బి.జె.పి పై రాస్తే వికీలీక్స్ అబద్ధం, మాయావతిపై రాస్తే పక్కా!


రాజకీయ పార్టీల ద్వంద్వ విలువలు భారత ప్రజలకి కొత్త కాదు. అయినా తమ ద్వంద్వ విధానాలు ప్రజలు మర్చిపోతారేమో అన్నట్లుగా సందర్భం వచ్చినప్పుడల్లా అవి తమ బుద్ధిని బైట పెట్టుకుంటూ ఉంటాయి. ద్వంద్వ ప్రమాణాల విషయంలో ఒక్కో పార్టీది ఒక్కో స్టైలు. కొంతమంది చాలా తెలివిగా ద్వంద్వ ప్రమాణాలు అని తెలియనంతగా చెలాయిస్తే, మరి కొందరు తాము నిన్నొక మాట అన్నామన్న సంగతి తామే మర్చిపోయినట్లుగా మరుసటి రోజే దానిని మార్చేస్తూ ఉంటారు. మీడియాపైకి నెట్టేయడం రాజకీయులకి గతంలో కుదిరేది కాని ఛానెళ్ళు వచ్చాక అది సాధ్యం కాదని తెలిసినా ఎంతో సహజంగా అబద్ధాలాడే రాజకీయ పుంగవులు మరికొందరు.

వికీలీక్స్ వెల్లడిస్తున్న అమెరికన్ డిప్లొమేటిక్ కేబుల్స్‌లో భారత దేశంలోని ముఖ్యమైన రాజకీయ పార్టీలన్నీ దాదాపుగా ప్రస్తావించబడ్డాయి. అమెరికన్ రాయబారులకి ఇరు దేశాల మధ్య సంబంధాలను పట్టాల మీద సవ్యంగా నడపడం విధులుగా నెరవేర్చడానికి బదులు, గూఢచర్యం నెరపడమే తమ పూర్తి కాల విధిగా నిర్వర్తిస్తున్న సంగతిని వికీలీక్స్ వెల్లడిస్తున్న కేబుల్స్ ద్వారా అర్ధమైపొయింది. ప్రస్తుత సందర్భం ఉత్తర ప్రదేశ్ లో ఒకప్పటి మిత్రులు బి.జె.పి, బి.ఎస్.పి పార్టీల గురించి.

గతంలో వెల్లడయిన ఒక కేబుల్ ప్రకారం బి.జె.పి నాయకుడు అరుణ్ జైట్లీ అమెరికా రాయబారితో తమ పార్టీ విధానం గురించి చులకనగా వ్యాఖ్యానించాడు. “హిందూ జాతీయవాదం అన్నది బి.జె.పి పార్టీ యొక్క ఒక అవకాశవాద సమస్య మాత్రమే” అని జైట్లీ తనతో అన్నట్లుగా అమెరికా రాయబారి, తమ ప్రభుత్వానికి పంపిన కేబుల్ లో రాశాడు. ఆ కేబుల్ బైటపడిన వెంటనే దానిని అరుణ్ జైట్లీ ఖండించాడు. అయితే ఆయన కేబుల్ మొత్తాన్ని ఇతరులలాగా తిరస్కరించలేదు. “హిందూ జాతీయ వాదం బి.జె.పి పార్టీకి ఒక సమస్య మాత్రమే” అని తాను అన్నానని ‘అవకాశవాద’ అన్నపదం తాను వాడలేదనీ జైట్లీ తెలిపాడు. అవకాశవాదం అన్నది తన దృక్పధం కాదనీ, తన భాష కూడా కాదనీ ఆ పదం రాయబారి సొంత వాడుక అయిఉండవచ్చనీ తెలిపాడు. కేబుల్ మొత్తాన్ని, సంభాషణ మొత్తాన్ని తిరస్కరించనందుకు ఇక్కడ జైట్లీ అభినందనీయుడు. బి.జె.పి అమెరికా వ్యతిరేకత ఉత్తుదేననీ, వాస్తవానికి అమెరికాకి బి.జె.పి, వ్యతిరేకం కాదని ఎల్.కె.అద్వాని అన్నట్లుగా మరొక కేబుల్ లో అమెరికా రాయబారి తెలిపాడు. అది అబద్ధమని అద్వాని ఖండించాడు.


తాజాగా మాయావతిపైన అమెరికా రాయబారి రాసిన కేబుల్ వెల్లడయింది. అందులో మాయావతి డిక్టేటర్‌లా వ్యవహరిస్తుందనీ, అధికారులు, విలేఖరుల ఫోన్లపై నిఘా పెడుతుందనీ, తనకు తెలియకుండా గవర్నర్ ని కలిసినందుకు ఒక మంత్రి చేత గుంజీళ్ళు తీయించిందనీ, ప్రధానమంత్రి పదవి కోసం కలలు కంటుందనీ, తనను ఎవరైనా హత్య చేస్తారన్న భయంతో తాను తినబోయే ఆహారాన్ని ఇద్దరు రుచిచూసే వాళ్ళని నియమించుకుందనీ, తనకు నచ్చిన బ్రాండు చెప్పుల కోసం తన ప్రవేటు జెట్ విమానాన్ని ముంబై పంపిందనీ ఇంకా ఇలాంటివి మరికొన్ని ఆ కేబుల్ లో రాశారు. దీనిపైన మాయవతి స్పందిస్తూ వికీలీక్స్ ఎడిటర్ జులియన్ అస్సాంజ్ ని పిచ్చోడని వర్ణిస్తూ, పిచ్చాసుపత్రికి పంపాలని కోరింది, అది వేరే విషయం.

అయితే, చిత్రంగా మాయావతిపై విడుదలయిన కేబుల్స్ పైన బి.జె.పి స్పందించింది. బి.జె.పి సీనియర్ నాయకుడు ముక్తర్ అబ్బాస్ నక్వీ “మాయావతి పాలన యొక్క అవినీతి ముఖాన్ని, ద్వంద్వ విధానాలని మాత్రమె డిప్లొమేటిక్ కేబుల్స్ వెల్లడించాయని” వ్యాఖ్యానించాడు. వికీలీక్స్ వెల్లడించిన అంశాలపై ఆమె వ్యాఖ్యలను ‘గర్వపూరితమైనవ’నీ ‘అవహేళనాత్మకమనీ’ విమర్శించాడు. జైట్లీ, అద్వానీ లపై వెల్లడయిన కేబుల్స్ లోని అంశాలు అమెరికా రాయబారి సొంత అభిప్రాయాలు కాగా, మాయావతి పై వెల్లడైనవి సరైనవీ, మాయావతి స్వరూపం వెల్లడించేవీ ఎలా అయ్యాయి? చిత్రంగా నక్వీ తన వ్యాఖ్యానంలో మాయావతినే ద్వంద్వ ప్రమాణాలని నిందించాడు. తాను స్వయంగా ద్వంద్వ ప్రమాణాలను అమలు చేస్తున్న సంగతి ముఖ్తార్ అబ్బాస నక్వీకి తట్టలేదని భావించాలా?

వ్యాఖ్యానించండి