ముంబై బాంబు పేలుళ్ళ అనంతరం టెర్రరిస్టులు మరోసారి తెగబడ్డారు. ఈ సారి ఢిల్లీని లక్ష్యంగా చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు వద్ద జరిగిన బాంబు పేలుళ్ళలో కనీసం 9 మంది మరణించగా, 65 మంది గాయపడ్డారు. పేలుళ్ళకు తామే బాధ్యులమని ‘తెహరీక్’ అనే సంస్ధ ప్రకటించినప్పటికీ కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఇప్పుడే చెప్పలేమని ప్రకటించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ బాంబు పేలుళ్ళు పిరికిపందల చర్య అని వ్యాఖ్యానించాడు. యధావిధిగా ‘మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ప్రధాని ప్రకటించాడు. లోక్ సభలో ఎల్.కె.అద్వాని ‘వరుసగా టెర్రరిస్టు దాడులు జరగడం బాధాకరమన్నారు. ఢిల్లీ హైకోర్టు నాలుగూ, ఐదవ గేట్ల మధ్య జరిగిన ఈ పేలుళ్ళతొ దేశం అంతా అప్రమత్తం అయ్యిందని వార్తా ఛానెళ్ళు తెలుపుతున్నాయి.
ఉదయం గం.10:15 ని.ల కు జరిగిన పేలుడువలన మృతుల శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. పేలుడు పరికరాన్ని ఒక బ్రీఫ్‌కేసులో పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. హైకోర్టు ప్రాంగణంలోకి వెళ్లడానికి పాస్‌ల కోసం దాదాపు రెండు వందలమంది కక్షిదారులు గేటువద్ద ఎదురు చూస్తుండడగా పేలుడు జరిగింది. తొమ్మిది మంది చనిపోయారనీ 47 మంది గాయపడ్డారని హోం మంత్రి చిదంబరం లోక్ సభలో ప్రకటించాడు. ఢిల్లీ హైకోర్టు వద్ద నాలుగు నెలల తేడాతో రెండో సారి జరిగిన బాంబు పేలుళ్లపై విచారణ బాధ్యతను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ (ఎన్.ఐ.ఎ) కి అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించాదు. బాంబు మధ్య నుండి అధిక తీవ్రతతో పేలిందని హోం సెక్రటరీ ఆర్.కె.సింగ్ చెప్పాడు. బాంబు పేలిన చోట పెద్ద గొయ్యి ఏర్పడిందని తెలిపాడు.
మెరుగుపరచబడిన పేలుడు పరికరం (Improvised Explosive Device – IED) పేలుడుకు ఉపయోగించినందున టెర్రరిస్టు దాడులనడానికి ఆస్కారం ఉందని ఆర్.కె.సింగ్ చెప్పాడు. బాంబుకి సంబంధించిన విడిభాగాలు ఇంకా బ్రీఫ్ కేసులోనే ఉన్నందున బాంబును బ్రీఫ్ కేసులో ఉంచినట్లు భావిస్తున్నామని చెప్పాడు. గత కొన్ని సంవత్సరాలుగా సామర్ధ్యాన్ని పెంచుకుంటూ టెర్రరిస్టు దాడులు జరగకుండా ఢిల్లీ పోలీసులు నిరంతరం అప్రపత్తతగా ఉంటున్నప్పటికీ పేలుళ్ళు జరగడం పట్ల చిదంబరం లోక్ సభలో విచారం వ్యక్తం చేశాడు. గూఢచార సంస్ధలు ఢిల్లీ పోలీసులతో నిరంతరం సమాచారం పంచుకుంటారని తెలిపాడు. కొన్ని గ్రూపుల చర్యలపై అందిన సమాచారాన్ని అలాగే జులైలో ఢిల్లీ పోలీసులకు అందించారని చెప్పాడు. ఈ దశలో పేలుళ్ల వెనుక ఖచ్చితంగా ఎవరు ఉన్నదీ చెప్పలేమని చిదంబరం లోక్ సభకు తెలిపాడు.
