ ఉద్యమాలకి రివల్యూషనరీ శక్తులు నాయకత్వం వహించే స్ధితిలో లేవా? అసలు చైనాలొ ఎం.ఎల్ శక్తుల పరిస్ధితి ఏమిటి? ఆర్టికల్ ప్రింట్ నాకు తెలిసిన మిత్రులకు ఇస్తాను. రెండవ భాగం ఎప్పుడు పోస్ట్ చేస్తావు? -చిట్టిపాటి

  3. రాజశేఖరరాజు, చిట్టిపాటి గార్లకు.
    తరువాతి భాగం శనివారమే పోస్ట్ చేద్దామని అనుకున్నా. కాని కుదరలేదు. ఆదివారం తప్పకుండా అందిస్తాను.
    -విశేఖర్

  4. శ్రమ,శ్రామికుల గురించి తెలిపేదే కమ్యూనిజం.
    కేవలం ఇతరుల మీద బురదచల్లడం కోసం బ్లాగుల్ని మైంటేన్ చేస్తూ పోస్టులు రాస్తున్నారంటేనే అర్థమవుతుంది- వీరు ఎంత పనీపాటా లేనోళ్ళో. ఇక వీరికి శ్రామికుల గురించి తెలిసే సమస్యే లేదు, వదిలేయండి.

    “మూర్ఖులకి అజ్ఞానం ఇచ్చేంత ఆనందం మరేదీ ఇవ్వలేదు” Let them enjoy!!!

  5. మనిషన్నాక ఏదో ఒక దశలో తాను చేస్తున్నదేమిటో వెనక్కి తిరిగి చూసుకుంటారు. అప్పుడైనా సవరించుకుంటారేమోనని ప్రయత్నం.
    మార్పుకి ముందుడేది, మార్పులను నడిపించేది ప్రధానంగా మనిషే గనక, వీరూ మనుషులే గనుక ప్రయత్నం చేస్తున్నా.
    ఆఫ్‌కోర్స్, ఫలితం నా చేతుల్లో లేదనుకోండి.

  6. Wow!!! What a great invention. Are u satisfied now? Have a nice day enjoying your great invention.
    Actually, both are correct. My mom calls me viji. My friend’s name is Viji Francis. If I said My mom calls me Viji Francis, I don’t think that makes much difference. But at least, u are amused, know.
    And you have a screen shot? Don’t waste your time on such petty things. I won’t run away from what I said, unless I forget.
    Further comments by you are not entertained here.

వ్యాఖ్యానించండి