అంకుల్ శామ్ కౌబాయ్ రూపంలో సవారి చేయడానికి ఇప్పుడు గుర్రాలు అవసరం లేదు. గుర్రాల శక్తికి పరిమితి ఉంది. వాటికి తిండి పెట్టాలి. రెస్ట్ కావాలి. కౌబాయ్ కూడా శ్రమ పడాలి. కాని ఆధునిక గుర్రంపై సవారీకి అవేమీ అవసరం లేదు. అది వారానికి ఏడురోజులూ, రోజుకి ఇరవై నాలుగ్గంటలూ అలుపు సొలుపూ లేకుండా పని చేస్తుంది. కౌబాయ్ విశ్రాంతి తీసుకునే టైంలో కూడా పని చేస్తుంది. ప్రపంచంలోని ప్రతి మూలకీ ఏక కాలంలో ప్రయాణం చేస్తుంది. క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టివస్తుంది. అదే వార్త.
వార్తల్లో శ్రేష్ఠమైనది ‘బ్రేకింగ్ న్యూస్’. అటువంటివి రోజుకి నాలుగైదు సృష్టించి వదిలామంటే ప్రపంచమే పాదాక్రాంతం. అవి 9/11 దాడుల దోషులపై వార్తలు కావచ్చు. సద్దాం హుస్సేన్ ‘సామూహిక విధ్వంసక మారణాయుధాలు’ కావచ్చు. ఇరాన్ ‘అణు బాంబు’ కావచ్చు. ఒసామా బిన్ లాడేన్ తొరా బొరా గుహల్లో దాగున్నాడన్న పరిశోధనాత్మక కధనం కావచ్చు. లిబియాలో గడ్డాఫీ తన పౌరులపై చేసే దాడులు కావచ్చు. ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్ లలో అమెరికా సైనికుల అప్రతిహత పురోగమనం కావచ్చు. అబద్ధానికి ఇప్పుడు ఏదీ ఎక్కువా కాదు, తక్కువా కాదు. కావలసింది సంవత్సరాల తరబడి వార్తలు మోస్తున్న ఇరవై నాలుగ్గంటల వార్తా ఛానెల్. నిజం పుట్టకముందే పుట్టే అబద్ధానికి అదే సవారీ గుర్రం.
డబ్బులు పిండుకోగల కొత్త ఆవు కోసం వలతో ఆధునిక కౌబాయ్
–
కార్టూనిస్టు: హమీద్ కరౌట్,
—
