ఇంగ్లండులో గృహ నిర్బంధంలో ఉన్న జులియన్ అస్సాంజ్, తాను వాస్తవ డిప్లొమేటిక్ కేబుల్స్ ను వాటి వాస్తవ రూపంలో పేర్లతో ప్రచురించక తప్పలేదని ఒక కార్యక్రమంలో తెలిపాడు. వీడియో కాల్ ద్వారా బెర్లిన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి జులియన్ ఈ విషయం తెలిపాడు. అమెరికా రాయబారులకు సమాచారం అందించిన వారి పేర్లను తొలగించి కేబుల్స్ ఇప్పటివరకూ ప్రచురించిన జులియన్ సంకేతపదం వేరొక చోట ప్రచురించబడడంతో మొత్తం రెండున్నర లక్షల కేబుల్స్ నూ ప్రచురించక తప్పలేదని బెర్లిన్ శ్రోతలకు తెలిపాడు. పేర్లు తొలగించకుండా జులియన్ కేబుల్స్ ను ప్రచురించడంతో పత్రికలు జులియన్ ను తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అమెరికా రాయబారులకు సమాచారం ఇచ్చిన వారి పేర్లు బైటపడినందువలన వారి ప్రాణాలకు ప్రమాదం తెచ్చినట్లయ్యిందని విమర్శించాయి.
ప్రపంచ వ్యాపితంగా వివిధ దేశాలలో అమెరికా తరపున రాయబారులుగా నియమించబడ్డ దౌత్యవేత్తలు తాము నియమించబడిన దేశాలలో గూఢచర్యం నెరిపి ఆ సమాచారాన్ని అమెరికా ప్రభుత్వ స్టేట్ డిపార్ట్‌మెంట్ కి కేబుల్స్ ద్వారా పంపిస్తున్నారనీ, గత నలభై సంవత్సరాలనుండి అ విధంగా పంపిన కేబుల్స్ వికీలీక్స్ కు అందాయనీ తెలిసిందే. గత వారంలో వికీలీక్స్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్, కేబుల్స్ అన్నిటినీ వాటి వాస్తవ రూపంలో పేర్లను మినహాయించకుండా ప్రచురించాడు. అమెరికా రాయబారులకు నిజాయితీగా (నీతిరాహిత్యంగా) తమ తమ దేశాల వివరాలను పంచుకున్న (వెల్లడించిన) వ్యక్తుల పేర్లు ఉండడం వలన వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడనుందనీ, జులియన్ అస్సాంజ్ అలా ప్రచురించకుండా ఉండవలసిందనీ పత్రికలు జులియన్ ను విమర్శిస్తున్నాయి.
నిజానికి జులియన్ ఒరిజినల్ పత్రాలను పేర్లతో సహా ప్రచురించాలని ఎన్నడూ భావించలేదు. గత వారం వరకూ విడుదల చేసిన అన్ని కేబుల్స్‌ను ఎడిటింగ్ చేశాకనే విడుదల చేసేలా ఐదు పత్రికలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. డెర్ స్పీగెల్ (జర్మనీ), న్యూయార్క్ టైమ్స్ (అమెరికా), గార్డియన్ (ఇంగ్లండ్), లె మాండె (ఫ్రాన్సు), ఎల్ పెయిస్ (స్పెయిన్) పత్రికలకు జులియన్ ఈ కేబుల్స్ ను గత సంవత్సరం నవంబరు నుండి ఇవ్వడం ప్రారంభించాడు. ఈ పత్రికలకు పూర్తిగా డాక్యుమెంట్లు ఇచ్చినప్పటికీ అవి వాటిని ప్రచురించడానికి కొనాళ్ల తర్వాత ఆసక్తి చూపడం మానేశాయి. ఇలా ఉండగా, గార్డియన్ పత్రికకు చెందిన విలేఖరి డేవిడ్ లీ కి ఒరిజినల్ పత్రాలను ఛేదించే (పాస్‌వర్డ్) సంకేత పదం పత్రిక యాజమాన్యం ఇవ్వడంతో జులియన్ వ్యూహానికి ఆటంకం ఏర్పడింది.
సంకేత పదాన్ని సదరు విలేఖరి ఒక చోట ప్రచురించడంతో జులియన్ అస్సాంజ్ కూ, ఆయన ఎన్నుకున్న పత్రికలకూ సంబంధం లేకుండానే ఒరిజినల్ కేబుల్స్ వెల్లడి కావడం మొదలైంది. జులియన్ అస్సాంజ్, ఆయన ఎన్నుకున్న పత్రికలు పేర్లు లేకుండా ప్రచురిస్తుండగా మరోచోట పేర్లతో ప్రచురించడం ఉపయోగం లేకుండా పోయింది. పైగా పేర్లతో ప్రచురించే సంస్ధలకు రీడర్‌షిప్ పరంగా అదనపు సానుకూలత లభించే పరిస్ధితి తలెత్తింది. ఈ నేపధ్యంలో తప్పని పరిస్ధితుల్లోనే ఒరిజినల్ పత్రాలను ప్రచురించక తప్పలేదని జులియన్ వివరించాడు. సంకేత పదాన్ని రహస్యంగా ఉంచాలనీ ఎట్టి పరిస్ధితుల్లోనూ ఎక్కడా ప్రచురించకూడదనీ తాను హెచ్చరించినప్పటికీ గార్డియన్ పట్టించుకోలేదని జులియన్ విమర్శించాడు. అయితే సంకేతపదం తాత్కాలికం మాత్రమెనని జులియన్ తమకు చెప్పాడని గార్డియన్ యాజమాన్యం చెబుతోంది.
పత్రాలను పూర్తిగా ప్రచురించడం వలన ఇప్పుడు పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదని జులియన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే దాదాపు సంవత్సరం గడిచినందున ఈ రోజు కోసం వారు తయారై ఉంటారనీ, అమెరికా సదరు వ్యక్తులను హెచ్చరించి ఉంటుందని అన్నాడు. బెర్లిన్ లోని ఐ.ఎఫ్.ఎ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ ఫెయిర్ లో జులియన్ తో మాటమంతీ వీడియో కాల్ ద్వారా ప్రసారం చేశారు. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ఇంగ్లండులోని నార్‌ఫ్లాక్ లో మిత్రుని ఇంటిలో గృహ నిర్భంధంలో ఉన్నాడు. ఆయన ఇంటినుండి కదల కుండా కాలికి ఎలక్ట్రానిక్ ట్యాగ్ కట్టారు. ఇంటి పరిసరాలను దాటి వచ్చినట్లయితే జులియన్ కాలికి ఉన్న ట్యాగ్ పోలీసులను హెచ్చరిస్తుంది. (హాలీవుడ్ సినిమా ‘ట్రాన్స్‌ఫార్మర్స్’ లో హీరోకి ఈ పరిస్ధితి ఎదురవుతుంది).
