జులియన్ అస్సాంజ్ పిచ్చోడు, ఆయన్ని పిచ్చాసుపత్రికి పంపండి -మాయావతి


వికీలీక్స్ విడుదల చేసిన కేబుల్స్‌ ద్వారా వెల్లడయిన సమాచారంలో తనపై ఆరోపణలు రావడం పట్ల మాయావతి స్పందించింది. ఆమె వికీలీక్స్ అధిపతి జులియన్ అస్సాంజ్ పైన విరుచుకుపడింది. జులియన్ పిచ్చోడని చెబుతూ ఆయన దేశం వాళ్ళు ఆయనని పిచ్చాసుపత్రికి పంపాలని కోరింది. వికీలీక్స్ సొంతదారు తన రాజకీయ ప్రత్యర్ధుల చేతుల్లో ఉండడమో లేక పిచ్చోడుగా మారడమో అయి ఉండాలని చెప్పింది. “ఆయన దేశ ప్రభుత్వాన్ని ఆయనను మానసిక రోగుల పునరావాస కేంద్రంలో చేర్చమని విజ్ఞప్తి చేస్తాను. వారి దేశంలో ఆయనను ఉంచడానికి చోటు లేనట్లయితే ఆగ్రా పిచ్చాసుపత్రిలో చేర్చించవచ్చు” అని మాయావతి పేర్కొంది.

తమ ప్రభుత్వం, అధికారులు, పార్టీ వ్యక్తులపైనా, తనపైనా వచ్చిన ఆరోపణలు నిరాధారమని మాయావతి చెప్పింది. “అవి తప్పు. మోసపూరితమైనవి. పరువును బజారుకీడ్చడానికి ఉద్దేశించినవి. ప్రభుత్వ ఇమేజిని దెబ్బతీయడానికి ఉద్దేశించినవి. వాటిని ఖండిస్తున్నాను” అని మాయావతి విలేఖరుల సమావేశంలో పేర్కొంది. మురికి రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించింది. మీడియాలోని ఒక సెక్షన్ కేవల ఒకవైపు వార్తలను మాత్రమే చూపడం, ప్రభుత్వ స్పందన కూడా తీసుకోకుండా చూపడం సరైంది కాదని విమర్శించింది. మాయావతి దళిత కార్డును కూడా వినియోగించింది. అమెరికాలో దళితవ్యతిరేక మెంటాలిటీ ఉన్న సంగతిని కేబుల్స్ ధృవపరుస్తున్నాయని ఆమే ఎత్తి చూపింది.

తనకు నచ్చిన బ్రాండు చెప్పుల కోసం మాయావతి తన ప్రవేటు జెట్ విమానాన్ని ఖాళీగా ముంబైకి పంపిందని వికీలీక్స్‌లో వెల్లడయిన అమెరికా రాయబారి కేబుల్స్ ద్వారా తెలిసింది. ప్రధానమంత్రి పదవి మీదనే ఆమె దృష్టి కేంద్రీకృతమైనదని కేబుల్ ద్వారా అమెరికా ప్రభుత్వానికి సమాచారం పంపారు. భద్రతా భయంతో తొమ్మిదిమంది వంటవాళ్లను, రుచి చూడడానికి ఇద్దరిని నియమించుకుందని కేబుల్ తెలిపింది. అయితే ఇవన్నీ అమెరికా రాయబారి తాను ప్రభుత్వంలోనూ, ఇతర చోట్లా నియమించుకున్న కాంటాక్టుల ద్వారా సేకరించుకున్న సమాచారం మాత్రమే. అమెరికా రాయబారికి చెప్పినవాళ్ళకి కూడా మరొకరు చెప్పడం జరిగి ఉండవచ్చు.

గూఢచార పద్ధతుల్లో అమెరికా రాయబారులు తమ ప్రభుత్వానికి కేబుల్స్ ద్వరా పంపిన సమాచారాన్ని వికీలీక్స్ వెల్లడిస్తున్నదే తప్ప, కేబుల్స్‌లో ఉన్న సమాచారానికి జులియన్ అస్సాంజ్ బాధ్యుడు కాదు. కనుక మాయావతి వికీలీక్స్ అధిపతి జులియన్ ‌ను నిందించడం పూర్తిగా అసమంజసం. మాయావతి స్పందించవలసింది అటువంటి సమాచారాన్ని  రాసి అమెరికా ప్రభుత్వానికి పంపినవారిపైనే తప్ప, పంపిన సమాచారాన్ని లీక్ చేసినవారిపైన కాదు. నిజానికి అమెరికా రాయబారులు తన గురించి ఏమనుకుంటన్నదీ తెలిపినందుకు ఆమె జులియన్ అస్సాంజ్ కి కృతజ్ఞతలు చెప్పుకోవలసి ఉండగా, అది మరిచి ఆయనను పిచ్చోడని నిందించడం సరైంది కాదు.

“బి.జె.పి నాయకుడు ముక్తర్ అబ్బాస్ నక్వీ అంటున్నట్లు, చెప్పులు తేవడానికి, ముంబైకి విమానాన్ని ఎప్పుడు పంపినదీ నా వద్ద సమాచారం లేదు. ఆయనా (నక్వీ), వికీలీక్స్ ఓనరూ ఇద్దరూ ఆ విమానంలోనే ప్రయాణించినట్లు కనిపిస్తోంది” అని మాయావతి తెలిపింది. తన ఇద్దరు సహాయకులు కేబుల్స్ లో స్ధానం సంపాదించారని తెలిపినపుడు మాయావతి ఇప్పటినుండీ వారికి మరింత ప్రాముఖ్యత ఇస్తామని ప్రకటించింది. “నిజాయితీ గలిగిన అధికారులు, పార్టీకి అంకితమైన కార్యకర్తల పరువు తీయడానికి ప్రయత్నం జరిగితే ఇప్పటి నుండి వారికి మరింత ప్రాముఖ్యం ఇస్తాను” అని మాయావతి పేర్కొన్నది.

అమెరికా రాయబారులు రాసిన సమాచారం మాత్రమే వికీలీక్స్ బైటపెట్టిన కేబుల్స్ వెల్లడిస్తున్నాయి. కేబుల్స్ రచయిత వికీలీక్స్ కాదు, జులియన్ అస్సాంజ్ అంతకంటే కాదు. సమాచారాన్ని మూడో వ్యక్తి ద్వారానో లేదా ఇంటర్వూల ద్వారా సేకరించడం ద్వారానో ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్న అమెరికా రాయబారులు దానినే అమెరికా ప్రభుత్వానికి కేబుల్స్ ద్వారా పంపుతున్నారు. ఇంటర్వూలలో ఫలానా విషయం చెప్పాడు అనంటే అది నిజం కావచ్చు. ఎందుకంతే అది కేవలం రిపోర్టింగే కనుక. ఫలనా చేశాడట లేదా అలా వ్యవహరించిందంట అంటూ రాసే రాతలకు కేవలం రాయబారి మాత్రమే బాధ్యుడు. కనుక మాయావతి లాంటి వారి కోప తాపాలు అమెరికా రాయబారులపైనా, రాయబారులను అటువంటి అనైతిక చర్యలకు ఉపయోగిస్తున్న అమెరికా ప్రభుత్వం పైనా ఎక్కుపెట్టబడాలి తప్ప ఏ పాత్రాలేని జులియన్ అస్సాంజ్ పైన కాదు.

3 thoughts on “జులియన్ అస్సాంజ్ పిచ్చోడు, ఆయన్ని పిచ్చాసుపత్రికి పంపండి -మాయావతి

వ్యాఖ్యానించండి