ఢిల్లీ హైకోర్టులో బాంబు పేలుడు, అఫ్జల్ గురు విడుదల కోసం? (అప్‌డేట్స్)


ఢిల్లీ హైకోర్టు వద్ద నాలుగు, ఐదవ గేట్ల మధ్య శక్తివంతమైన బాంబు పేలిన దుర్ఘటనలో మరణించినవారి సంఖ్య 11 కి పెరిగిందని హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఉదయం గం.10:14ని.లకు పేలిన ఈ బాంబు పేలుడు ఘటన ఢిల్లీలో నాలుగు నెలల్లో రెండవది. మే25 తేదీన, ఇదే హైకోర్టు ప్రాంగణంలో పాలిధీన్ కవర్ లో పెట్టిన తక్కువ తీవ్రతతో కూడిన బాంబు పేలింది. ఆ పేలుడులో ఆస్తి, ప్రాణ నష్టాలు జరగలేదు. ఓ కారు స్వల్పంగా దెబ్బతినడం తప్ప ఎవరూ గాయపడలేదు.

ఈ రోజు (బుధవారం) జరిగిన బాంబు పేలుడుకు మూడు నెలల క్రితం జరిగిన బాంబు పేలుడు ట్రయల్ రన్ గా ఇప్పుడు అనుమానిస్తున్నారు. రెండూ పేలుళ్ళూ ఒకే విధంగా జరిగాయని రీడిఫ్ వార్తల వెబ్‌సైట్ పేర్కొన్నది. హైకోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించడానికి పాస్‌ల కోసం, బాంబు పెట్టిన వ్యక్తి కూడా క్యూలో నిలబడి, బాంబు ఉంచిన సూట్ కేస్ ను అక్కడ పెట్టి ఉండవచ్చని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.

గాయపడిన 65 మందిలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారని హోం మంత్రి వర్గాలు తెలిపాయని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. బాంబు పేలుడికి బాధ్యత తమదేనంటూ హుజి (హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ) సంస్ధ ఒక ఉత్తరం పంపిందని ఒక టి.వి ఛానెల్ ప్రకటించింది. పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడు అఫ్జల్ గురుకి విధించిన ఉరిశిక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బాంబు పేల్చినట్లుగా ఆ సంస్ధ లేఖలో తెలిపిందని ఛానెల్ ప్రకటించింది.

బాంబు పేలుడు ఘటనపై విచారణ జరపవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ (ఎన్.ఐ.ఎ)ని ఆదేశించింది. హుజి చేసిన ప్రకటన నిజమైందీ లేనిదీ అప్పుడే చెప్పలేమని ఎన్.ఐ.ఎ అధిపతి సి.సిన్‌హా తెలిపాడు. ఇంకా స్పష్టమైన ఆధారాలేవీ లభ్యం కాలేదని తెలిపాడు. అయితే హుజీ సంస్ధ ఇండియాను ప్రధానంగా టార్గెట్ గా పెట్టుకున్న టెర్రరిస్టు సంస్ధ అని ఆయన వివరించాడు.

వ్యాఖ్యానించండి