గడ్డాఫీ నైగర్‌కు తరలివెళ్ళడానికి సహకరించిన ఫ్రాన్సు?


లిబియాకు దక్షిణాన ఉన్న నైగర్ దేశానికి క్షేమంగా వెళ్లడానికి ఫాన్సు, గడ్డాఫీకి సహకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. లిబియా ఆర్మీకి చెందిన 200 నుండి 250 వరకూ గల వాహనాల కాన్వాయ్ లిబియా సరిహద్దులను దాటి నైగర్ లోకి ప్రవేశించినట్లుగా రాయిటర్స్, బిబిసి లు వార్తా సంస్ధలు తెలిపాయి. అత్యంత పేద దేశమయిన నైగర్ ఫ్రాన్సుకి మాజీ వలస. ఫ్రాన్సు, నైగర్ ల మిలట్రీ వర్గాలనుండి అందిన సమాచారం మేరకు గడ్డాఫీ పునరావాసం కోసం జరిగిన రహస్య చర్చలు, ఒప్పందం మేరకే లిబియా ఆర్మీ కాన్వాయ్ తరలి వెళ్ళినట్లు తెలుస్తోందని రాయిటర్స్ తెలిపింది.

నైగర్ దేశం లిబియాకు దక్షిణ సరిహద్దుగా ఉన్నది. కాన్వాయ్ ప్రయాణం మధ్యలో గడ్డాఫి ఉన్న వాహానాలు కూడా కలిసి ఉండొచ్చనీ, అక్కడి నుండి గడ్డాఫీ బర్కినాఫాసో దేశానికి వెళ్లి ఉండవచ్చనీ తెలుస్తోంది. బర్కినాఫాసో గడ్డాఫీకి ఆశ్రయం ఇస్తానని ముందుకొచ్చింది. కొన్ని వర్గాలు గడ్డాఫీ వాహనాలు ఉన్న కాన్వాయ్ నేరుగా నైగర్ వెళ్ళలేదనీ, మొదట అల్జీరియాకు వెళ్ళి అక్కడనుండి నైగర్ కి వెళ్ళి ఉండవచ్చనీ తెలుపుతున్నాయి. అల్జీరియా, గడ్డాఫీ భార్య, కూతురు, ఇద్దరు కుమారులకు ఆశ్రయం కల్పించింది. గడ్డాఫీ కుటుంబానికి ఆశ్రయం ఇచ్చినందుకు అల్జీరియాపై లిబియా తిరుగుబాటు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

లిబియా ఆర్మీ వాహనాల కాన్వాయ్ లో దక్షిణ లిబియాలో ఉన్న ఆర్మీ యూనిట్ల అధికారులు ఉండవచ్చనీ ఫ్రాన్సు మిలట్రీ వర్గాలు తెలిపాయని రాయిటర్స్ తెలిపింది. గడ్డాఫీ ప్రయాణాన్ని ఫ్రాన్సే ఏర్పాటు చేసిందని చెబుతున్నప్పటికీ ఫ్రెంచి విదేశాంగ మంత్రిత్వ శాఖ దానిని ధృవీకరించడానికి నిరాకరించింది. నైగర్ లో లిబియా కాన్వాయ్ వచ్చినట్లుగానీ, గడ్డాఫీతో ఒప్పందం కుదిర్చినట్లు గానీ సమాచారం ఏదీ తమ వద్ద లేదని ఫ్రాన్సు విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపాడు. అంతపెద్ద కాన్వాయ్ దేశం దాటుతున్నపుడు లిబియా తిరుగుబాటు ప్రభుత్వానికి గానీ, దానికి సాయం చేస్తున్న నాటో సైన్యానికి గానీ తెలియకుండా ఉండడం దాదాపు అసాధ్యం. నాటోకి తెలిసి జరిగిన ప్రయాణం వెనుక ఖచ్చితంగా ఒప్పందం జరిగి ఉండాలి.

బర్కినా ఫాసో గతంలో లిబియా నుండి సహాయం పొందిన దేశం. అందువలనే కాబోలు, గడ్డాఫీకి ఆశ్రయం ఇస్తానని ప్రకటించింది. అయితే ఆదేశం లిబియా తిరుగుబాటు ప్రభుత్వాన్ని కూడా గుర్తించడం విశేషం.

వ్యాఖ్యానించండి